ఇసుకను తోడేస్తున్నారు...?!

ABN , First Publish Date - 2022-09-30T05:12:40+05:30 IST

ఇసుక రవాణాపై రోజురోజుకు ఆంక్షలు పెరుగుతుండడం.. ఇసుక రీచ్‌ల లో ఇసుక ధరలు పెరగడం ఇసుకాసురుల పాలిట వరంగా మారింది. దీంతో వారు రీచ్‌లకు వెళ్లడం పూర్తిగా మానేసి చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై పడ్డారు. అంతేకాకుండా చెరువు లలో ఇసుక కోసం ఎక్సకవేటర్ల సాయంతో పైనున్న మట్టి పొరలను తొలగిస్తున్నారు.

ఇసుకను తోడేస్తున్నారు...?!
ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్న కూలీలు

అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా!

ట్రాక్టర్‌ను అడ్డుకొన్న గ్రామస్థులు

గుర్రంకొండ, సెప్టెంబరు 29: ఇసుక రవాణాపై రోజురోజుకు ఆంక్షలు పెరుగుతుండడం.. ఇసుక రీచ్‌ల లో ఇసుక ధరలు పెరగడం ఇసుకాసురుల పాలిట వరంగా మారింది. దీంతో వారు రీచ్‌లకు వెళ్లడం పూర్తిగా మానేసి చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై పడ్డారు. అంతేకాకుండా చెరువు లలో ఇసుక కోసం ఎక్సకవేటర్ల సాయంతో పైనున్న మట్టి పొరలను తొలగిస్తున్నారు. అనం తరం రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఉంచి యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను వేలాది రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటు న్నారు. మరి కొందరైతే ఇసుకను డంప్‌ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు తరలించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఇంకొందరు నాయకులు సచివాలయాలు, ఆర్బీకేలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల మాటున ఇసుక రవాణా చేస్తున్నారు. ఇందుకు  ఇసుకాసురు లకు సంబంధిత అధికారు లు అక్రమ రవాణాకు తప్పుడు అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయా నికి గండి కొడుతున్నారు. గ్రామాల్లోని రైతులు, ప్రజలు తమ చెరువులలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అటు రెవెన్యూ, ఇటు ఎస్‌ఈబీ అధికారులకు తెలిపినా ఫలితం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మండలంలో ఎల్లుట్ల, చెర్లోపల్లె, టి.పస లవాండ్లపల్లె, నడిమికండ్రిగ, అమిలేపల్లె, తరిగొండ, మర్రిపాడు, గుర్రంకొండ గ్రామాల్లో కొందరు ఇసుకా సురులు ఇసుక వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంక ల్లో ఇసుకను తోడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక కోసం పగలు ఎక్సకవేటర్లను ఉంచి చెరువులలో మట్టి పొరలను తొలగిస్తున్నారు. అనంతరం రోజూ ట్రాక్టర్లలో ఇసుకను యథేచ్చగా తరలిస్తున్నా పట్టిం చుకొనేవారు లేకపోవడం గమనార్హం. మండలం లోని అమిలేపల్లె చెరువులో నాలుగు రోజుల క్రితం ఇసుకాసురులు ఎక్సకవేటర్‌ను ఉంచి మట్టి పొరల ను తొలగించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. దీంతో గురువారం ఆయకట్టు రైతులు ట్రాక్టర్‌ ముందుకు వెళ్లకుండా కూర్చొని అడ్డుకొన్నారు. అక్కడ నుంచే రెవెన్యూ, ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులకు సమాచారం ఇచ్చి ఇసుక ట్రాక్టర్‌ను పట్టించారు. అయితే ఇసుకాసురులు తమ తెలివిని ప్రదర్శించి సచివాలయంలో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, పంచాయితీ కార్యదర్శి ఆర్బీకే, హెల్త్‌ సెంటర్‌ కొరకు ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చిన పత్రం చూపడంతో అధికారులు వెనుదిరిగారు. 


ప్రభుత్వ పనుల మాటున ఇసుక దోపిడీ

మండలంలో ఇసుకాసురులు రోజు రోజుకు తెలివి ప్రదర్శిస్తూ ఇసుకను తరలిస్తున్నారు. మండలంలో ప్రభుత్వ పనులైన సచివాలయాలు, ఆర్బీకేలు, సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువ పనులను కొందరు చేస్తున్నారు. ఈ పనులకు ఇసుక అవసరమంటూ సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకొంటున్నారు. ఈ అనుమతులతో ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వేస్తున్నారు. దీంతో చెరువులు, కుంటలను కూడా తోడేస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు, రైతులు ఇసుక తవ్వకాలను అడ్డుకొని రెవెన్యూ, ఎస్‌ఈబీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


రీచ్‌ ఇసుక వాడకం ఎక్కడ..?

ప్రభుత్వం అందరూ ఇసుకను రీచ్‌ల నుంచే కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో ఇళ్ల లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఇసుకను రీచ్‌లలో కొనుగోలు చేసి పనులు చేయాల్సి వుంది. అయితే కాంట్రాక్టర్లు ఇసుకను చాలా వరకు చెరువులు, వంకల నుంచే తెచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఇసుకను నాణ్యత లేకపోయినా పనులకు వినియోగిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.


ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొంటున్నాం..

అక్రమ ఇసుక రవాణాను చాలా వరకు అడ్డుకొంటున్నాం. గుర్రంకొండ మండలంలో పలు గ్రామాల్లో చెరువులు, కుంట లలో ఇసుకను తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమా చారం మేరకు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమంగా ఇసుకను తోడినట్లు మా దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకొంటాం.

- శివసాగర్‌, ఎస్‌ఈబీ సీఐ, వాల్మీకిపురం

Updated Date - 2022-09-30T05:12:40+05:30 IST