cerebral palsy వ్యాధి లక్షణాలు ఏంటి? చికిత్సలతో నయం చేయవచ్చా?

ABN , First Publish Date - 2022-03-02T17:59:50+05:30 IST

సెరిబ్రల్‌పాల్సి చిన్నపిల్లలకు శాపంగా మారింది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవచ్ఛవంలా బతకాల్సిందే. ఈ వైరల్‌ బ్యాక్టీరియా మెదడుకు సోకే పక్షవాతంలాంటిది.

cerebral palsy వ్యాధి లక్షణాలు ఏంటి? చికిత్సలతో నయం చేయవచ్చా?

నడవనివ్వదు, లేవనివ్వదు

హైదరాబాద్‌: సెరిబ్రల్‌పాల్సి చిన్నపిల్లలకు శాపంగా మారింది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవచ్ఛవంలా బతకాల్సిందే. ఈ  వైరల్‌ బ్యాక్టీరియా మెదడుకు సోకే పక్షవాతంలాంటిది. ఇటీవల ఈ వ్యాధి బారిన పడే చిన్నపిల్లల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పిల్లలు సెరిబ్రల్‌ పాల్సితో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమంది శిశువులో ముగ్గురు దీని బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్ల కుమారుడు జైన్‌ (26) ఇదే ఇబ్బందితో కన్నుమూశారు. సెరిబ్రల్‌ పాల్సి చికిత్సకు నయం అయ్యే జబ్బు కాదని, మానసికంగా వారిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని వైద్యులు పేర్కొంటున్నారు.


2 నెలల నుంచి 5 ఏళ్ల లోపు ఎప్పుడైనా...

శిశువు పుట్టిన రెండు నెలల నుంచి అయిదేళ్ల లోపు ఈ జబ్బు ఎప్పుడైనా రావచ్చు. అయిదు నెలల్లోనే ఈ జబ్బు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్సలు తీసుకుంటే నియంత్రణలో ఉంచడానికి వీలుంటుంది. చాలా మందికి అవగాహనలేక ఈ జబ్బు ముదిరిన తర్వాత వైద్యులను సంప్రందిస్తున్నారు. 


ఆక్సిజన్‌ అందకపోయినా..

పిల్లలకు సకాలంలో ఆక్సిజన్‌ అందకపోయినా ఈ జబ్బు బారిన పడతారు. అలాగే, పూర్తిగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నెలలు నిండి ఎక్కువ రోజులు గర్భంలో ఉన్న పిల్లల్లో ఈ జబ్బు ముప్పు ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.లక్షణాలు ఇలా..మెదడులో శరీర కండరాలు, చలన కార్యకలాపాలను నియత్రించే భాగాల్లో ఏర్పడే నష్టం కారణంగా ఈ సెరిబ్రల్‌పాల్సి వస్తుంది. పిల్లలు బొర్లాపడడడం, కూర్చోవడం, పాకడం, నడవడం వంటి వాటి విషయంలో చిన్నప్పటి నుంచే ఇబ్బంది పడతారు. కాళ్లు చేతులను సాఫీగా కదలించలేరు. చిన్నపాటి కదలికలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. పోలియో, పక్షవాతం మాదిరిగానే ఈ వ్యాధి లక్షణాలుంటాయి. స్థిరంగా నడవలేరు, నిల్చోలేరు. వస్తువులను సక్రమంగా పట్టుకోలేకపోవడం, మరొకరి సాయం ఉంటేనే నడవడం వంటి సమస్యలు ఉంటాయి. చివరకు మంచినీళ్లను కూడా సక్రమంగా తాగలేరు.

  

మొదట్లో గుర్తిస్తే.. 

కొన్ని సార్లు ఈ సెరెబ్రల్‌ పాల్సీ తీవ్ర జ్వరం వల్ల కూడా వచ్చే ప్రమాదముంది. ఈ వ్యాధి గ్రస్తుల్లో మెదడులో ఏర్పడుతున్న సత్వర ప్రభావాల కారణంగా కదలికలు, స్వరంలో మార్పు, నేర్చుకునే ఆసక్తి మందగిస్తుంది. 50 శాతం సాధారణ తెలివితేటలు, మరో 50శాతం బుద్ధిమాంద్యత ఉంటుంది. దీన్ని మొదట్లోనే గుర్తించి వైద్యచికిత్సలు అందిస్తే కాళ్లు, చేతుల్లో పట్టుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ, వైద్యం విద్య, యోగ వంటి వాటిపై అవగాహన పెంచి జబ్బును నియంత్రించడానికి ప్రయత్నించాలి.


పుట్టగానే ఏడవకపోతే..

కొందరిలో వంశపారం పర్యంగా ఇబ్బందులు ఉంటాయి. గర్బిణిలో అండం నాణ్యత లోపిస్తే అభివృద్ధి సరిగ్గా చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అండానికి పోషకాలు సరిగ్గా అందకపోతే శిశువు మెదడు ఎదుగుదల సరిగా ఉండదు. సాధారణ ప్రసవం కాకపోవడం,  కాన్పు కష్టం కావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమంది పిల్లల పుట్టగానే ఏడవకపోవడం, మెడలు స్థిరంగా నిలుపకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ప్రసవ సమయంలో పిల్లల మెదడుకు ఆక్సిజన్‌ అందకపోతే ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. సెరిబ్రల్‌ పాల్సీ కొందరిలో సాధారణంగా, మరికొందరిలో కొద్ది ఎక్కువగా, మరికొందరిలో సీవియర్‌గా ఉంటుంది. సివియర్‌గా ఉన్న వారు ఎక్కువగా పడకకే పరిమితమవుతారు. వీరికి చికిత్సల కంటే మానసికంగా ఎదుగుల ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 


- డాక్టర్‌ ప్రీతం కుమార్‌ రెడ్డి, నవజాత శిశువు, పిల్లల వైద్యుడు, రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆస్పత్రి.


మెదడు పరిస్థితిని అంచనా వేయాలి

పిల్లలు మెదడులో ఏర్పడిన నష్టాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితి అంచనా వేయాల్సి ఉంది. పిల్లల తెలవితేటలను గమనించాలి. కొందరికి ఎక్కువగా ఫిట్స్‌ వస్తుంటాయి. ఏదీ సరిగ్గా చెప్పలేరు. తినలేరు. వినికిడి ఇబ్బందులు ఉంటాయి. పుట్టగానే రెండు, మూడు నెలలోనే ఇది బయట పడుతుంది. పిల్లలు తల్లిని గుర్తించడం, సరైన సమయంలో బోర్ల పడుతున్నారా.. కూర్చుంటున్నారా లేదా పరిశీలించాలి. కొందరిలో అటో కాలు, ఇటో కాలు బాగా పట్టేసినట్లు ఉంటుంది. కదలకుండా కూర్చోవడం వల్ల బెడ్‌ సోర్స్‌ వస్తాయి. దీని వల్ల ఇబ్బందులు గమనించాలి. గర్భ సమయంలో కొందరికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉంటాయి. మెదడు పెరిగే సమయంలో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయినప్పుడు ఒక భాగం దెబ్బతింటుంది. కొందరు పిల్లలో పుట్టిన సమయంలో మెదడులో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడుతుంది. దీని వల్ల కూడా సెరిబ్రల్‌ పాల్సీ ముప్పు ఉంటుంది. పిల్లలకు నిలోఫర్‌లో అవసరమైన పరీక్షలు చేసి మానసిక వికలాంగుల కేంద్రాలకు రిఫర్‌ చేస్తారు.


- డాక్టర్‌ రమేష్‌ దంపూరి, సీనియర్‌ పిడియాట్రిషన్‌, మాజీ ఆర్‌ఎంఓ, నిలోఫర్‌ ఆస్పత్రి.

Updated Date - 2022-03-02T17:59:50+05:30 IST