స్వరాజ్యం

ABN , First Publish Date - 2020-08-14T06:43:27+05:30 IST

ఏ సంవత్సరంలో నైనా ఆగస్టు 15 మనకు పర్వదినం. పెరిగిపోతున్న ధరలు, కరవైపోతున్న నిత్యజీవితావశ్యక వస్తువులు, కరకు కోతగా పరిణమిస్తున్న బ్రతుకులు- ఈ పరిస్థితులలో ఏమి పర్వదినం? ఎటు చూచినా...

స్వరాజ్యం

స్వరాజ్యవ్యవస్థలో ఎన్ని దొసగులైనా ఉండవచ్చు, అవి ఎన్నికష్టనష్టాలనైనా కలిగించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో కడగండ్లకు దారితీయవచ్చు. అయినా స్వరాజ్యానికి అదే సాటి. ఈ విశ్వాసంతోనే ఎందరెందరో లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు శిక్షలు అనుభవించారు, ఉరికంబాలనెక్కడానికి సయితం వెనుదీయలేదు. ఈ విశ్వాసంతోనే ఎన్ని కష్టాలు పడవలసివచ్చినా, ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా, అందుకు ఎందరెందరో సంతోషంగా సన్నద్ధులైనారు.


ఏ సంవత్సరంలో నైనా ఆగస్టు 15 మనకు పర్వదినం. పెరిగిపోతున్న ధరలు, కరవైపోతున్న నిత్యజీవితావశ్యక వస్తువులు, కరకు కోతగా పరిణమిస్తున్న బ్రతుకులు- ఈ పరిస్థితులలో ఏమి పర్వదినం? ఎటు చూచినా అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, అన్యవిధాల అవినీతి- ఈ పరిస్థితులలో ఏమి పర్వదినం? కోటానుకోట్ల హృదయాలను ఈ విధమైన ప్రశ్నలు ఈనాడు వేధించవచ్చు. అయినా, ఇది ప్రతి భారతీయునికి ఒక మహాపర్వదినమే! కొత్త తరం వారికి తెలియకపోవచ్చు గాని, స్వరాజ్యం కోసం పోరాటం కొనసాగుతున్న సమయంలో మన జాతీయ నాయకులు ‘సురాజ్యం స్వరాజ్యానికి ప్రత్యామ్నాయం కాదు’ అని ఉద్ఘాటిస్తూ ఉండేవారు. ఇది నిజానికి ఒక బ్రిటిష్ ప్రధాని సూక్తి. ఆయన పేరు సర్ హెన్రీ కాంబెల్ -బెన్నర్ మన్. బోయర్ల విషయంలో ఆయన ‘గుడ్ గవర్నమెంట్ ఈజ్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ -గవర్నమెంట్’ అని చెప్పాడు. ఆ బ్రిటిష్ ప్రధాని మాటనే నాటి మన బ్రిటిష్ పరిపాలకులకు మన నాయకులు అప్పజెబుతూ ఉండేవారు.


ఇదివరలోనే కాదు, ఇప్పుడైనా ఎప్పుడైనా ‘సురాజ్యం స్వరాజ్యానికి ప్రత్యామ్నాయం కాదు’. స్వరాజ్యవ్యవస్థలో ఎన్ని దొసగులైనా ఉండవచ్చు, అవి ఎన్నికష్టనష్టాలనైనా కలిగించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో కడగండ్లకు దారితీయవచ్చు. అయినా స్వరాజ్యానికి అదే సాటి. దాస్యంలో స్వర్గసుఖాల కంటె స్వరాజ్యంలో నరకయాతనలూ ఒక లక్ష రెట్లు వాంఛనీయం. ఈ విశ్వాసంతోనే ఎందరెందరో లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుశిక్షలు అనుభవించారు, ఉరికంబాలనెక్కడానికి సయితం వెనుదీయలేదు. ఈ విశ్వాసంతోనే ఎన్ని కష్టాలు పడవలసివచ్చినా, ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా, అందుకు ఎందరెందరో సంతోషంగా సన్నద్ధులైనారు.


స్వరాజ్యంతో మన సమస్యలన్నీ తీరని మాట నిజమే. అయితే, అంత మాత్రం చేత స్వరాజ్య సముపార్జన తర్వాత దేశం అసలే పురోగమించ లేదనడం కంటె పొరపాటు లేదు. ఎన్ని రంగాలలోనో, ఎన్ని విధాలుగానో ఈ రెండున్నర దశాబ్దాలుగా దేశం ముందుకు నడిచింది. ఈ నడక మరింత త్వరగా జరిగి ఉండవచ్చు, మరింత సాఫీగా జరిగి ఉండవచ్చు. కాని, 17వ, 18వ శతాబ్దాలలో మన జాతీయ జీవితం బహు ముఖాలుగా క్షీణించింది. అటుపైన దాదాపు మరి రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ దాస్యంలో మ్రగ్గిన తర్వాతనే మనం స్వరాజ్యం పొందినామన్న విషయాన్ని మరచిపోరాదు. ఈ నాలుగు వందల సంవత్సరాలలో కొండలాదిగా పేరుకుపోయిన పీడలన్నీ, కీడులన్నీ ఇరవై అయిదేళ్ళలో తొలగగలవా? ఇన్ని సమస్యలు ఒక్క నాటిలో తీరవు. ఒక్క తరంలోనైనా తీరవు. అందుకు కొన్ని తరాలపాటు కృషి జరగాలి. ముఖ్యంగా ఈ తరంలో దీక్షాయుతమైన కృషి జరగాలి. ఈ కృషి సందర్భంలో కష్టాలకు, త్యాగాలకు సన్నద్ధపడాలి. అప్పుడుగాని మరింత పురోభివృద్ధి సాధ్యపడదు, అప్పుడుగాని మన భవిష్యత్తు పదిలపడదు.

1972 ఆగస్టు 15 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘ఆగస్టు 15, 1972’ నుంచి

Updated Date - 2020-08-14T06:43:27+05:30 IST