ఘాట్‌.... ఘోరం

ABN , First Publish Date - 2021-06-18T04:56:55+05:30 IST

నెల్లూరులోని బారా షహీద్‌ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు తీరాన ఏటా వైభవంగా జరిగే రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయలు వెచ్చించి సుందరంగా ఘాట్‌ నిర్మించారు. అయితే ఆ తర్వాత ఆలనా పాలనా కరువై ఆ ఘాట్‌ రూపు కోల్పోయింది.

ఘాట్‌.... ఘోరం
స్వర్ణాల చెరువ ఘాట్‌లో గుర్రపుడెక్క (ఇన్‌సర్ట్‌) పరిసరాల్లో చెత్తకుప్పలు, ఘాట్‌లో ఊడిపోయిన టైల్స్‌

కళావిహీనంగా స్వర్ణాల తీరం


పచ్చని చెట్లు, చల్లని గాలి, నీటి అలల సవ్వడి, బోటు షికారు, పిల్లల పార్కు....  వీటితో ఒకప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించి, ఆహ్లాదాన్ని పంచిన స్వర్ణాల చెరువు తీరం ఇప్పుడు పిచ్చి మొక్కలు, చెత్తకుప్పలతో అధ్వానంగా మారింది. రొట్టెల పండుగ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ఘాట్‌ ఘోరంగా తయారైంది.  పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ పర్యాటక ప్రదేశాన్ని అపరిశుభ్రత ఆవరించింది. 


నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 17 : 

నెల్లూరులోని బారా షహీద్‌ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు తీరాన ఏటా వైభవంగా జరిగే రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో లక్షల  రూపాయలు వెచ్చించి సుందరంగా ఘాట్‌ నిర్మించారు. అయితే ఆ తర్వాత ఆలనా పాలనా కరువై ఆ ఘాట్‌ రూపు కోల్పోయింది. ఘాట్‌లో వేసిన టైల్స్‌ ఊడిపోయి గుంతలమయంగా మారింది. చెరువులో గుర్రపు డెక్కాకు పెరిగిపోతోంది.  ఘాట్‌ నిర్వహణ బాధ్యత నెల్లూరు నగర పాలక సంస్థదే. ఘాట్‌ పరిసరాలు శుభ్రం చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా వాచ్‌మన్లను గత తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ వాచ్‌మన్ల జాడ కనిపించడం లేదు. దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతోంది. కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆ పరిసరాలే చెబుతున్నాయి. ఇక, ఘాట్‌కు ఎగువన నిర్మించిన పిల్లల పార్కులో అయితే ఆట వస్తువులు ధ్వంసమై నిరుపయోగంగా మారాయి.  నగర పాలక సంస్థ నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో అటు ఘాట్‌ను, ఇటు పార్కును సుందరీకరించాలంటే మళ్లీ లక్షల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-06-18T04:56:55+05:30 IST