మోర్గాన్‌ మోత

ABN , First Publish Date - 2020-02-17T10:30:44+05:30 IST

సౌతాఫ్రికా-ఇంగ్లండ్‌ సిరీస్‌లో తొలి రెండు టీ20ల మాదిరే ఆఖరి ఓవర్‌ వరకూ వచ్చింది కానీ.. వాటి మాదిరి ఉత్కంఠ రేపలేదు నిర్ణాయక మ్యాచ్‌....

మోర్గాన్‌ మోత

టార్గెట్‌-223ను ఛేదించిన ఇంగ్లండ్‌ 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ కైవసం

సెంచూరియన్‌: సౌతాఫ్రికా-ఇంగ్లండ్‌ సిరీస్‌లో తొలి రెండు టీ20ల మాదిరే ఆఖరి ఓవర్‌ వరకూ వచ్చింది కానీ.. వాటి మాదిరి ఉత్కంఠ రేపలేదు  నిర్ణాయక మ్యాచ్‌. 24 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడ్డారు. కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో కలిపి 52 పరుగులు రాబట్టారు. ఈక్రమంలో స్టోక్స్‌ అవుటైనా దూకుడు ఆపని మోర్గాన్‌ వరుస సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించాడు. దాంతో ఈ పోరులో ఐదు వికెట్లతో సులువుగా గెలుపొందిన ఇంగ్లండ్‌ జట్టు 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. క్లాసెన్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) హాఫ్‌ సెంచరీ చేశాడు. బవుమా (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49), డి కాక్‌ (24 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 35), మిల్లర్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్‌) తలో చేయి వేశారు. కర్రాన్‌, స్టోక్స్‌ చెరో రెండో వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (7) వికెట్‌ను ఇంగ్లండ్‌ త్వరగా కోల్పోయింది. కానీ బెయిర్‌ స్టో (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), కెప్టెన్‌ మోర్గాన్‌ (22 బంతుల్లో 7 సిక్సర్లతో 57 నాటౌట్‌), బట్లర్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) చెలరేగారు. వారికి స్టోక్స్‌ (12 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 22) ధాటి ఇన్నింగ్స్‌ తోడుకావడంతో ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 226/5 స్కోరుతో విజయాన్ని అందుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు మోర్గాన్‌కు దక్కాయి.


సంక్షిప్తస్కోరు

సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 222/6 (క్లాసెన్‌ 66, బవుమా 49, డి కాక్‌ 35, మిల్లర్‌ నాటౌట్‌ 35, కర్రాన్‌ 2/33, స్టోక్స్‌ 2/35)

ఇంగ్లండ్‌: 19.1 ఓవర్లలో 226/5 (బెయిర్‌ స్టో 64, మోర్గాన్‌ 57 నాటౌట్‌, బట్లర్‌ 57, స్టోక్స్‌ 22 ఎంగిడి 2/55).

Updated Date - 2020-02-17T10:30:44+05:30 IST