మన్యంలో స్వరాజ్య భానుడు

ABN , First Publish Date - 2022-08-20T05:53:22+05:30 IST

వలస పాలన మీద ప్రతిఘటన మైదాన ప్రాంతాల కంటే ముందు వనవాసులే ఆరంభించారు.

మన్యంలో స్వరాజ్య భానుడు

వలస పాలన మీద ప్రతిఘటన మైదాన ప్రాంతాల కంటే ముందు వనవాసులే ఆరంభించారు. 1885 ఆఖర్లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించగా, 1766లోనే బెంగాల్‌ కొండలలో చౌర్స్‌ సాయుధ తిరుగుబాట్లు మొదలుపెట్టారు. దేశం నలుమూలలా జరిగిన గిరిజనోద్యమాలలో ఆఖరిది విశాఖ మన్య విప్లవం. మన్యానికి తిరుగుబాట్లు కొత్తకాదు. 1790లలోనే వాటి అలికిడి కనిపిస్తుంది. కానీ 1922–24 మధ్య అల్లూరి సీతారామరాజు లేదా శ్రీరామరాజు నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి అనేక పార్శ్వాలు ఉన్నాయి.


మైదాన ప్రాంతం నుంచి మన్యానికి వెళ్లిన అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897–మే 7, 1924) గిరిజనులను ఐక్యం చేసి ఉద్యమం నిర్మించారు. కుటుంబాన్ని వీడి తూర్పు గోదావరిలోని తుని నుంచి రామరాజు 1915లో ఉత్తర భారతదేశం వెళ్లారు. హరిద్వార్‌ వరకు సాగిన ఈ యాత్రే రామరాజులో సహజంగా ఉన్న ఆధ్యాత్మిక తత్వానికి ఉద్యమదృష్టిని జోడించింది. రామరాజు ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో పాలలో పంచదారలా దేశభక్తి కూడా మిళితమై ఉండేదని అన్నపూర్ణయ్య రాశారు. మొదటి ప్రపంచ యుద్ధం గదర్‌ పార్టీని దేశవ్యాప్త ఉద్యమానికి ప్రేరేపిస్తున్న కాలమది. గ్రేట్‌వార్‌ కాలంలోనే రామరాజు యుద్ధ విద్య నేర్చుకున్నాడని ‘మెయిల్‌’ పత్రిక రాసిన సంగతిని ‘శ్రీ అల్లూరి సీతారామరాజు ప్రశంస’ పుస్తకంలో (1925) భమిటిపాటి సత్యనారాయణ రాశారు. రామరాజు 1917లో కృష్ణదేవిపేట చేరుకున్నారు.


ఆ ఊరు ఆయనను ఒక యోగిలా చూసింది. చిటికెల భాస్కరనాయుడు అనే చిన్న భూస్వామి ఆశ్రయం ఇచ్చాడు. గ్రామస్థులు నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి దగ్గరగా చిక్కాలగడ్డ అనే చోట ఒక పూరిపాక నిర్మించి ఇచ్చారు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో రామరాజు మండల దీక్షలు నిర్వహించారు. అలాంటి సమయంలో ఆయుధం స్వీకరించవలసి వచ్చింది. అందుకు ఈ పరిస్థితులు దారి తీశాయి. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. కొన్ని పరిణామాలు రామరాజు సహాయ నిరాకరణవాది అన్న ముద్ర పడేటట్టు చేశాయి. 1921లో రామరాజు కాలినడకన నాసికా త్రయంబకం సందర్శించారు. అక్కడ సావర్కర్‌ సోదరుల అభినవ్‌ భారత్‌ విప్లవ సంస్థ ప్రభావం ఉంది. పైగా యోగులూ, సన్యాసుల మీద నిఘా పెట్టమంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. కృష్ణదేవిపేట రాగానే అధికారులు ఆయనపై దృష్టి పెట్టారు. రామరాజును మరింత అనుమానించడానికి అవకాశమున్న ఘటన 1922 జనవరిలో జరిగింది.


అప్పటికే రామరాజు మద్యపాన నిషేధం, పంచాయతీలు ఏర్పాటు, కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అవి సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యాలే. దీనితో రామరాజు నాన్‌ కో ఆపరేటర్‌ అని తీర్మానించారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తెచ్చిన కరవు నివారణ కోసం ఉపాధి పనులంటూ ప్రభుత్వం మన్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టింది. గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్‌ బాస్టియన్‌ అరాచకాలు అప్పటివే. మన్యం పెద్దలు కంకిపాటి బాలయ్యపడాలు (పెద్దవలస మాజీ ముఠాదారు), గాం గంతన్న దొర (బట్టిపనుకుల మునసబు), అతని సోదరుడు గాం మల్లు దొర, గొప్ప విలుకాడు గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, సంకోజు ముక్కడు, కర్రి కణ్ణిగాడు వంటివారు 1922 జనవరిలో రామరాజు దగ్గరకు వచ్చి బాస్టియన్‌ పెట్టే బాధల గురించి చెప్పుకున్నారు. దానితో శ్రీరామరాజు బాస్టియన్‌ మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఇదే అవకాశంగా రామరాజు సహాయ నిరాకరణోద్యమం నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్‌ స్వెయిన్‌ కృష్ణదేవిపేటలో పంచాయతీ పెట్టాడు. ఆ వెంటనే అంటే, ఫిబ్రవరి 1న సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దేశంలో వందేమాతరం ఉద్యమం నాటి స్పృహ వెల్లువెత్తింది. ఆ మూడో తేదీన కృష్ణదేవిపేటలో రామరాజును పొలిటికల్‌ సస్పెక్ట్‌గా నిర్ధారించి, నర్సీపట్నం జైలులో ఉంచారు. 5న జరిగిన చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ తాను ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయం దేశ యువతలో గాంధీ పట్ల నిరసన పెరిగేటట్టు చేస్తూ, వారి చేత ఇతర పంథాల వైపు అడుగులు వేయించింది. రామరాజు వారిలో ఒకరు. గాంధీ చింతనతో కొంత సంఫీుభావం ఉన్న అల్లూరి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఆశ్రయించడమే గొప్ప వైచిత్రి. ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్‌ స్టేషన్లను ఎంచుకున్నారు. ఎండు పడాలు, గంతన్న, రామరాజు–మల్లు నాయకత్వాలలో మూడు దళాలు ఏర్పాటు చేశారు. ఆగస్ట్‌ 22, 1922న పట్టపగలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద రామరాజు దళం దాడి చేసింది. దాదాపు మూడు వందల మంది ఆయన వెంట అక్కడికి నడిచారని పోలీసులు నమోదు చేశారు. ఆ దారిలో ఎదురైన చింతపల్లి ఎస్‌ఐ ఈరెన అప్పలస్వామినాయుడుకి దాడి సంగతి చెప్పి మరీ కదిలారు. 11 తుపాకులు, 1390 తూటాలు, 5 కత్తులు, 14 బాయినెట్లు దొరికాయి. వాటిని తీసుకువెళుతున్నానని ఒక లేఖ రాసి పెట్టారు రామరాజు. రాజుదళం ‘వందేమాతరం– మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినాదాలు చేసింది.


దామనపల్లి ఘాట్‌లో సెప్టెంబర్‌ 24, 1922న దక్కిన విజయం చరిత్రాత్మకమైనది. అక్కడికి రాజు దళం వస్తున్నదని తెలిసి స్కాట్‌ కవర్ట్‌, నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీసు అధికారులు రెండు పటాలాలతో వెళ్లారు. హైటర్‌ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. ఆ ఇద్దరినీ కూడా కొండదళం కాల్చి చంపింది. అక్టోబర్‌ 15న అడ్డతీగల, అక్టోబర్‌ 19న చోడవరం స్టేషన్‌ల మీద రాజు దళం దాడి చేసింది. కానీ ఆయుధాలు లభ్యం కాలేదు. అప్పటికే స్టేషన్లలోని ఆయుధాలను ట్రెజరీలకి తరలించడం మొదలుపెట్టారు. స్థానిక సాధారణ పోలీసులు పోరాడలేకపోతున్న సంగతి కవర్ట్‌, హైటర్‌ల మరణంతో తెలిసింది. సెప్టెంబర్‌ 23, 1922న మలబార్‌ పోలీసు దళాలను రప్పించారు. మోప్లా అల్లర్లను అణచిన ఈ దళాలు కొండలలో పోరాడగలవు. అయినా విశాఖ కొండలలో చతికిలపడ్డాయి. రామవరం అనే చోట రాజు దళంతో తలపడిన మలబార్‌ దళం చిత్తయింది.


1923లో కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలు చరిత్ర ప్రసిద్ధమయ్యాయి. వాటికి రామరాజు మారువేషంలో హాజరయ్యారు. ఒక సిక్కు యువకుని వేషంలో రామరాజు హాజరైనారని మంగిపూడి పురుషోత్తమ శర్మ చెప్పినట్టు చరిత్ర. 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ తోడుగా వచ్చింది. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అప్పటికి ప్రభుత్వ బలగాల సంఖ్య దాదాపు వేయి. రాజుదళం వంద. అస్సాం రైఫిల్స్‌ అధిపతే మేజర్‌ గుడాల్‌. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ జార్జ్‌ రూథర్‌ఫర్డ్‌ను మన్యంలో పోలీసు చర్యకు స్పెషల్‌ కమిషనర్‌గా నియమించారు. జూన్‌ 24లోగా ఉద్యమం అణగిపోవాలి. మరికొంత అస్సాం రైఫిల్స్‌ బలగం వచ్చింది. మే నెల ఆరంభంలో రేవుల కంతారం మారుమూల ప్రాంతంలో రాజు దళం సమావేశమైంది. అప్పుడే పోలీసులు దాడి చేశారు. రామరాజు ఒక్కడూ మంప చేరుకుని, ఒక చేనులోని మంచె మీద పరున్నాడు. తెల్లవారితే మే 7వ తేదీ. రాజు వేకువనే మంచె దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన కంచుమేనన్‌, ఇంటెలిజెన్స్‌ పెట్రోలింగ్‌ సబిన్స్‌పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు బలగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు. 


రామరాజును రూథర్‌ఫర్డ్‌కు సజీవంగా అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. ఆయనను ఒక నులక మంచానికి కట్టి, గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే ఉన్న అస్సాం రైఫిల్స్‌ అధిపతి మేజర్‌ గుడాల్‌ అడ్డగించి బలవంతగా రాజును తన గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.


రామరాజు గాథ మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. చరిత్రను పునర్లిఖించుకోవడం ప్రతితరం బాధ్యత. ఆయన సీతారామరాజు కాదు, శ్రీరామరాజు. సీత అనే పాత్ర కల్పితం. ఆయనను సీతారామరాజు అనే పిలవడం స్వచ్ఛమైన చరిత్రపట్ల మనకున్న అశ్రద్ధను వెల్లడిస్తుంది. రాజు ఉద్యమంతో అటవీ చట్టాల విషయంలో మార్పు వచ్చింది. ప్రధాన స్రవంతి పోరాటాలతో తన పోరాటాన్ని అనుసంధానం చేస్తాడేమోనని పోలీసులు భయపడ్డారు. ఆయన త్యాగం వృథా కాలేదు. 


గోపరాజు నారాయణరావు

సీనియర్ జర్నలిస్ట్

(ఆగస్ట్‌ 22: రామరాజు ఉద్యమానికి వందేళ్లు)

Updated Date - 2022-08-20T05:53:22+05:30 IST