Jul 23 2021 @ 17:19PM

మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా..!

అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో సైబరాబాద్‌ పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు.  ట్రెండ్‌కు అనుగుణంగా తమదైన శైలీలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలతో పాటు కరోనాపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందుకోసం స్టార్‌ హీరోల పోస్టర్లు, డైలాగ్‌లను అలవోకగా వాడేస్తుంటారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌, చరణ్‌ బైక్‌ మీద వెళ్తున్న పోస్టర్‌ను ట్రాఫిక్‌ అవగాహన కోసం ఉపయోగించిన ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా ‘నారప్ప’ సినిమా పోస్టర్‌ను కరోనా అవగాహన కోసం ఉపయోగించారు. పోస్టర్‌లో వెంకటేశ్‌ ముఖానికి మాస్క్‌ పెట్టి ‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’ అంటూ మీమ్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్‌ తెగ వైరల్‌ అవుతోంది.