హోటల్‌ స్వర్ణాప్యాలెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-10T09:58:45+05:30 IST

ఓవైపు కరోనా.. తెల్లారితే కళ్లు తెరుస్తామా లేదా..

హోటల్‌ స్వర్ణాప్యాలెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం

మృత్యు మంటలు

10 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన 21 మంది

మృతుల్లో ఏడుగురు కృష్ణా జిల్లావారు

ఇద్దరు ప్రకాశం, మరొకరు గుంటూరు జిల్లా

విద్యుత్ షార్ట‌సర్క్యూటే కారణం

శానిటైజేషన్ వల్లేనని మరో వాదన

రమేష్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్‌గా ఉన్న హోటల్

కరోనా భయంతో చికిత్సకు వచ్చిన బాధితులు

తప్పించుకునే మార్గంలేక, ఊపిరాడక మృత్యువాత

రమేష్ హాస్పిటల్, స్వర్ణాప్యాలెస్ హోటల్‌పై కేసు నమోదు

అగ్ని ప్రమాద ఘటనపై ద్విసభ్య కమిటీ: మంత్రులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఓవైపు కరోనా.. తెల్లారితే కళ్లు తెరుస్తామా లేదా అనే హైరానా... ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే బతుకుతామో, లేదోనన్న ఆందోళన.. డబ్బు పోయినా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరితే ప్రాణాలు దక్కుతాయనే తపన. అయినా మృత్యువు వారి వెన్నంటే నడిచింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నామనుకుని నిశ్చింతగా నిద్రపోయిన వారిని మంటల రూపంలో చీకట్లో చితికి చేర్చింది. దావానలంలా వ్యాపించి బాధితుల ఆర్తనాదాలను అగ్నికీలల్లో కలిపేసింది. పదిమంది బతుకులను బతికుండగానే బుగ్గి చేసింది.


పగబట్టినట్టుగా ఒక్కసారిగా విరుచుకుపడిన మృత్యు మంటల నుంచి తప్పించుకోలేక ఆర్తులు అగ్నికి ఆహుతైపోయారు. చల్లపల్లి బంగ్లా సెంటర్‌లోని స్వర్ణాప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, అందులో మనజిల్లావారు ఏడుగురు ఉన్నారు. 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాడి మసైపోయిన మృతదేహాలను చూసి ‘ఇదేం ఘోరం దేవుడా..’ అని బంధువులు గుండెలవిసేలా రోదిస్తే.. అసలే కరోనాతో కకావికలం అవుతున్న విజయవాడ ఈ విస్ఫోటనానికి విలవిల్లాడిపోయింది. 


ఎలా జరిగింది..? అగ్ని ప్రమాదంపై అనేక వాదనలు

స్వర్ణాప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటన జిల్లాలో కలకలం రేపింది. అయితే, ఈ ప్రమాదంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. శానిటైజేషన్‌ కారణంగా జరిగిందని వామపక్ష నేత పి.మధు చెప్పారు. హోటల్‌లోని ఫ్రంట్‌ ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది ల్యాప్‌టాప్‌ కాలిపోవడంతో ప్రమాదం సంభవించిందన్నది మరో వాదన. ఫ్రంట్‌ ఆఫీస్‌ వెనుక వైపున ఉన్న సర్వర్‌ రూమ్‌ నుంచి పొగలు వ్యాపించాయని కొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా పది ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయి. మంటలు, పొగ కింది నుంచి పైకి వ్యాపించడంతో మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.


ఎక్కువగా మొదటి అంతస్తులోనే ఐదారుగురు చనిపోయారని రెస్క్యూ బృందాలు తెలిపాయి. హోటల్‌లోని గదుల్లో ఉన్నవారు ఊపిరాడకపోవడంతో బయటకు వచ్చారు. వారిలో నలుగురు మెట్లమార్గం నుంచి కిందికి రావడానికి ప్రయత్నించారు. మెట్లు ఇరుకిరుగ్గా ఉండడం, పొగ దట్టంగా ఉండడంతో మార్గం లేక అక్కడే కుప్ప కూలిపోయారు. మెట్ల వైపునకు వచ్చిన బాధితులు హోటల్‌ వెనుక వైపునకు గానీ, ఐదో అంతస్తుకు గానీ వెళ్లిపోయి ఉంటే ప్రాణాలతో బయటపడే వారని అగ్నిమాపక శాఖ సిబ్బంది అభిప్రాయపడ్డారు. 


అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు జేసీ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.గీతాభాయ్‌, వీఏంసీకి చెందిన ఆర్‌ఎఫ్‌వో టి.ఉదయ్‌కుమార్‌, సీపీడీసీఎల్‌ డిప్యూటీ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టర్‌తో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతో పాటు భద్రతా నిబంధనలు, ఆసుపత్రి నిర్వహణలో లోపాలు, వసూలుచేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించాలని ఆదేశించారు. 



Updated Date - 2020-08-10T09:58:45+05:30 IST