4బంతుల్లో 4 వికెట్లు

ABN , First Publish Date - 2021-10-19T08:01:45+05:30 IST

పేసర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ (4/26) నాలుగు బంతుల్లో (హ్యాట్రిక్‌ సహా) నాలుగు వికెట్ల అరుదైన ఫీట్‌తో.. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

4బంతుల్లో 4 వికెట్లు

ఐర్లాండ్‌ పేసర్‌ క్యాంఫర్‌ సంచలనం

ఏడు వికెట్లతో నెదర్లాండ్స్‌ చిత్తు

టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా క్యాంఫర్‌. 2007లో ఆస్ట్రేలియా పేసర్‌ బ్రెట్‌ లీ.. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. కాగా, ఐర్లాండ్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ తీసిన తొలి ఆటగాడిగానూ క్యాంఫర్‌ రికార్డులకెక్కాడు. 


టీ20 క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా క్యాంఫర్‌. గతంలో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ, అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ ఘనతను అందుకున్నారు. 


అబుధాబి: పేసర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ (4/26) నాలుగు బంతుల్లో (హ్యాట్రిక్‌ సహా) నాలుగు వికెట్ల అరుదైన ఫీట్‌తో.. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్‌-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్‌ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గారెత్‌ డెలాని (44), పాల్‌ స్టిర్లింగ్‌ (30 నాటౌట్‌) మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్‌ సునాయాసంగా గెలిచింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ క్యాంఫర్‌ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. మార్క్‌ అడైర్‌ (3/9) మూడు వికెట్లతో మంచి సహకారం అందించాడు. 10వ ఓవర్‌ బౌల్‌ చేసిన క్యాంఫర్‌.. డచ్‌ బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. తొలి బంతికి వైడ్‌ ఇచ్చినా.. వరుస బంతుల్లో కొలిన్‌ అకెర్‌మన్‌ (11), రియాన్‌ టెన్‌ డస్కటె (0), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (0)ను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐదో బంతికి రోలఫ్‌ వాన్‌డర్‌ మెర్వ్‌ను డకౌట్‌ చేసిన క్యాంఫర్‌.. టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. దీంతో నెదర్లాండ్స్‌ 51/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, ఓపెనర్‌ మ్యాక్స్‌ ఒ డౌడ్‌ (51) పోరాటంతో టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. 


సంక్షిప్త స్కోర్లు;

నెదర్లాండ్స్‌: 20 ఓవర్లలో 106 ఆలౌట్‌ (మ్యాక్స్‌ ఒ డౌడ్‌ 51, పీటర్‌ సీలర్‌ 21; క్యాంఫర్‌ 4/26, అడైర్‌ 3/9). 

ఐర్లాండ్‌: 15.1 ఓవర్లలో 107/3 (గారెత్‌ డెలాని 44, పాల్‌ స్టిర్లింగ్‌ 30 నాటౌట్‌; పీటర్‌ సీలర్‌ 1/14, క్లాసెన్‌ 1/18).

Updated Date - 2021-10-19T08:01:45+05:30 IST