ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

ABN , First Publish Date - 2022-08-14T16:27:46+05:30 IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న...

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  స్వై‌న్ ఫ్లూ కలకలం

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో సైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ఆమెకు రిమ్స్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో స్వైన్ ఫ్లూ తొలి కేసు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


నిన్నటి వరకు వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా జనం ప్రస్తుతం వైరల్‌ జ్వరాలతో తల్లడిల్లుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లాలోని అనేక గ్రామాల్లో దగ్గు, జలుబులు తీవ్రరూపం దాల్చడమే కాకుండా చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. అధికారులు వైరల్‌ ఫీవర్‌లుగా అధికారికంగా పేర్కొంటున్నప్పటికీ లక్షణాలు మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లను పోలినట్లుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా కుభీర్‌, తానూర్‌, లోకేశ్వరం, మామడ, సారంగాపూర్‌, లక్ష్మణచాంద తదితర మండలాల్లో జ్వరాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జ్వరాల తీవ్రత పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 516 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 2441 మంది వైరల్‌ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించారు. దీంతో పాటు 813 మంది డయేరియాతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొంటున్నారు. 


వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికి పారిశుధ్య సమస్య కారణంగా వైరల్‌ జ్వరాలు విభృంభిస్తున్నాయంటున్నారు. వాతావరణంలో వేడితీవ్రత తగ్గకపోవడం అలాగే వర్షాల కారణంగా నీరు నిలిచి ఉంటున్నందున ఈగలు, దోమలు వృద్ది చెందిన వైరల్‌ జ్వరాలతో పాటు డయేరియా లాంటి రోగాలు విస్తరిస్తున్నాయంటున్నారు. అలాగే జ్వరాలకు తోడుగా దగ్గు, జలుబు కూడా సాధారణ ప్రజానీకాన్ని సతమతం చేస్తోంది. గత 20 రోజుల నుంచి ఓ వైపు జ్వరాలు, మరోవైపు డయేరియా, దగ్గు, జలుబు లాంటివి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారంతా ఆసుపత్రుల భాటపడుతున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలతో పాటు ఇక్కడి ప్రధాన జిల్లా ఆసుపత్రికి జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. అయితే జ్వర తీవ్రత తగ్గకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల బాటపడుతున్నారు. జ్వర పీడితులతో జిల్లా కేంద్రంతో పాటు బైంసా, ఖానాపూర్‌లలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు కిటకిటలాడుతున్నాయి. 

Updated Date - 2022-08-14T16:27:46+05:30 IST