ఆంగ్ల మాధ్యమంలోనూ టి-సాట్ గ్రూప్-1 పాఠ్యాంశాలు

ABN , First Publish Date - 2022-07-01T00:28:39+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ -1 పోటీ పరీక్షలకు టి-సాట్ నెట్ వర్క్ ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలనూ సిద్ధం చేసింది.

ఆంగ్ల మాధ్యమంలోనూ టి-సాట్ గ్రూప్-1 పాఠ్యాంశాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ -1 పోటీ పరీక్షలకు టి-సాట్ నెట్ వర్క్ ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలనూ సిద్ధం చేసింది. జూలై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు గంట పాటు ప్రత్యేక ప్రసారాలు చేయాలని నిర్ణయించినట్టు టి-సాట్ సీఈవోశైలేష్ రెడ్డి గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ భాషలో సుమారు 60 గంటల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై రెండవ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి 10 గంటల వరకు టి-సాట్ విద్య ఛానల్ లో అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశాలు ప్రసారమౌతాయని, ఇవే పాఠ్యాంశాలు రాత్రి తొమ్మిది గంటల నుండి 10 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయన్నారు. 


గ్రూప్-1 ఉద్యోగార్థుల కోసం ఇప్పటికే తెలుగు మాధ్యమంలో టి-సాట్ ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి గత నెల రోజులుగా అరగంట నిడివి గల సుమారు 200 పాఠ్యాంశాలను ప్రసారం చేసిందని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్యార్థుల కోసం చేస్తున్న ప్రసారాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమ అభ్యర్థుల కోసం జూలై ఒకటవ తేదీ శుక్రవారం ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు గంట పాటు పాఠ్యాంశ నిపుణులు లైవ్ లో పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. ఎకనామి, జాగ్రఫి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై నిపుణులచే నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సీఈవో సూచించారు.


 గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం తెరపై కన్పించే విధంగాప్రశ్నలు-సమాధానాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తున్నామని శైలేష్ రెడ్డి తెలిపారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను సందిస్తూ సమాధానాలను ఆసక్తికరంగా వివరిస్తూ రూపొందించిన కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం గంట పాటు ఐదు నుండి ఆరు గంటల వరకు ప్రసారం చేస్తున్నామన్నారు. బుల్లి తెరపై ‘ప్రశ్నలు-సమాధానం’ కార్యక్రమానికి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తున్నందున ఈ పద్దతి ఎంచుకున్నట్లు సీఈవో వివరించారు. 

Updated Date - 2022-07-01T00:28:39+05:30 IST