Abn logo
Oct 24 2021 @ 02:28AM

తగ్గేదేలే!

పాకిస్థాన్‌తో భారత్‌ పోరు నేడు 

ఒత్తిడిలో  దాయాది జట్టు

ఆత్మవిశ్వాసంతో కోహ్లీసేన

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో


ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమరం..

ఐసీసీ టోర్నీ ఏదైనా సరే.. ఆ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఎప్పుడెప్పుడు తిలకిద్దామా? అని అందరిలో ఊపేసే ఉత్కంఠ..

వెరసి టీ20 ప్రపంచకప్‌ ఆరంభ దశలోనే దిమ్మతిరిగే మ్యాచ్‌ ఇది.. 

బంతి బంతికీ హార్ట్‌ బీట్‌ పెంచేందుకు.. పరుగు పరుగుకూ 

ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మన ముందుకు వస్తోంది..

ఇతరుల దృష్టిలో ఇది ఓ పోటీ మాత్రమే కావచ్చు.. 

కానీ ఇరు దేశాల అభిమానులకు మాత్రం సాక్షాత్తూ యుద్ధమే.

మొత్తంగా అన్ని మ్యాచ్‌లూ ఒకెత్తు.. ఈ ఒక్క పోరు మరో ఎత్తు..

నిజమే.. భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ గురించే ఇదంతా..

అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతుండగా.. మరోవైపు 

భావోద్వేగాలను.. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ఇరు జట్ల క్రికెటర్లు 

మైదానంలో సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. 

అన్ని విభాగాల్లోనూ కోహ్లీ-బాబర్‌ సైన్యం ఢీ అండే ఢీ అనేలా 

కనిపిస్తుండడంతో ఫ్యాన్స్‌కు ధనాధన్‌ ధమాకా ఖాయమే..

ఇక ఆదివారం రాత్రి ఈ బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించేందుకు 

అంతా రెడీగా ఉండడమే తరువాయి.12-0 

ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. వన్డే వరల్డ్‌క్‌పలో ఏడు సార్లు.. టీ20 ప్రపంచక్‌పలో ఐదుసార్లు గెలిచింది.


71

ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లాడితే భారత్‌ ఏడింటిలో గెలిచింది.


3

ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా పాక్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లీ (78నా., 36 నా., 55 నా.) అజేయంగా నిలిచాడు.


దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీకే బాప్‌ అనదగ్గ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్లు అభిమానులను కనువిందు చేయబోతున్నాయి. ఆదివారం స్థానిక దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో దాయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాలనుకుంటున్నాయి. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. బ్రాడ్‌కాస్టర్ల ఖజానా నింపే ఈ మ్యాచ్‌ కోసం 17,500 టిక్కెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోవడం విశేషం. అటు సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజమ్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుత బలాబలాల పరంగానూ మాజీ చాంపియన్లు సమవుజ్జీలుగానే కనిపిస్తుండడం.. ఇక్కడి వేదిక కూడా రెండు జట్లకు అలవాటే కావడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగవచ్చు.


తేలిగ్గా తీసుకుంటే అంతే..

టీ20 ప్రపంచక్‌పలో తొలిసారిగా కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు పాక్‌ను ఎదుర్కొనబోతోంది. అటు కోహ్లీకి ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఇదే ఆఖరి టోర్నీ కూడా. అందుకే అన్ని విధాలా ఈ మ్యాచ్‌ చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతకుముందు ఐదుసార్లు ఈ మెగా టోర్నీల్లో ధోనీ ఆధ్వర్యంలోనే జట్టు బరిలోకి దిగింది. ఇప్పుడు ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లో బలంగా కనిపిస్తున్న పాక్‌ జట్టును.. గత రికార్డును దృష్టిలో ఉంచుకుని తేలిగ్గా తీసుకుంటే షాక్‌ తప్పదు. భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. పేసర్‌ షహీన్‌ షా అఫ్రీదిని వీరు దీటుగా ఎదుర్కొని పరుగులు రాబడితే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లీ నెంబర్‌ త్రీలో రావడం ఖాయం కాగా, ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో సూర్యకుమార్‌ దూకుడు జట్టుకు లాభించనుంది. ఆరో నెంబర్‌లో హార్దిక్‌ వైపే కోహ్లీ మొగ్గు చూపుతున్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజాకు జతగా అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌లలో ఒకరిని ఆడించవచ్చు. పేస్‌ త్రయం బుమ్రా, షమి, శార్దూల్‌ పాక్‌ బ్యాటర్స్‌ పనిబట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.


చరిత్ర మార్చాలని..

ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయాలు లేకున్నా పాక్‌ ఆ గతాన్ని గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ జట్టు టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడిన 25 టీ20ల్లో 15 మ్యాచ్‌లు గెలిచారు. పాక్‌ టాపార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (1462), కెప్టెన్‌ ఆజమ్‌ (1363) ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన  టాప్‌-2 క్రికెటర్లు. ఆజమ్‌ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదే జోరును భారత్‌పైనా చూపాలనుకుంటున్నారు. ఇక నెంబర్‌ 3లో ఫఖర్‌ జమాన్‌ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు వామ్‌ప మ్యాచుల్లో కలిపి అతను 98 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో లెఫ్టామ్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రీది ఇబ్బందిపెట్టవచ్చు. ఎందుకంటే భారత కుడిచేతి బ్యాటర్స్‌ ఎడమచేతి పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతుంటారు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్‌ ఆమిర్‌ను భారత టాపార్డర్‌ ఆడలేక మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక స్పిన్నర్లు ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌ కూడా జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నారు.

జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌/రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌/శార్దూల్‌, షమి, బుమ్రా.


పాకిస్థాన్‌:

బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, హఫీజ్‌, షోయబ్‌/హైదర్‌ అలీ, అసిఫ్‌ అలీ, ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, హరీస్‌ రౌఫ్‌, షహీన్‌ అఫ్రీది.


పిచ్‌

ఇక్కడి వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. దీంతో భారీ స్కోరుకు అవకాశముంది. అయితే మంచు కూడా ప్రభావం చూపనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశముంది. ఇక్కడ చేజింగ్‌ జట్లకు విజయాల శాతం ఎక్కువగా ఉంది.

మా అత్యుత్తమ గేమ్‌ ఆడాల్సిందే..

పాక్‌పై మా గత ప్రదర్శన గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుత మ్యాచ్‌ కోసం ఎలా బరిలోకి దిగుతున్నామనేదే ముఖ్యం. ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మేం ఉత్తమ ప్రదర్శన కనబరచాల్సిందే. ఆరో నెంబర్‌లో హార్దిక్‌ సామర్థ్యం గురించి మాకు తెలుసు. ఆ స్థానంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని రాత్రికి రాత్రే తీసుకురాలేం. అతని ఫిట్‌నెస్‌ మెరుగ్గానే ఉంది. అవసరమైతే రెండు ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

- విరాట్‌ కోహ్లీ

ఈసారి మాదే విజయం

గతం ఓ చరిత్ర. పెద్ద టోర్నీలో ఆడుతున్నప్పుడు నమ్మకం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. జట్టుగా మేమంతా ఇప్పుడు పటిష్టంగా ఉన్నాం. ఇంతకుముందు ఏం జరిగిందనేది మాకు అనవసరం. ఈసారి మాత్రం భారత్‌పై గెలుస్తామనే భావిస్తున్నాం. దీనికోసం ఒత్తిడిని అధిగమించి ప్రశాంత చిత్తంతో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడి వికెట్‌పై మాకు పూర్తి అవగాహన ఉంది.

- బాబర్‌ ఆజమ్‌

క్రైమ్ మరిన్ని...