స్వీట్‌ పొటాటో హాట్‌గా..!

ABN , First Publish Date - 2021-03-06T05:46:44+05:30 IST

చిలగడదుంపలను ఉడకబెట్టుకుని తింటాం. ఈ తీపి దుంపతో పలు రకాల నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. స్వీట్‌ పొటాటోతో నూడుల్స్‌, సూప్‌, పఫ్స్‌, చిలగడదుంప రైస్‌...ఇలా రకరకాల వంటకాలను చేసుకోవచ్చు

స్వీట్‌ పొటాటో హాట్‌గా..!

చిలగడదుంపలను  ఉడకబెట్టుకుని తింటాం. ఈ తీపి దుంపతో పలు రకాల  నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. స్వీట్‌ పొటాటోతో నూడుల్స్‌, సూప్‌, పఫ్స్‌, చిలగడదుంప రైస్‌...ఇలా  రకరకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ వారం స్వీట్‌ పొటాటోతో టేస్టీ వెరైటీను తనివితీరా ఆస్వాదించండి.


స్వీట్‌ పొటాటో నూడుల్స్‌


కావలసినవి

చిలగడదుంపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, నిమ్మకాయ - ఒకటి, పల్లి పట్టీలు - ఐదారు, పల్లీలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.


తయారీ విధానం

  • ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి, స్పైరలైజర్‌తో నూడుల్స్‌ మాదిరిగా కట్‌ చేసుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగి పెట్టుకున్న చిలగడదుంపలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే పాన్‌లో మరి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పల్లి పట్టీలు వేసి వేగించి తీసుకోవాలి. 
  • పల్లి పట్టీలను వేగించి పెట్టుకున్న చిలగడదుంపలపై వేయాలి. పల్లీలు వేసి, నిమ్మరసం పిండి, కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిస్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

చిలగడదుంప రైస్‌


కావలసినవి

బియ్యం - ఒక కప్పు, చిలగడదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలు - రెండు, రెడ్‌ క్యాప్సికం - ఒకటి, బ్రకోలి - ఒకటి, క్యారెట్‌ - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం

  • ముందుగా అన్నం వండి సిద్ధంగా ఉంచుకోవాలి.
  • చిలగడదుంపలు పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.
  • స్టవ్‌ పైపాన్‌ పెట్టి నూనె వేసి కాస్త  వేడి అయ్యాక చిలగడదుంపలు వేసి వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
  • తరువాత కొద్దిగా ఫ్రైసాస్‌ వేసి కలపాలి. ఉల్లికాడలు, రెడ్‌ క్యాప్సికం, బ్రకోలి, క్యారెట్‌ ముక్కలు వేయాలి. కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేగించాలి. 
  • ఇప్పుడు అన్నం వేసి కలపాలి. తగినంత ఉప్పు వేయాలి. 
  • చివరగా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

స్వీట్‌ పొటాటో పఫ్స్‌


కావలసినవి

చిలగడదుంపలు - పావు కేజీ, పాస్ట్రీ షీట్స్‌ - రెండు, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, 


తయారీ విధానం

  • చిలగడదుంపలను ఉడికించి, గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • మరొక పాత్రలో వెజిటబుల్స్‌ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.
  • అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగనివ్వాలి. టొమాటో ముక్కలు వేసి కలపాలి.
  • గరంమసాల, ధనియాల పొడి, పసుపు వేసి కలియబెట్టుకుని కాసేపయ్యాక దింపుకోవాలి. 
  • చల్లారిన తరువాత మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. 
  • స్టవ్‌పై పాత్రను పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్‌  వేయాలి.
  • తరువాత చిలగడదుంపల గుజ్జు, ఉల్లిపాయల టొమాటో పేస్టు వేసి కలియబెట్టాలి.
  • చిక్కటి మిశ్రమంలా తయారయ్యే వరకు వేగించాలి.
  • చివరగా కొత్తిమీర వేసి దింపాలి. 
  • పాస్ట్రీ షీట్స్‌ను కావాల్సిన సైజులో కత్తిరించాలి. 
  • ఒక్కో షీట్‌లో సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పెట్టి అన్ని వైపులా మడవాలి. 
  • ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి ప్రీ హీట్‌ చేయాలి. 
  • పఫ్స్‌ను ఓవెన్‌లో పెట్టి బేక్‌ చేయాలి. 
  • వేడి వేడిగా తింటే స్వీట్‌ పొటాటో పఫ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి.

స్వీట్‌ పొటాటో విత్‌ క్వినోవా


కావలసినవి

చిలగడదుంపలు - రెండు, కొబ్బరి తురుము - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్వినోవా - ఒకకప్పు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - అర కప్పు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారీ విధానం

  • చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి వేగించి పెట్టుకోవాలి.
  • క్వినోవాను ఉడికించి పెట్టుకోవాలి. 
  • స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేగించాలి.
  • మిరియాల పొడి, వేగించిన చిలగడదుంపలు, కొబ్బరి తురుము వేసి కలపాలి.
  • బాగా వేగిన తరువాత ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి మరికాసేపు వేగించాలి.
  • మరో ఐదు నిమిషాలు వేగిన తరువాత క్వినోవా వేసి కలియబెట్టాలి.
  • తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై మరికాసేపు వేగించాలి. వేడి వేడిగా వడ్డించాలి.

చిలగడదుంప సూప్‌


కావలసినవి

చిలగడదుంపలు - రెండు, కొబ్బరినూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెజిటబుల్‌ స్టాక్‌ - రెండు కప్పులు, కొబ్బరిపాలు - అర కప్పు, ఉల్లికాడలు - రెండు.


తయారీ విధానం

  • చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి.
  • ఇప్పుడు చిలగడదుంపల ముక్కలు వేసి కలియబెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఐదునిమిషాల పాటు వేగించాలి.
  • తరువాత వెజిటబుల్‌ స్టాక్‌ పోసి మూత పెట్టి ఉడికించాలి. చిలగడదుంపలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి.
  • చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. కొబ్బరి పాలు పోసి మరోసారి పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి కాసేపు ఉడికించాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. మిరియాల పొడి చల్లాలి. చివరగా ఉల్లికాడలు వేసి అందించాలి.

Updated Date - 2021-03-06T05:46:44+05:30 IST