Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 17 May 2022 02:21:21 IST

నాటోలోకి స్వీడన్‌

twitter-iconwatsapp-iconfb-icon

భారీ మద్దతుతో పార్లమెంటు ఆమోదం.. 200 ఏళ్ల సైనిక తటస్థతకు ముగింపు!

ఫిన్లాండ్‌ బాటలో సహచర నార్దిక్‌ దేశం.. మీది ఘోర తప్పిదం.. రష్యా నిప్పులు

మేం చూస్తూ ఉంటామనే భ్రమలొద్దు.. సైనికపర ఉద్రిక్తతలు పెరుగుతాయి..!

తీవ్రంగా హెచ్చరించిన విదేశాంగ శాఖ.. దీనికి ప్రతిస్పందన ఉంటుంది: పుతిన్‌

ఫిన్లాండ్‌లో బంకర్లు.. అణు యుద్ధ భయంతో ఏర్పాట్లుపార్లమెంటు ఆమోదం.. రష్యా నిప్పులు

స్టాక్‌హోమ్‌, మాస్కో, మే 16: శతాబ్దాల సైనిక తటస్థ వైఖరికి స్వస్తి పలుకుతూ స్వీడన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో చేరనున్నట్లు ప్రకటించింది. సహచర నార్డిక్‌ దేశం ఫిన్లాండ్‌ నాటోలో చేరుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్‌ తన నిర్ణయాన్ని వెల్లడించింది.  ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ఫిన్లాండ్‌, స్వీడన్‌ ఆందోళన చెందుతున్నాయి. రష్యాతో ఫిన్లాండ్‌కు 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. స్వీడన్‌కు సరిహద్దు లేకున్నా.. ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తోంది. అందుకే నెపోలియనిక్‌ యుద్ధాల(1803-15) అనంతరం కొనసాగిస్తున్న సైనిక తటస్థ వైఖరికి స్వస్తి పలికింది.
నాటోలోకి స్వీడన్‌


పుతిన్‌ కన్నెర్ర
 ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరికకు దరఖాస్తు చేయడం సమస్య కాదంటూనే.. ఇది ప్రతిచర్యను ప్రేరేపించే నిర్ణయమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కన్నెర్రజేశారు. నాటో విస్తరణ సమస్యాత్మకమని, ప్రపంచ ంపై ప్రభావాన్ని పెంచుకోవాలన్న దాని ప్రణాళికలపై అదనపు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మీది ఘోర తప్పిదం. మీ భద్రత ఏమీ బలోపేతం కాదు’’ అంటూ రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్‌ ఫిన్లాండ్‌, స్వీడన్‌పై విరుచుకుపడ్డారు. విచక్షణ లోపించిన దౌర్భాగ్యపు ఆలోచనని.. దీర్ఘకాల పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. సైనిక ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించారు. వదిలేస్తామని అనుకోవద్దని, తగిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.

అజోవ్‌స్టాల్‌లో 15 మంది మహిళలు మృతి
సీవరీడోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌ సహా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగించింది. ప్రజల ఆవాసాలనూ లక్ష్యం చేసుకుంది. అజోవ్‌ స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 15 మంది మహిళా సైనికులు, వైద్య సిబ్బంది మృతి చెందినట్లు మేయర్‌ తెలిపారు. 
నాటోలోకి స్వీడన్‌

నగరమంతా పట్టేలా బంకర్లు
ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో 500 పైనే!
హెల్సింకీ, మే 16: ఒకటి కాదు రెండు కాదు 500 పైనే.. సకల వసతులతో భూమికి 25 మీటర్ల లోతున నిర్మాణం.. అణు దాడికీ చెక్కుచెదరని ధృఢత్వం.. నగరం జనాభా 9 లక్షలమంది వారాలపాటు తలదాచుకునే సౌకర్యం.. ఇదీ ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలోని బంకర్ల ప్రత్యేకత. 9 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల బెడ్‌ రాక్‌ను తొలిచి వీటిని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం అనుభవంతో.. 1960లో కొన్నింటిని నిర్మించగా తర్వాత మెరుగుపరుస్తూ వచ్చారు. ఇప్పుడు నాటోలో చేరుతున్న ఫిన్లాండ్‌.. అవసరమైతే యూరప్‌ సరిహద్దులకు అణు సామగ్రి తరలిస్తామని రష్యా హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తం అవుతోంది. ఏం జరిగినా ఎదుర్కొనేలా బంకర్లను సంసిద్ధం చేస్తోంది.
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.