Abn logo
Mar 8 2021 @ 20:35PM

అమూల్యమైన ఆభరణాలు.. స్వప్నాదత్, ప్రియాంకదత్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం… ఎందరో మహిళామణులు.. మావనజాతికి కీర్తికిరీటాలు.. జన్మసాఫల్యసోఫానాలు.. ఎన్నో రంగాలలో ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు…ఎంతటి క్లిష్టతరమైన ప్రక్రియనైనా వారు సాధించగలరని… ఛాలెంజింగ్‌గా తీసుకుని అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలరని నిరూపించిన మహిళాలోకపు అనర్ఘరత్నాలకు చిత్రజ్యోతి జోహార్లు చెబుతోంది. ఈ కోవకే చెందుతారు వైజయంతీ మూవీస్‌ అధినేత, గత అర్ధశతాబ్దపు సుదీర్ఘకాలప్రవాహానికి ఎదురీది, ఎవరూ ఎక్కలేని ఎత్తులను అధిరోహించి, తెలుగుచలనచిత్ర సీమలో ఈ యుగకర్తగా, వైభవాల పతాకగా, ప్రాభవాల ప్రతీకగా జైత్రయాత్రలు కొనసాగిస్తున్న చలసాని అశ్వనీదత్‌ కుమార్తెలు….స్వప్నాదత్‌, ప్రియాంకదత్‌లు

వనితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’’ అని శతకకారుడు చెప్పినట్టుగా తండ్రి అడుగులో అడుగేసి చిత్రనిర్మాణరీతులను, గతులను చిత్రికబట్టి మరీ ఆయన స్ధాయిప్రమాణాలను పూర్తిగా అవపోసన పట్టి చిత్రనిర్మాణం ప్రారంభించారు. అశ్వనీదత్‌ కుమార్తెలే అయినా, ఏకలవ్యశిష్యులుగా ప్రత్యక్షంగా నేర్చుకున్నది కొంతైతే, చూసి గ్రహించి ఆకళింపు చేసుకున్నది మరికొంతతో తమదైన సొంత అవగాహనతో మారుతున్న ధోరణులను, పోకడలను సమ్మిళితం చేసి తెలుగుసినిమా వేదికపైకి అడుగుపెట్టారు. వస్తూనే వైజయంతీ మూవీస్‌కున్న పలుకుబడిని అడ్డుపెట్టుకోకుండా, వ్యక్తిగతమైన అంకితభావంతో, శ్రమదమాదులతో నూతన దర్శకుడే అయినా.. నాగ్‌అశ్విన్‌ చెప్పిన కథను వ్యయప్రయాసలకోర్చి ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మించారు. అసలా కథ వింటే ఏ నిర్మాత ఆ సినిమా తీయడానికి ముందుకు రానేరారు. అది చేయాలంటే నిర్మాతకి ఎంతో ఇమేజినేషన్‌ ఉండాలి. మరెంతో క్రియేటివ్‌ అండర్‌స్టాండింగ్‌ ఉండాలి. అవి పుష్కలంగా స్వప్నాదత్‌కి, ప్రియాంకదత్‌కి ఉన్నాయని సినిమా చూస్తేగానీ ఎవరికీ అర్ధం కాలేదు. తెరసాక్షిగా ఇద్దరూ చేసి చూపించారు. తీసి మెప్పించారు. అదిగో అక్కడే ఇద్దరికిద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోరని, ఎవరూ వారికి పోటీ కాదని, అసలు పోటేయే లేని స్థానం వారిదని ఢంకా బజాయించి మరీ నిరూపించారు. ఓ క్షణం అశ్వనీదత్తే సినిమా చూసి నివ్వెరపోయిన సందర్భం.. ఎవడే సుబ్రహ్మణ్యం. ఎక్కడ కథ ప్రారంభమైంది.. ఎక్కడ హిమాలయాలు.. మరెక్కడ దూద్‌కాశీ.. ఏంటా ప్రయాణం…అంతుబట్టనిది ఆ సినిమా చుట్టుకొలత. కేవలం మేధస్సు మాత్రమే ఆ వైశాల్యాన్నీ లెక్కించగలదు. అదే స్వప్నా, ప్రియాంకల ఉన్నత ప్రమాణం, సమున్నత ప్రయాణం. సంచలన విజయం. 

తర్వాత ఏదో కమర్షియల్‌ పంచన చేరుతారులే అన్న కువిమర్శలకు తెలుగు సినిమా ఇంటి ఈ ఇద్దరూ ఆడపడుచులు అందరికీ గట్టి షాక్‌ ఇచ్చారు. ఎవ్వరూ ముట్టుకోవడానికి కూడా భయపడే ఇతివృత్తాన్ని తెరమీదకు తెచ్చే బృహత్తర ప్రయత్నాన్ని ఆ లేత తలల మీదకెత్తుకున్నారు. సావిత్రా.. అయ్యబాబోయ్.. ఆద్యంతాలు అర్థం కాని అవస్థ, అవ్యవస్థ సావిత్రి జీవితం. ఆ మహాతల్లి జీవితాన్ని ఓ రెండున్నర మూడు గంటల నిడివికి కలిపి కుట్టడానికి ఈ ఇద్దరు పిల్లలు ఆహోరాత్రాలు కష్టపడ్డారు. మనసా ఇష్టపడ్డారు. ఎక్కడెక్కడికి ప్రయాణించారో.. ఎన్నెన్ని ఆపసోపాలు పడ్డారో….ఎవ్వరికీ ఏమాత్రం నమ్మకం లేని ప్రాజెక్టు అది. ఎవడే సుబ్రహ్మణ్యం వేరు. అదో కొత్తకథ. చూసే వరకూ ఏమీ తెలియని ఓ వెసులుబాటు. సావిత్రి కథకి ప్రతీది కట్టుబాటే. అందరికీ సావిత్రి గురించి తెలుసు. ఎవ్వరికీ ఏమీ తెలియదు. అదీ సావిత్రి కథలోని సంక్లిష్టత. ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలి.. తేడా వస్తే సంస్ధ విశ్వసనీయతకి ఎంత తగ్గింపు? కానీ, స్వప్నా, ప్రియాంకలోని అంకితభావం, చేపట్టిన ప్రాజెక్టు పట్ల నిజాయితీతో కూడిన క్రమశిక్షణలో నుంచి కెరటమెత్తిన ఛాలెంజ్‌… వెరసి మహానటి చరిత్రకే ఓ సరికొత్త చరిత్రగా.. కనకవర్షం కురిపించిన సిరిసహిత చరిత్రను రాసింది. కాదు…కాదు…స్వప్నా, ప్రియాంక సంయుక్తంగా రాశారు. అశ్వనీదత్‌ అనే ఓ చిత్రనిర్మాణ యోధుడి జైత్రయాత్రలకు ఏరకంగానూ తీసికట్టు కాకుండా, వైజయంతీ మూవీస్‌కి స్వప్నామూవీస్‌ని తలకట్టుగా అలంకరించారు. సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవే అబ్బురపడిపోయి, ఉబ్బితబ్బిబ్బయిపోయారు. హీరోలతోనే కానక్కరలేదు.. మేం బ్లాక్‌బస్టర్‌ కొట్టడానికి అని సగర్వంగా నిరూపించిన స్వప్నా, ప్రియాంకల కన్నా తెలుగు చిత్రపరిశ్రమలో మేలిమి మహిళామణులు ఎవరుంటారు. మహిళాసాధికారికతకు ఇంతకన్న ఆమూల్యమైన ఆభరణాలు ఏముంటాయి?

ఇదిగో ఇప్పడు మళ్ళీ మరో పోకడ.. మరో విలక్షణత.. జాతిరత్నాలు చిత్రం. సినిమా అటుంచితే.. ప్రచారశైలికే వారు ఆపాదించిన వినూత్నశైలి సినిమాకి ఊహించని ఊపును తెచ్చింది. జాతిరత్నాలు కూడా భారీవిజయాన్ని నమోదు చేసుకోబోతోందన్న ఉత్సాహంతో ప్రేక్షకుడు థియేటర్‌లోకి వెళ్ళే ఓ మూడ్‌ని క్రియేట్‌ చేశారు. ఆడపిల్లలు కాదు ఆటంబాంబులు అనిపించుకున్నారు. అంతటి ఘనచరిత్రను మూటగట్టుకున్న అశ్వనీదత్‌ కూడా స్వప్నా, ప్రియాంకల సాధనకి, శోధనకి కేవలం ప్రేక్షకుడు మాత్రమే. అదీ వారి పరిణితి…అదీ వారి పరిపక్వత…ఈ ఇద్దరు మహిళామణులు రాబోయే కాలంలో భారతీయ చిత్రసీమ గర్వపడే సంచలన స్థానానికి ఎదుగుతారని ఆశిద్దాం.  

Advertisement
Advertisement
Advertisement