వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే జల్లేరు బస్సు ప్రమాదం: సయ్యద్ రఫీ

ABN , First Publish Date - 2021-12-18T23:57:27+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే జల్లేరు బస్సు ప్రమాదం జరిగిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు.

వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే జల్లేరు బస్సు ప్రమాదం: సయ్యద్ రఫీ

అమరావతి: వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే జల్లేరు బస్సు ప్రమాదం జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని నిర్వహించలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని వ్యవస్థలనేం నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ప్రమాదానికి గురైన బస్సు స్టీరింగ్ తిరగడం లేదని చెప్పినా, ఆ బస్సుని రోడ్లపైకి పంపిన యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, సంస్థ భూములు ఆక్రమించడంపై  ముఖ్యమంత్రికి ఉన్నశ్రద్ధ, ప్రయాణికుల భద్రతపై లేదని చెప్పారు. మంత్రి పేర్నినానీకి చంద్రబాబుని తిట్టడం, పవన్ కల్యాణ్‌ని ఆడిపోసుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆర్టీసీపై లేకుండా పోయిందని మండిపడ్డారు.


ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మరణించిన వారికి కోటిరూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి, జల్లేరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షలిచ్చి చేతులుదులుపుకున్నారన్నారు. గతంలో జగన్మోహన్‌రెడ్డి కంచికచర్ల వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదం జరిగితే నానా యాగీ చేసి రూ.25లక్షలివ్వాలన్నారన్నారు. నేడు ఆర్టీసీ బస్సులు అదుపు తప్పి, ప్రజల ప్రాణాలు పోతున్నా సీఎం జగన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశానంటున్న ముఖ్యమంత్రి,  సంస్థ ఉద్యోగులకు, ప్రజల ప్రయాణానికి భద్రత, భరోసా కల్పించలేకపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తక్షణమే రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ఆర్టీసీబస్సుల స్థితి గతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-18T23:57:27+05:30 IST