ఉచిత వై-ఫై కోసం కుమార్తెకు ఇంటర్నెట్ ప్రొవైడర్ పేరు!

ABN , First Publish Date - 2020-10-19T00:30:44+05:30 IST

సంవత్సరాల తరబడి ఉచిత వై-ఫై కనెక్షన్ పొందేందుకు ఓ తండ్రి తన కుమార్తెకు ఇంటర్నెట్ ప్రొవైడర్ పేరు పెట్టేశాడు. తమ కుమార్తెకు కానీ, కుమారుడికి కానీ తమ కంపెనీ పేరు కలిసి వచ్చేలా ‘ట్విఫియా’, లేదంటే

ఉచిత వై-ఫై కోసం కుమార్తెకు ఇంటర్నెట్ ప్రొవైడర్ పేరు!

స్విట్జర్లాండ్: సంవత్సరాల తరబడి ఉచిత వై-ఫై కనెక్షన్ పొందేందుకు ఓ తండ్రి తన కుమార్తెకు ఇంటర్నెట్ ప్రొవైడర్ పేరు పెట్టేశాడు. తమ కుమార్తెకు కానీ, కుమారుడికి కానీ తమ కంపెనీ పేరు కలిసి వచ్చేలా ‘ట్విఫియా’, లేదంటే ‘ట్విఫస్’ అని పెడితే 18 ఏళ్లపాటు ఉచిత వై-ఫై కనెక్షన్ ఇస్తామంటూ స్విట్జర్లాండ్ స్టార్టప్ కంపెనీ ట్విఫి ప్రకటించింది. అమ్మాయి/అబ్బాయి ఫొటో, బర్త్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేస్తే నిర్ధారించుకున్న తర్వాత ఉచిత వై-ఫై కనెక్షన్ ఇస్తామని పేర్కొంది.




 ఫేస్‌బుక్‌లో ఆ ప్రకటన చూసిన ఓ యువ జంట తమ కుమార్తెకు ‘ట్విఫియా’ అని పేరు పెట్టారు. దీంతో వారికి ఉచిత వై-ఫై కనెక్షన్ లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వై-ఫై ద్వారా ఆదా అయ్యే సొమ్మును కుమార్తె పేరుపై బ్యాంకులో వేస్తామని, ఆమె పెద్దయ్యాక ఆ సొమ్ముతో ఆమె కారు కొనుక్కోవచ్చని, లేదంటే మరో దానికి ఉపయోగించుకోవచ్చిన పేర్కొన్నారు. నిజానికి కుమార్తెకు ట్విఫియా అని పేరు పెట్టడం తొలుత కొంచెం ఇబ్బందిగానే అనిపించిందని చిన్నారి తల్లి తెలిపింది. ఉచిత వై-ఫై కోసం తమ చిన్నారిని ఆమ్మేసినట్టు భవిష్యత్తులో వచ్చే ఆరోపణలు భరించడం కష్టమవుతుందని, దీనికి సిగ్గు పడుతున్నామని చెప్పారు. 


ట్విఫి వ్యవస్థాపకుడు, సీఈవో ఫిలిప్ ఫోష్ మాట్లాడుతూ.. తమ కంపెనీ మూతపడినా చిన్నారి తల్లిదండ్రులకు మాత్రం ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని, అది గౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. కాగా, కొత్త జంటలకు ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉందని ఫిలిప్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T00:30:44+05:30 IST