Viral Video: గుర్రంపై Swiggy ఆర్డర్ల డెలివరీ.. డెలివరీ బాయ్ ఆచూకీ చెప్పాలంటూ స్విగ్గీ బంపరాఫర్

ABN , First Publish Date - 2022-07-06T20:32:26+05:30 IST

ఇటీవల ముంబైలో ఓ స్విగ్గీ(Swiggy) ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Viral Video: గుర్రంపై Swiggy ఆర్డర్ల డెలివరీ.. డెలివరీ బాయ్ ఆచూకీ చెప్పాలంటూ స్విగ్గీ బంపరాఫర్

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముంబైలో ఓ స్విగ్గీ(Swiggy) ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్షం పడుతున్నా.. లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇందులో స్పెషల్ ఏముందేగా మీ అనుమానం. అతను వెళ్లింది ఏ బైక్ మీదనైతే కామన్ అనే లైట్ తీసుకునేవాళ్లం. కానీ, అతడు డెలివరీకి వెళ్లింది గుర్రం మీద. అందుకే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే.. దాని తాలూకు వీడియో వైరల్ అయింది. అయితే, ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే చాలా మందికి వచ్చిన అనుమానం. దీనిపై భారీ ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది కాస్తా స్విగ్గీ దృష్టికి వెళ్లింది. దీంతో స్విగ్గీ కూడా స్పందించింది. అదే సమయంలో కూసింత వ్యంగ్యంతో కూడిన ఓ 'బహుమాన' ప్రకటన సైతం విడుదల చేసింది. 


స్విగ్గీ ప్రకటనలో ఏముందంటే..

గుర్రంపై వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్ వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. ‘‘మా మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి గుర్రంపై కూర్చుని వెళుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తి సొంత ఆలోచన, వాహనం ఎంపికను మేము అభినందించాలని అనుకుంటున్నాం. మీ మాదిరే మేము కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకున్నాం’’ అంటూ స్విగ్గీ ప్రకటించింది. “ఆ యంగ్ స్టార్ ఎవరు? ఆ స్విగ్గీ బ్యాగ్‌లో ఏముంది? భారీగా వర్షం కురుస్తున్న రోజున, అది కూడా రద్దీగా ఉండే ముంబై వీధుల్లో ఫుడ్ డెలివరీ చేయాలని అతను ఎందుకు నిర్ణయించుకున్నాడు? అతను ఈ ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు తన గుర్రాన్ని ఎక్కడ పార్క్ చేశాడు?" అని స్విగ్గీ తన ప్రకటనలో పేర్కొంది. 


‘‘దయచేసి ముందుకు రండి. అతడిని గుర్తించడానికి ఉత్తమ భారత పౌరుడిగా మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం మొత్తం తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని తెలిపింది. ఈ సందర్భంగా 'స్విగ్గీమ్యన్ ఆన్ ఎ హార్స్' గురించి ఆచూకీ తెలిపిన మొదటి వ్యక్తికి రూ. 5000 బహుమతిని కూడా ప్రకటించింది. పర్యావరణ అనుకూలమైన డెలివరీ పద్ధతులను అవలంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గీ, తమ డెలివరీ వాహనాలను గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, భర్తీ చేయడంలేదని చమత్కరించింది.



Updated Date - 2022-07-06T20:32:26+05:30 IST