‘స్వర్ణాల’ తీరంలో భక్త పరవళ్లు

ABN , First Publish Date - 2022-08-11T05:01:14+05:30 IST

‘స్వర్ణాల’ తీరంలో భక్తజనం పరవళ్లు తొక్కుతోంది. కోరుకున్న కోరికలు తీరి కొందరు.. కొత్త కోరికల కోసం మరి కొందరు వేలాదిగా తరలివస్తుండటంతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది.

‘స్వర్ణాల’ తీరంలో  భక్త పరవళ్లు
స్వర్ణాల చెరువులో భక్తుల సందడి

రొట్టెల పండుగకు 


నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 10 : ‘స్వర్ణాల’ తీరంలో భక్తజనం పరవళ్లు తొక్కుతోంది. కోరుకున్న కోరికలు తీరి కొందరు.. కొత్త కోరికల కోసం మరి కొందరు వేలాదిగా తరలివస్తుండటంతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. ఇక్కడ జరుగుతున్న రొట్టెల పండుగలో రెండవ రోజు బుధవారం దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు యాత్రికులు ముందుగా బారాషహీద్‌ దర్గాను దర్శించుకుని, ఆ తర్వాత స్వర్ణాల చెరువులో వరాల రొట్టెను పట్టుకుంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో సుమారు రెండు లక్షల మందికిపైగా జనం వచ్చి ఉంటారని అంచనా. రెవెన్యూ, పోలీస్‌, దర్గా కమిటీలు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నారు. బుధవారం  ద్యోగ, విద్య, సంతానం, వ్యాపారం రొట్టెలను పట్టుకునేందుకు భక్తులు తహతహలాడారు. బారాషహీద్‌ మిత్ర మండలి పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన మెకానిక్‌లు, రోజువారి కూలీలు, ఏసీ, ఎలక్ర్టానిక్‌, మెకానిక్‌లు, వెల్డర్లు, ఇమామ్‌లు సంయుక్తంగా  అన్నదానుం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర మైనారిటీ అధ్యక్షుడు సాబూర్‌ఖాన, అధికార ప్రతినిధి హయత బాబా తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్‌ స్రవంతి  దర్గా ప్రాంగణంలోని దుకాణాలు, స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ప్రాంతాలను, టూరిజం శాఖ ఏర్పాటు చేసిన బోట్‌ షికారును, సీసీ కెమెరా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లను పరిశీలించారు.


సోనూసూద్‌ ఆధ్వర్యంలో అన్నదానం


ప్రముఖ నటుడు సోనూసూద్‌ భక్తుల కోసం ఏర్పాటు చేసిన లంగర్‌ ఖానాను బుధవారం నెల్లూరు రూరల్‌ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ శిబిరాన్ని మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించి సోనూసూద్‌ మిత్ర బృందాన్ని అభినందించారు. 


బోట్‌ షికారు ద్వారా రూ.3లక్షల ఆదాయం


ఆంధ్రప్రదేశ పర్యాటక శాఖ బోట్‌ క్లబ్‌ ద్వారా స్వర్ణాల చెరువులో యాత్రికులు ఉత్సాహంగా బోటు షికారు చేస్తున్నారు. బుధవారం దాదాపు రూ.3లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆ శాఖ డివిజనల్‌ మేనేజర్‌ శివారెడ్డి తెలిపారు. 


చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వాహనాలు


నెల్లూరు(సిటీ)  : రొట్టెల పండుగకు వచ్చే చిన్నారులు, వృద్ధులకు ఉచిత వాహన సర్వీసును ఏర్పాటు చేశామని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. . కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద 24 గంటలూ ఎలక్ర్టికల్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కమిషనర్‌ డీ హరిత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:01:14+05:30 IST