Abn logo
Feb 21 2020 @ 04:47AM

అమ్మాయిల ధనాధన్

నేటినుంచి టీ20 వరల్డ్‌కప్‌

ప్రైజ్‌మనీ విజేతకు: రూ. 7.16 కోట్లు

రన్నర్‌పకు: రూ. 3.58 కోట్లు


క్రికెట్‌లో ఇప్పుడంతా ‘ధనాధన్‌’ యుగం.. మూడు గంటల్లోనూ మ్యాచ్‌ ముగియాలి.. అది కూడా నరాలు తెగే ఉత్కంఠతో మజా పంచాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువు, ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో మునిగి తేలిన ఫ్యాన్స్‌ సినిమాలతోపాటు పొట్టి క్రికెట్‌ వీక్షణం ద్వారా సాంత్వన చెందుతుండడంతో ఈ మ్యాచ్‌లకు క్రేజ్‌ బాగా పెరిగింది. అందుకే ఐసీసీ కూడా ఈ తరహా సిరీ్‌సలకు ప్రాధాన్యమిస్తోంది. ఇక కొత్త దశాబ్దిలో పొట్టి క్రికెట్‌ తొలి వరల్డ్‌కప్‌ మహిళల విభాగంలో జరగబోతోంది.10 జట్లు..17 రోజులపాటు 23 మ్యాచ్‌ల్లో తలపడే ఈ మెగా టోర్నీకి శుక్రవారం సిడ్నీలో తెరలేస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతోంది.


ఆడేది ఎవరైనా టీ20 క్రికెట్‌ అంటే అభిమానులకు ఎక్కడలేని ఆసక్తి. దాంతో పురుషులకు ఏమాత్రం తీసిపోని ఆటతో అమ్మాయిలూ అదుర్స్‌ అనిపిస్తున్నారు. రాబోయే రెండున్నర వారాలు క్రికెట్‌ ప్రేమికులకు పసందైన ‘పొట్టి’ విందు అందించేందుకు  జట్లు సిద్ధమయ్యాయి. కానీ ఫ్యాన్స్‌ దృష్టంతా భారత్‌, గత టోర్నీ విజేత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌పైనే. మరీ ముఖ్యంగా భారత్‌, ఆసీస్‌, కివీస్‌ తలపడుతున్న గ్రూప్‌ ‘ఎ’..‘గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌’గా ఉత్సుకత రేపుతోంది. ఐదేసి జట్లు ఒక్కో గ్రూపుగా బరిలోకి దిగుతుండగా..రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ వచ్చేనెల 8న మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. ఇక..రికార్డు స్థాయిలో నాలుగు టైటిళ్లు గెలిచిన ఆసీస్‌ మరోసారి హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 


గత విజేతలు

2009 - ఇంగ్లండ్‌

2010 - ఆస్ట్రేలియా

2012  - ఆస్ట్రేలియా

2014  - ఆస్ట్రేలియా

2016  -  వెస్టిండీస్‌

2018  - ఆస్ట్రేలియా


నోబాల్స్‌.. థర్డ్‌ అంపైర్‌

నోబాల్‌ నిర్ధారణకు టోర్నీలో తొలిసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మూడో అంపైర్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 


ఆరంభ పోరులో ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ నేడు

సిడ్నీ: ఆరుసార్లు ప్రపంచక్‌పలో తలపడి..మూడుసార్లు సెమీఫైనల్‌ దాకా చేరిన భారత మహిళలు ఈసారి అంతకుమించి పురోగమించడమేకాదు ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రతిష్ఠాత్మక ట్రోఫీని పట్టేయాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇందుకు హర్మన్‌ప్రీత్‌ సేన అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. అందులోనూ శుక్రవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. అందువల్ల తొలిమ్యాచ్‌లోనే కఠినపరీక్ష ఎదురుకానుంది. భారత జట్టు చాలాకాలంగా నిలకడగా రాణించడంలో విఫలమవుతోంది. వరల్డ్‌క్‌పనకు ముందు జరిగిన ముక్కోణపు టోర్నీయే ఇందుకు ఉదాహరణ. ఆ టోర్నీలో టీమిండియా ఫైనల్‌ చేరినా.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలపై ఒక్కో మ్యాచ్‌ గెలిచి మరోమ్యాచ్‌లో ఓడిపోయింది. తుది పోరుకు చేరినా.. ఆస్ట్రేలియాకు తలవంచింది. 


మిడిల్‌, లోయరార్డర్‌ మెరుగవ్వాలి..

నాకౌట్‌ దశలో ఆసీస్‌, ఇంగ్లండ్‌వంటి మేటి జట్లపై గెలవాలంటే భారత మిడిల్‌, లోయరార్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన కూడా నొక్కి చెప్పింది. తరచూ విఫలమవుతున్న మిడిలార్డర్‌... ఈ మెగా ఈవెంట్‌లో దానిని పునరావృతం కానీయకూడదు. ముఖ్యంగా..టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై గురుతర బాధ్యత ఉంది. ప్రతి పోరులోనూ వీరు బ్యాట్లకు పనిచెప్పాలి. ఇక నిలకడగా ఆడలేకపోతున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా ఆ సమస్యనుంచి బయటపడాలి.  

గత ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటర్‌ రిచా ఘోష్‌కు టోర్నీలో వరుసగా అవకాశాలు వస్తాయా లేదో చూడాలి. 


స్పిన్నర్లపైనే ఆశలు

నాణ్యమైన పేసర్లు అంతగా లేకపోవడంతో భారత బౌలింగ్‌ ఆశలన్నీ స్పిన్నర్లపైనే. ఈమధ్య కాలంలో మీడియం పేసర్‌ శిఖా పాండేనే పేస్‌ విభాగం బాధ్యతలు మోస్తోంది. దాంతో ఆరంభంలో వికెట్లు తీయాల్సిన బాధ్యత స్పిన్నర్లదే. గతటోర్నీ మాదిరే ఈసారీ భారత్‌ సెమీస్‌ చేరుతుందని అంచనా. ఆ దశను దాటితే ప్రస్తుతం మహిళల క్రికెట్‌కు భారత్‌లో లభిస్తున్న పాపులారిటీ మరింత పెరుగుతుంది. టైటిల్‌ ఫేవరెట్లలో భారత్‌ ఒకటని కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ కూడా అంటున్నాడు. 


ఆత్మవిశ్వాసంలో ఆసీస్‌

ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో భారత్‌పై సాధించిన విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో తొలి పోరుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. కానీ ఆ సిరీ్‌సలో ఆదనపు పేస్‌తో భారత బ్యాట్స్‌వుమెన్‌ను గడగడలాడించిన స్టార్‌ పేసర్‌ వ్లామినిక్‌ పాదం గాయంతో దూరమవడం ఆతిథ్య జట్టుకు గట్టి ఎదురు దెబ్బే. ఫలితంగా వ్లామినిక్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ మోలీ స్ట్రానోకు చోటు కల్పించారు. 


జట్లు (అంచనా)

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), తానియా భాటియా (కీపర్‌), హర్లీన్‌ డియోల్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, రిచా ఘోష్‌, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధాన, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, పూజా వస్ర్తాకర్‌, షఫాలీ వర్మ, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌, 


ఆస్ట్రేలియా: మెగ్‌లానింగ్‌ (కెప్టెన్‌), ఎరిన్‌ బర్న్స్‌, నికోలా, ఆష్లీ గార్డ్‌నర్‌, రాచెల్‌ హేన్స్‌, అలీసా హీలీ (కీపర్‌), జొనాసెన్‌, డెలీసా, సోఫీ మోలినెక్స్‌, బెత్‌ మూనీ, ఎలీసా పెర్రీ, మేఘన్‌ షట్‌, అనాబెల్‌ సదర్లాండ్‌, వారెమ్‌, మోలీ స్ర్టానో.


మ్యాచ్‌ వేదికలు

సిడ్నీ, వాకా (పెర్త్‌), మనుకా ఓవల్‌ (కాన్‌బెర్రా), జంక్షన్‌ ఓవల్‌ (మెల్‌బోర్న్‌), సిడ్నీ, మెల్‌బోర్న్‌.


మధ్యాహ్నం 1.30 నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌ 2, 1 (తెలుగు),  దూరదర్శన్‌లలో..


గ్రూప్‌ ‘ఎ’ భారత్‌

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌

గ్రూప్‌ ‘బి’ 

ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌


ఫిబ్రవరి 21

ఆస్ట్రేలియాతో (మ. 1.30) 


ఫిబ్రవరి 24  బంగ్లాదేశ్‌తో 

(సా. 4.30)


ఫిబ్రవరి 27 న్యూజిలాండ్‌తో (ఉ. 8.30)


ఫిబ్రవరి 29  శ్రీలంకతో  (మ. 1.30)

 సెమీఫైనల్‌-1

మార్చి 5  ఉ. 8.30 సెమీఫైనల్‌

మార్చి 5 మఽ.1.30 


ఫైనల్‌ మార్చి 8  (మ. 1.3)

Advertisement
Advertisement
Advertisement