కుర్రాళ్లకు మరో చాన్స్‌

ABN , First Publish Date - 2022-06-26T10:12:56+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌ను ఆశిస్తున్న యువ ఆటగాళ్లకు మరో అద్భుత అవకాశమిది. సీనియర్‌ ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న వేళ.. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో

కుర్రాళ్లకు మరో చాన్స్‌

రాత్రి 9 గంటల నుంచి సోనీ సిక్స్‌లో..

నేటి నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌

రుతురాజ్‌, సంజూలపై దృష్టి


డబ్లిన్‌: టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌ను ఆశిస్తున్న యువ ఆటగాళ్లకు మరో అద్భుత అవకాశమిది. సీనియర్‌ ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న వేళ.. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఆదివారమే తొలి మ్యాచ్‌. ఐపీఎల్‌లో గుజరాత్‌ను అద్వితీయంగా ముందుకు నడిపించిన పాండ్యా టీమిండియాకు  తొలిసారి సారథిగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించాలనుకుంటోంది. 


ఉమ్రాన్‌కు చాన్స్‌ దక్కేనా?: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీ్‌సలో కోచ్‌ ద్రవిడ్‌ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒకే జట్టుతో ఆడించాడు. దీంతో ఐర్లాండ్‌పై ఒకరిద్దరు అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు. బెంచ్‌కే పరిమితమైన యువ పేసర్లు ఉమ్రాన్‌, అర్ష్‌దీ్‌పలకు నిరాశే మిగిలింది. ఐర్లాండ్‌ పిచ్‌లు ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలించనుండడంతో ఈ సిరీ్‌సలో వారికి చాన్స్‌ దక్కవచ్చు. అలాగే బ్యాటర్స్‌ దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు ఈ సిరీ్‌సకు ఎంపికైన త్రిపాఠి, శాంసన్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇక ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా అవకాశం దక్కిన రుతురాజ్‌ ఆశించిన మేర ఆడలేకపోయాడు. అతడికి కూడా ఈ సిరీస్‌ అత్యంత కీలకం కానుంది. మెగా టోర్నీకి ఇషాన్‌ రిజర్వ్‌ ఓపెనర్‌గా తన స్థానం ఖాయం చేసుకున్నట్టే. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్‌ 3 లేక నాలుగో నెంబర్‌లో దిగవచ్చు. మరోవైపు ప్రొటీ్‌సతో పోలిస్తే ఐర్లాండ్‌ అంత బలమైన జట్టు కాకపోవడంతో భారత్‌ ప్రయోగాలకు దిగవచ్చు.


అనుభవం కోసం..: సీనియర్‌ ఆటగాళ్లు లేకపోయినా భారత జట్టు పటిష్టంగానే ఉంటుందని ఐర్లాండ్‌ భావిస్తోంది. ఇలాంటి బలమైన టీమ్‌తో ఆడడం ద్వారా అంతర్జాతీయంగా రాటుదేలుతామని కెప్టెన్‌ ఆండ్రూ బల్బర్నీ చెప్పాడు. స్టీఫెన్‌ డోనీ, కోనర్‌ ఓల్ఫెర్ట్‌లకు తొలిసారి జట్టులో చోటు దక్కింది. ఆల్‌రౌండర్లు గ్యారెత్‌ డెలేని, పాల్‌ స్టిర్లింగ్‌, పేసర్‌ మార్క్‌ అడెయిర్‌ ఆధారపడదగ్గ ఆటగాళ్లు.


జట్లు (అంచనా)

భారత్‌: ఇషాన్‌, రుతురాజ్‌, సూర్యకు మార్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌, అవేశ్‌ ఖాన్‌/అర్ష్‌దీప్‌/ ఉమ్రాన్‌, చాహల్‌.

ఐర్లాండ్‌: స్టిర్లింగ్‌, బల్బర్నీ (కెప్టెన్‌), డెలె నీ, టెక్టార్‌, టకర్‌, కాంఫెర్‌, మెక్‌బ్రైన్‌, డాక్‌రెల్‌, అడెయిర్‌, మెక్‌కార్తి, లిటిల్‌. 



Updated Date - 2022-06-26T10:12:56+05:30 IST