ఉక్రెయిన్ ప్రజలపై ప్రయోగించేందుకు.. 16 వేల మంది ఐసిస్ మాజీ ఫైటర్ల నియామకం

ABN , First Publish Date - 2022-03-12T01:27:31+05:30 IST

ఉక్రెయిన్‌తో తలపడుతున్న రష్యా ఇప్పుడు మరో సరికొత్త వ్యూహానికి తెరతీసింది.

ఉక్రెయిన్ ప్రజలపై ప్రయోగించేందుకు.. 16 వేల మంది ఐసిస్ మాజీ ఫైటర్ల నియామకం

మాస్కో: ఉక్రెయిన్‌తో తలపడుతున్న రష్యా ఇప్పుడు మరో సరికొత్త వ్యూహానికి తెరతీసింది. ఉక్రెయిన్‌తో పోరాడేందుకు కొత్తగా విదేశీ ఫైటర్లను ముఖ్యంగా సిరియా, మధ్యప్రాచ్యానికి చెందిన ఐసిస్ మాజీ ఫైటర్లను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ కూడా ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనాలని కోరుకుంటున్న వారందరూ సిరియన్లు, మధ్యప్రాచ్యం వారేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో పోరుకు మధ్యప్రాచ్యం, సిరియా నుంచి ఎక్కువ మంది ముందుకొస్తున్నారని రక్షణ మంత్రి చెప్పినట్టు పెస్కోవ్ తెలిపారు. 


ఉక్రెయిన్‌కు స్వచ్ఛంద ఫైటర్లను పంపడం ఆమోదయోగ్యమేనని పెస్కోవ్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సైన్యంతో కలిసి పోరాడేందుకు కిరాయి సైనికులను పంపే చర్యలకు అమెరికా మద్దతిస్తోందని ఆరోపించిన పెస్కోవ్.. ఉక్రెయిన్‌కు స్వచ్ఛంద ఫైటర్లను పంపాలనే నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.


ఉక్రెయిన్‌లో పోరాడేందుకు విదేశాల నుంచి స్వచ్ఛంద ఫైటర్లను అనుమతించే ప్రణాళికకు పుతిన్ కూడా మద్దతిచ్చారు. రక్షణ మంత్రి సెర్గీ మాట్లాడుతూ.. మిలటరీ చర్యలో పాల్గొనాలని 16 వేల మందికిపైగా మధ్యప్రాచ్య వలంటీర్లను కోరినట్టు తెలిపారు. 

Updated Date - 2022-03-12T01:27:31+05:30 IST