వార్‌ ముదురుతోంది

ABN , First Publish Date - 2020-05-28T08:55:16+05:30 IST

ఐసీసీ, బీసీసీఐ మధ్య ట్యాక్స్‌ వార్‌ ముదురుతోంది. పన్ను మినహాయింపుల గురించి భారత బోర్డుకు మరింత సమయం ఇవ్వడానికి ఐసీసీ ...

వార్‌ ముదురుతోంది

టీ20 వరల్డ్‌కప్‌-2021 ఆతిథ్యం  రద్దుపై ఐసీసీ హెచ్చరిక

క్రికెట్‌కే నష్టమంటున్న బీసీసీఐ


న్యూఢిల్లీ: ఐసీసీ, బీసీసీఐ మధ్య ట్యాక్స్‌ వార్‌ ముదురుతోంది. పన్ను మినహాయింపుల గురించి భారత బోర్డుకు మరింత సమయం ఇవ్వడానికి ఐసీసీ బిజినెస్‌ కార్పొరేషన్‌ (ఐబీసీ) తిరస్కరించింది. మినహాయింపులు ఇవ్వకపోతే 2021 టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను కూడా వెనక్కు తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించింది. కానీ, క్రికెట్‌కు తీవ్ర నష్టం వాటిల్లే నిర్ణయాలను ఐసీసీ తీసుకోబోదని బీసీసీఐ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను రద్దు చేయడమంటే అది ఆత్మహత్యా సదృశ్యమే.  ఐసీసీ డైరెక్టర్లు ఇలాంటి నిర్ణయాలను తీసుకోబోరనే అనుకుంటున్నామ’ని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ ఐసీసీ మూర్ఖంగా ప్రవర్తిస్తే.. దాని పర్యవసనాలను చూసి బీసీసీఐ జాలిపడడం తప్ప మరేం చేయలేదన్నారు. కానీ, ఐసీసీకి మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగుల్చుతుందని చెప్పారు. భారత బోర్డుకు వ్యతిరేకంగా ఐసీసీని తప్పుదారి పట్టిస్తున్న వారిని తక్షణం దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మెయిల్స్‌ పంపడం బీసీసీఐని ఓ రకంగా ఒత్తిడికి గురి చేయడమే. ఐసీసీ నాయకత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరుగుతున్నది’ అని బోర్డు అధికారి అన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే టీ20 వరల్డ్‌క్‌పనకు సంబంధించి ట్యాక్స్‌ మినహాయింపులపై స్పష్టత ఇవ్వడానికి గతనెల డెడ్‌లైన్‌ విధించారు. కానీ, కరోనా కారణంగా భారత బోర్డు జూన్‌ 30 తర్వాత ఓ నెల సమయం కోరింది. దీనికి ఐబీసీ ఏమాత్రం ఒప్పుకోవడం లేదని ఐసీసీ చెప్పింది.

Updated Date - 2020-05-28T08:55:16+05:30 IST