Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలూ... పారాహుషార్‌

ఆంధ్రజ్యోతి(22-09-2020)

కొవిడ్‌కు చిన్నాపెద్దా తారతమ్యం లేదు! ఈ ఇన్‌ఫెక్షన్‌ పిల్లలకు చడీచప్పుడూ లేకుండా సోకుతుంది! ఆ సమయంలో అవసరానికి మించి స్పందించే వ్యాధినిరోధకశక్తి ఫలితంగా... ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి! కాబట్టి పిల్లలకు కరోనా సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి!


కరోనా మహమ్మారి వ్యాప్తి దశ ప్రారంభం నుంచే బడులకు సెలవులు ప్రకటించడం, పిల్లలను ఇంటికే పరిమితం చేయడంతో ఈ ఇన్‌ఫెక్షన్‌ నుంచి పిల్లలను రక్షించుకోగలిగాం. కాబట్టే కరోనా సోకిన పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. వారిలో వ్యాధి తీవ్రత కూడా పెద్దలతో పోలిస్తే తక్కువే! ఇందుకు తోడ్పడుతున్న ఇతర కారణాలు...


తక్కువ ఎసి2 రిసెప్టర్లు: కరోనా వైరస్‌ ఎసి2 రిసెప్టరురిసెప్టర్‌తో బైండ్‌ అయి ఊపిరితిత్తుల ద్వారా గుండె, పేగులు... ఇలా శరీరం మొత్తానికి విస్తరిస్తుంది. ఇలాంటి రిసెప్టర్లు పెద్దలతో పోలిస్తే పిల్లల్లో తక్కువ.


శ్వాసకోశాలు: పెద్దలతో పోలిస్తే పిల్లల్లో శ్వాసకోశ నాళాలు రెట్టింపు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వీటి రిపెయిర్‌ సామర్ధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా వాతావరణ కాలుష్యం, ధూమపానం లాంటి వాటికి పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి శ్వాసకోశాలు బలంగా ఉంటాయి.


వ్యాధినిరోధకశక్తి: పిల్లల్లో అంతర్గత (ఇన్నేట్‌) వ్యాధినిరోధకశక్తి సామర్థ్యం ఎక్కువ. ఇందుకు కారణం పిల్లలకు చిన్నతనంలోనే పలురకాల వైరస్‌ల నుంచి రక్షణగా వ్యాక్సీన్లు ఇప్పించడమే! కాబట్టి వైరస్‌ సోకినా వారి లోపలి వ్యాధినిరోధకశక్తి దాంతో సమర్థంగా పోరాడి అంతం చేయగలుగుతుంది. కాబట్టే పిల్లలకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినా ప్రభావం తక్కువ.


కోమార్బిడ్‌: అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు పెద్దలతో పోలిస్తే పిల్లల్లో తక్కువ. కాబట్టి కరోనా సోకే అవకాశాలు పిల్లల్లో తక్కువ.

పిల్లల్లో కనిపించే కరోనా లక్షణాలు!

వీరిలో లక్షణాలు పెద్దవారిలో కనిపించే వాటిలాగే ఉంటాయి. తీవ్రతను బట్టి జలుబు, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 


పిల్లలకు మాస్క్‌లు ఇలా...

చేతులు శుభ్రంగా పెట్టుకోవడం, మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం.... ఇలా అందరూ పాటిస్తున్న కొవిడ్‌ రక్షణ చర్యలే పిల్లలకూ అనుసరించాలి. అలాగే మాస్క్‌ల విషయంలో పిల్లల వయసును బట్టి కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....


ఐదు నుంచి ఆరేళ్ల పిల్లలు: ఈ వయసు పిల్లలకు మాస్క్‌ ధరించి, తొలగిపోకుండా చూసుకోగలిగేంత మానసిక ఎదుగుదల ఉండదు. కాబట్టి ఈ వయసు పిల్లలకు మాస్క్‌లు వాడవలసిన అవసరం లేదు. 

8 - 10 ఏళ్లు: వస్త్రంతో తయారైన మాస్క్‌ లేదా మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌ వాడాలి.

10 - 15: మాస్క్‌ ధరించడం పట్ల ఈ పిల్లల్లో అవగాహన పెంచి, వాటిని వాడడం అలవాటు చేయాలి.


కోమార్బిడ్‌ పిల్లలైతే...

ఉబ్బసం, మధుమేహం, కేన్సర్‌, గుండె జబ్బులు, జన్యు సమస్యలు ఉన్న పిల్లల్లో కరోనా వైరస్‌ లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇతరులకు ఇచ్చే కరోనా చికిత్సనే వీరికీ అనుసరించవలసి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఆరోగ్యం మరింత దెబ్బతినకుండా లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.    

          

పిల్లలకు ఆహారం!

కరోనా సోకకుండా, సోకినా తీవ్రం కాకుండా ఉండాలన్నా, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్యం త్వరితంగా మెరుగుపడాలన్నా పిల్లలకు పోషకభరిత ఆహారం అందించాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచించే పిరమిడ్‌ ఫుడ్‌ సూత్రాన్ని పాటించాలి. దీన్లో భాగంగా ప్రతి భోజనంలో 60 - 70శాతం తృణ ధాన్యాలు, పప్పుదినుసులు, 20 - 30శాతం పళ్లు, కూరగాయలు, మిగతా 10 - 20శాతం పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.


మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌! 

ప్రధానంగా పిల్లలకు ఇంట్లోని పెద్దల ద్వారా కొవిడ్‌ సోకుతుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపించినా వ్యాధినిరోధకశక్తి బలంగా ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే కరోనా వైరస్‌ను సంహరించే క్రమంలో విపరీతంగా స్పందించే వ్యాధినిరోధకశక్తి కారణంగా ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. ఈ స్థితి కరోనాకు ఎక్స్‌పోజ్‌ అయిన 2-3 వారాల్లో బయల్పడుతుంది. ఈ స్థితే మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌! ఇది ఉన్న పిల్లల్లో వాంతులు, జ్వరం, విరేచనాలు, ఆయాసం, ఆహారం తీసుకోకపోవడం, రక్తపోటు పడిపోవడం లాంటి కరోనా లక్షణాలతో పాటు చర్మం మీద దద్దుర్లు, వాంతులు, పలుచని విరేచనాలు, నీరసం, చెంపలు ఎర్రబడడం, పెదవులు పగిలిపోవడం, కళ్లు ఎర్రబడడం, కాళ్లు, చేతుల వాపులు లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. అలాగే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయినా, కొవిడ్‌ సోకిన అనుమానం లేకపోయినా, పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తప్పక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.

బడులు తెరుస్తున్న సమయంలో...

9 నుంచి 12 తరగతులు త్వరలో మొదలవబోతున్నాయి. ఇలాంటి సమయంలో పిల్లలను బడులకు పంపించాలంటే తల్లితండ్రుల్లో ఆందోళన ఉండడం సహజం. అయితే తగిన జాగ్రత్తలు పాటించగలిగితే ఈ వయసు పిల్లలకు కరోనా సోకకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం పిల్లలకు కరోనా రక్షణ నియమాల పట్ల అవగాహన ఏర్పరచడంతో పాటు, తరగతి గదుల్లో పిల్లల మధ్య దూరం పాటించడం, శానిటైజర్లు ఏర్పాటు చేయడం, స్కూలు, కాలేజి బస్సుల్లో సీట్ల మధ్య దూరం పాటించడం, తరగతి గదుల్లో కూడా పిల్లల మధ్య దూరం ఉండేలా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు స్కూలు, కాలేజీ యాజమాన్యాలు పాటించాలి. 


డాక్టర్‌ అనుపమ,

పిడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌ అండ్‌ పిడియాట్రీషియన్‌, 

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, 

హైదరాబాద్‌.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement