లక్షణాలు లేని వారితోనే సమస్యంతా!

ABN , First Publish Date - 2020-08-10T07:27:39+05:30 IST

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. శతాబ్ద కాలంలో ఇంతగా భయపెట్టిన వైరస్‌ మరొకటి లేదు. సాధారణంగా వైరస్‌ బారినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే...

లక్షణాలు లేని వారితోనే సమస్యంతా!

  • వారిలోనూ అధిక మోతాదులో వైరస్‌
  • కరోనా వ్యాప్తికి వారే మూల కారకులు
  • మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడమే మార్గం

న్యూఢిల్లీ: కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. శతాబ్ద కాలంలో ఇంతగా భయపెట్టిన వైరస్‌ మరొకటి లేదు. సాధారణంగా వైరస్‌ బారినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. అది సోకిన వారికి దూరంగా ఉంటే సరిపోతుంది. ఈ వైర్‌సకి కూడా అంతే. కానీ, ఇక్కడ ఒక్కటే సమస్య. అది.. వైరస్‌ సోకిన వారిని గుర్తించడం. కరోనా సోకిన వారు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటున్నారు. 

మొదటిరకం.. వీరిలో కొవిడ్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పొడిదగ్గు, జ్వరం, జలుబు, శ్వాసలో ఇబ్బందులు తదితరాలన్నీగానీ లేదా కొన్నిగానీ ఉంటాయి. వీరిని పరీక్షించి ఐసొలేషన్‌కు తరలిస్తే సరిపోతుంది. ఇలాంటి వారివల్ల భారీగా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలుండవు.

రెండో రకం.. వీరిలో వైరస్‌ సోకిన కొద్దిరోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి (ప్రీసింటమేటిక్‌). అప్పటి వరకూ వీరు యథేచ్ఛగా తిరిగేస్తారు. లక్షణాలు కనిపించాక పరీక్షలకు వెళతారు. పాజిటివ్‌ వస్తే.. అప్పుడు ఐసొలేషన్‌కి వెళతారు. కానీ, అప్పటికే తమకు తెలియకుండానే చేయాల్సిన నష్టం చేసేస్తారు. తమతో కాంటాక్ట్‌ అయిన వాళ్లలో అధికశాతం మందికి వైర్‌సను అంటించేస్తారు.

మూడో రకం.. వీరు అత్యంత ప్రమాదకారులు. తమ కు వైరస్‌ సోకిన విషయం వారికే తెలియదు. లక్షణాలు అస్సలు కనిపించవు (అసింటమేటిక్‌). దీంతో.. పరీక్షలు చేయించుకోరు. జనంలో కలిసిపోతారు. ఇష్టారాజ్యంగా తిరుగుతారు. ఇక్కడ విశేషమేమిటంటే.. వారికే తెలియదు.. తాము అతిపెద్ద కరోనా వాహకులమని. తమకు తెలియకుండానే తమ భుజాలపై వ్యాప్తిని మోస్తుంటారు. రెండు వారాలకు పైగానే వాహకులుడా పనిచేస్తారు. మొదటి రకం రోగుల వల్ల వారి కుటుంబసభ్యులకు మాత్రమే వైరస్‌ సోకే ప్రమాదముంటే, రెండో రకం వల్ల తెలిసిన వాళ్లకు, బంధువులకు కూడా ప్రమాదముంటుంది. ఇక మూడో రకం వారి వల్లే సామాజిక వ్యాప్తి మొదలవుతుంది. ఇప్పుడు ప్రపంచానికి ఇదే అతి పెద్ద సమస్య. వీరిని ఎవరూ గుర్తించలేరు. దీంతో.. మనకు తెలియకుండానే మనం వైరస్‌ బారిన పడిపోతాం. 


లక్షణాలు లేనివారిలోనూ వైరస్‌ అధికమే

లక్షణాలు కనిపించని వారి మీద ఇప్పటివరకు రకరకాల అధ్యయనాలు జరిగియి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన అధ్యయనాల్లో.. ఇలాంటి వారికి వైరస్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది. అతి తక్కువ వైరస్‌ లోడ్‌ ఉంటుంది. వీరి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందదు అంటూ తేల్చారు. కానీ, తాజాగా జరిగిన కొన్ని అధ్యయనాలు మాత్రం వీరిలోనూ వైరస్‌ లోడ్‌ అధికంగా ఉంటుందని గుర్తించాయి. తీవ్రమైన లక్షణాలతో ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటున్న ఓ కొవిడ్‌ పేషెంటులో వైరస్‌ లోడ్‌ ఎంతగా ఉంటుందో.. ఏ లక్షణాలూ కనిపించని రోగుల్లో కూడా అదే స్థాయిలో వైరస్‌ లోడు ఉంటుందని తేల్చాయి. ఇందుకు సంబంధించి కొందరు పరిశోధకులు 300 మంది కొవిడ్‌ పేషెంట్లపై అధ్యయనం చేశారు. అందులో 110 మంది లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వాళ్లు. కానీ, వైరస్‌ లోడ్‌ మాత్రం అందరిలోనే ఒకే విధంగా తేలింది. వీరిని కొన్ని రోజుల పాటు పరిశీలించగా.. లక్షణాలు లేనివారిలో 21 మందిలో క్రమంగా లక్షణాలు కనిపించడం మొదలైంది. మిగిలిన 89 మందిలో మాత్రం.. చికిత్స ముగిసి నెగెటివ్‌ వచ్చే వరకూ లక్షణాలు కనిపించలేదు. ఇలాంటి వారు జనం మధ్య లక్షల్లో తిరుగుతున్నారనేది కొందరు పరిశోధకుల వాదన. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్న మొత్తం కొవిడ్‌ రోగుల్లో 45 శాతం మంది లక్షణాలు లేనివారేనని, దాదాపు ఇంతే శాతం మంది జనబాహుళ్యంలో తిరుగుతున్నారనేది ఇంకొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అందువల్లనే ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాప్తి అదుపులోకి రావడం లేదనేది వీరి వాదన. లక్షణాలతో పనిలేకుండా భారీ ఎత్తున టెస్టులు నిర్వహించడం ద్వారా దీన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందనేది మరికొందరి అభిప్రాయం.


మాస్కులు, భౌతికదూరం.. ఇవే పరిష్కారాలు

లక్షణాలు లేకుండా తిరుగుతున్న కరోనా రోగుల బారి నుంచి తప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించే విషయంలో ఏమాత్రం అలక్ష్యం కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు భౌతికదూరం కూడా తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెబుతున్నారు. నూరు శాతం ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తే.. కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుందని, ఒకవేళ సోకినా కొద్దిపాటి లక్షణాలతోటే తేలిపోతుందని వారు అంటున్నారు.  


Updated Date - 2020-08-10T07:27:39+05:30 IST