కరోనా లాక్‌డౌన్‌ మధ్య కత్తి చేతబూని మాతాజీ హల్‌‌చల్!

ABN , First Publish Date - 2020-03-26T16:24:07+05:30 IST

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్‌డౌన్ అమలవుతుంటే... ఓ మాతాజీ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని..

కరోనా లాక్‌డౌన్‌ మధ్య కత్తి చేతబూని మాతాజీ హల్‌‌చల్!

లక్నో: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్‌డౌన్ అమలవుతుంటే... ఓ మాతాజీ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు ‘ఆదిపరాశక్తి’ అవతారమెత్తారు. పొడవైన ఖడ్గాన్ని చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులపై బెదిరింపులకు దిగారు. ఎంతకూ మాట వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ద్యోరియా జిల్లా మెహ్దాపూర్వలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తొలిరోజే మాతాజీ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆమె పిలుపుతో సామాజిక దూర (సోషల్ డిస్టెన్సింగ్) నియమాలను సైతం పక్కనబెట్టి  పొరుగు రాష్ట్రం బీహార్ నుంచి 100 మంది భక్తులు ఆమె కార్యక్రమానికి వచ్చారు.


దీనిపై కొందరు స్థానికులు సమాచారం ఇవ్వడంతో  పోలీసులు పెద్ద ఎత్తున ఆమె ఇంటివద్దకు వచ్చారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. అయితే మాతాజీ అందుకు అంగీకరించలేదు. ఓ పొడవాటి ఖడ్గాన్ని ఝళిపిస్తూ ‘‘మమ్మల్ని తరలించడానికి వస్తే ఊరుకునేది లేదు..’’ అంటూ హల్‌చల్‌ చేశారు. వెంటనే ఖాళీ చేయకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందంటూ పోలీసులు పలుమార్లు హెచ్చిరించినా ఆమె పట్టించుకోలేదు. ‘‘నేను ఆదిపరాశక్తిని..’’ అంటూ దాదాపు గంటసేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమె కత్తిని లాక్కుని అరెస్ట్ చేశారు. ఈ ఘటపై వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వండంతో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2020-03-26T16:24:07+05:30 IST