ఇక మూడు మ్యాచ్‌లే..

ABN , First Publish Date - 2022-09-28T09:54:34+05:30 IST

వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్‌ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు రోహిత్‌ సేనకిది ఆఖరి అవకాశం.

ఇక మూడు మ్యాచ్‌లే..

మెగా టోర్నీకిదే చివరి సన్నాహకం

సమస్యగా భారత డెత్‌ బౌలింగ్‌

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 నేడు 

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


టీ20 ప్రపంచకప్‌ కోసం అస్త్రశస్త్రాలు సరిచేసుకునేందుకు భారత జట్టుకు మిగిలినవి మూడు మ్యాచ్‌లే. డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఉండీ ఆసియాక్‌పలో కనీసం ఫైనల్‌ చేరలేకపోయిన టీమిండియా.. ఆ తర్వాత ఆసీ్‌సపై మూడు టీ20ల సిరీ్‌సను 2-1తో గెలిచింది. అయినా మెగా టోర్నీలో సత్తా చాటేందుకు ఈ ప్రదర్శన సరిపోదు. ఎందుకంటే.. జట్టులో సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇంకా మిగిలే ఉన్నాయి. డెత్‌ ఓవర్లలో పరుగుల వరదను అరికట్టలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అందుకే సఫారీలతో పోరులోనైనా బౌలింగ్‌ గాడిలో పడాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది.


తిరువనంతపురం: వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్‌ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు రోహిత్‌ సేనకిది ఆఖరి అవకాశం. బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ జరుగనుంది. జట్టు బలహీనతలను అధిగమించేందుకు తీవ్రస్థాయిలోనే కసరత్తు చేయాలి. ఇప్పటిదాకా అవకాశం రాని పలువురు ఆటగాళ్లను పరీక్షించి సమరానికి సన్నద్ధం చేయాలి. ఆషామాషీగా మెగా టోర్నీలో అడుగుపెడితే ఆసియాకప్‌ పరాభవమే ఎదురవుతుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ లేకుండానే జట్టు ఈ సిరీస్‌ ఆడనుంది. టీ20 ప్రపంచక్‌పనకు స్టాండ్‌బైగా ఎంపికైన వెటరన్‌ పేసర్‌ షమి కొవిడ్‌ కారణంగా ఈ సిరీ్‌సకు కూడా దూరమయ్యాడు. ఇక గాయంతో హుడా కూడా ఆడలేని పరిస్థితి. అటు హిట్టర్లకు కొదువలేని దక్షిణాఫ్రికా చివరి 18 టీ20 మ్యాచ్‌ల్లో 13 గెలిచింది. ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లపై సిరీ్‌సలు నెగ్గి జోష్‌లో ఉంది. ఓవరాల్‌గా సఫారీలతో భారత్‌ ఆడిన 20 టీ20ల్లో 11 సార్లు గెలిచి ఎనిమిదింట్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.


‘డెత్‌’ వణికిస్తోంది..

ప్రత్యర్థులను కంగారెత్తించాల్సిన డెత్‌ బౌలింగ్‌.. భారత్‌నే వణికిస్తోంది. ఆసీ్‌సతో జరిగిన సిరీ్‌సలో ప్రతీ మ్యాచ్‌లోనూ గతి తప్పిన బంతులతో వారి స్కోర్లను అనూహ్యంగా పెంచేశారు. తొలి టీ20లోనైతే 208 పరుగులు చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అలాగే ఆఖరి మ్యాచ్‌లో 115/5 స్కోరుతో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ 186 పరుగులు చేయగలిగిందన్నా ఆఖరి ఓవర్లే కారణం. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకున్న భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ తేలిపోయారు. గాయం నుంచి కోలుకున్న హర్షల్‌ తన ఉత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అతడి కెరీర్‌ ఎకానమీ 9.05గా ఉన్నా.. ఆసీ్‌సతో సిరీ్‌సలో మాత్రం ఓవర్‌కు 12కు పైగా రన్స్‌ ఇచ్చుకున్నాడు. అందుకే బెంచీకే పరిమితమైన దీపక్‌ చాహర్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించాల్సి ఉంది.


ఇక ఈ సిరీ్‌సకు అర్ష్‌దీప్‌ అందుబాటులో ఉండడం ఊరటనిచ్చే విషయం. స్లాగ్‌ ఓవర్లలో అతను పరుగులు కట్టడి చేసే చాన్సుంది. అటు బుమ్రా కూడా గాయం నుంచి కోలుకున్నాక లయ అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఉప్పల్‌ మ్యాచ్‌ ద్వారా కెరీర్‌లోనే తొలిసారిగా 50 పరుగులిచ్చుకోవడం అతడి తడబాటును సూచిస్తోంది. మరోవైపు జడేజా స్థానంలో ఆడుతున్న అక్షర్‌ పటేల్‌ అదరగొడుతున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు ఆటగాళ్లందరికీ అవకాశం దక్కాలని కెప్టెన్‌ రోహిత్‌ అభిప్రాయపడుతున్నాడు. దీంతో వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు ఈ సిరీ్‌స బరిలోకి దిగే చాన్స్‌ దక్కవచ్చు. అటు బ్యాటింగ్‌లో జట్టు విశేషంగా రాణిస్తున్నా రాహుల్‌ ఫామ్‌ ఆందోళనకరంగానే ఉంది. రోహిత్‌, కోహ్లీ టచ్‌లో ఉండడంతో రాహుల్‌ కూడా రాణిస్తే భారత టాపార్డర్‌ అబేధ్యంగా ఉంటుంది. ఇక ఫినిషర్‌ దినేశ్‌ కార్తీక్‌కు ఆసీస్‌ సిరీ్‌సలో 8 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. మధ్య ఓవర్లలో అతడు మరింత సమయం గడిపితే జట్టుకు ప్రయోజనకరం.


స్టార్లకు కొదువ లేదు

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న మార్‌క్రమ్‌తో పాటు డికాక్‌, మిల్లర్‌, హెన్‌డ్రిక్స్‌, రొసోలతో పాటు యువ సంచలనం ట్రిస్టియాన్‌ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే కనిపిస్తోంది. హెన్‌డ్రిక్స్‌ చివరి ఐదు టీ20ల్లో నాలుగు అర్ధసెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ బవుమా రాకతో అతడు ఓపెనర్‌ను నుంచి వన్‌డౌన్‌కు మారే అవకాశం ఉంది. బౌలింగ్‌లో రబాడ, నోకియా, జాన్సెన్‌ స్పిన్నర్‌ షంసీ భారత్‌ను ఇబ్బందిపెట్టగలరు.


తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, అక్షర్‌, దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ చాహర్‌/హర్షల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, బుమ్రా, చాహల్‌.


దక్షిణాఫ్రికా:

బవుమా (కెప్టెన్‌), డికాక్‌,  రైలీ రొసో/హెన్‌డ్రిక్స్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌, ఫెలుక్వాయో/ప్రిటోరియస్‌, జాన్సెన్‌, రబాడ, నోకియా, షంసీ.


పిచ్‌, వాతావరణం 

గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇప్పటిదాకా రెండు అంతర్జాతీయ టీ20లు మాత్రమే జరిగాయి. ఇందులో ఒకటి మాత్రమే పూర్తి ఓవర్లపాటు సాగింది. ఇక ఆకాశం మేఘావృతంగా ఉండి చిరుజల్లులకు ఆస్కారం లేకపోలేదు. అయితే మ్యాచ్‌కు ఆటంకం కలిగించే పరిస్థితి రాకపోవచ్చు.

Updated Date - 2022-09-28T09:54:34+05:30 IST