లేటైందని ప్రయాణికుల కోపం... వెరైటీగా కూల్ చేసిన ఎయిర్ హోస్టెస్‌లు

ABN , First Publish Date - 2021-10-02T00:48:12+05:30 IST

ప్రతికూల వాతావరణం కారణంగా విమానం మూడు గంటలు ఆలస్యం కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న

లేటైందని ప్రయాణికుల కోపం... వెరైటీగా కూల్ చేసిన ఎయిర్ హోస్టెస్‌లు

బెంగళూరు: ప్రతికూల వాతావరణం కారణంగా విమానం మూడు గంటలు ఆలస్యం కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ప్రయాణికులను ఎయిర్ హోస్టెస్‌లు వెరైటీగా చల్లబరిచారు. ఎప్పటికీ మరిచిపోలేని ఓ సరికొత్త జ్ఞాపకాన్ని వారికి అందించారు. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వెళ్లాల్సిన ఇండిగో 6ఈ విమానంలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబరు 27న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9.05 గంటలకు ఇండిగో విమానం 6ఈ 7911 బయలుదేరాల్సి ఉంది. అయితే, కర్నూలులో ప్రతికూల వాతావరణం కారణంగా విమానం టేకాఫ్ కావడానికి 11 గంటల వరకు అనుమతి రాలేదు. 


45 నిమిషాల తర్వాత విమానం కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, ల్యాండ్ కావడానికి పరిస్థితులు సహకరించలేదు. దీంతో గంటపాటు విమానం (హోల్డింగ్ ప్యాటర్న్‌లో) ఆకాశంలో తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. విమానం ఆలస్యం కావడంతో విమానంలోని 8 మంది పురుష ప్రయాణికులు కొంత ఆగ్రహంగా, అసహనంగా కనిపించారు. అది గ్రహించిన ఎయిర్ హోస్టెస్‌లు స్నేహ, మెరుటులా నోట్‌ను రాసి సంతకం చేసి ప్రతి ప్రయాణికుడికి అందించారు. అప్పటి వరకు విమానం ఆలస్యం కావడంతో అసహనంతో ఉన్న ప్రయాణికులు అది చూసి చల్లబడ్డారు.


ఆ నోట్‌లో ఇలా రాసుంది ‘‘సర్.. ప్రకృతి మన నియంత్రణలో లేనిది. విమానం ఆలస్యానికి కారణాన్ని అర్థం చేసుకుని ఓపికగా ఎదురుచూసినందుకు ధన్యవాదాలు. మీ మద్దతుకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీ ప్రయాణ భాగస్వామిగా ఇండిగోను ఎంచుకున్నందుకు అభినందిస్తున్నాం. మిమ్మల్ని మరిన్ని ఇండిగో విమానాల్లో కలుస్తామని ఆశిస్తున్నాం.. మీ స్నేహ, మెరుంటుల’’ అని రాసి ఉంది.


ఆ విమానంలో కర్నూలు వచ్చిన వారివారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట్రాఘవన్ కూడా ఉన్నారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘పైలట్ సహా మేమంతా దాదాపు రెండు గంటలపాటు టార్మాక్‌లోనే టేకాఫ్ క్లియరన్స్ కోసం ఎదురుచూశాం. చివరికి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా వాతావరణం సహకరించకపోవడంతో ల్యాండింగ్‌కు అనుమతి రాలేదు. దీంతో ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎయిర్‌ హోస్టెస్ ఈ నోట్ అందించారు. వారు చేసిన ఈ పనికి నిజంగా అభినందిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఈ నోట్‌ను పోస్టు చేశారు. 


Updated Date - 2021-10-02T00:48:12+05:30 IST