లక్ష్మీనరసింహ స్వామీ..మన్నించు..

ABN , First Publish Date - 2022-05-23T06:50:24+05:30 IST

ప్రసిద్ధి చెందిన మండలంలోని భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆర్జిత సేవలు ఐదు నెలలుగా ఆగిపోయాయి.

లక్ష్మీనరసింహ స్వామీ..మన్నించు..

భక్తరహళ్ళి క్షేత్రంలో ఆగిన ఆర్జిత సేవలు

పారితోషికం పెంచాలంటున్న కార్మికులు

పట్టించుకోని అధికారులు

మడకశిర/ మడకశిరరూరల్‌: ప్రసిద్ధి చెందిన మండలంలోని భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి  ఆలయాల్లో ఆర్జిత సేవలు ఐదు నెలలుగా ఆగిపోయాయి. స్వామి సేవలనే పట్టించుకునేవారు కరువయ్యారు. సేవలు నిలిపేసినట్లు నోటీసు అతికించారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే కార్మికులు ఎక్కువ మొత్తం అడగడంతో దేవదాయ శాఖ అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో కార్మికులు సేవలకు హాజరుకావట్లేదు. ఆ కారణంగా సేవలు ఆగిపోయాయి. దీంతో మొక్కుబడి చెల్లించేందుకు వచ్చే భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ రెండు దేవాలయాలు దేవదాయశాఖ పరిధిలో ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు  రాషా్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల ఆదాయం ఏడాదికి రూ.30 లక్షల వరకు ఉంటుంది. భక్తులు నిర్వహించే ఆర్జిత ఉత్సవాలు, కల్యాణోత్సవాల ద్వారా మరో రూ.8 లక్షల దాకా ఆదాయం సమకూరుతోంది. బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులు, మొక్కుబడులు ఉన్నవారు ప్రత్యేకంగా ఆలయానికి వచ్చి స్వామివారికి ఉత్సవాలు, కల్యాణోత్సవం జరిపిస్తారు. ఆలయంలో ఒకరోజు ఉత్సవం జరిపించాలంటే ఇద్దరు పూజారులు, 12 మంది కార్మికులు పాల్గొంటారు. ఉత్సవం చేయించేవారు ఆలయ రుసుము రూ.1000చెల్లిస్తారు. దేవాలయం పరిధిలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్వామివారిని పల్లకిలో ఆశీనులు గావించి, ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. అందుకు వారికి.. భక్తులు చెల్లించిన రూ.1000 రుసుమును ఇస్తారు. 12 మంది కార్మికులకు రూ.84 చొప్పున వస్తుంది. రోజంతా పనిచేసినా రూ.84 మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో రోజుకు రూ.500 చెల్లించాలని కోరుతున్నారు. అందుకు దేవదాయ శాఖ వర్గాలు ససేమిరా అనడంతో కార్మికులు దేవాలయంలో పనులకు రావడంలేదు. దీంతో ఉత్సవాలను నిలిపేసినట్లు ఆలయంలో నోటీసు అతికించారు.


రుసుము పెంచితే..

ఉత్సవ రుసుము రూ.6 వేలకు పెంచితే కార్మికులు అడిగినంత ఇచ్చే వీలుంటుంది. అలా చేస్తే భక్తులపై భారం పడుతుంది. వారు ఉత్సవాల నిర్వహణకు ఆసక్తి చూపకపోవచ్చని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ భారం దేవదాయ శాఖ భరించి, ఉత్సవాల నిర్వహణకు అవకాశం కల్పించాలని భక్తులు కోరతున్నారు.


ఉత్సవాలు పునఃప్రారంభించాలి

స్వామి వారికి ఉత్సవం నిర్వహించాలని రెండేళ్ల క్రితం మొక్కుకున్నా. దేవాలయంలో పూజారిని సంప్రదిస్తే తాత్కాలికంగా ఉత్సవాలను నిలిపివేశారన్నారు. దీంతో మొక్కుబడి చెల్లించుకోలేక వెనుదిరిగి వెళ్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా స్వామివారి ఉత్సవాలను పునఃప్రారంభించాలి.

దివ్య, సంకాపుర, మధుగిరి తాలూకా


నిర్వహణకు చర్యలు

ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు చర్యలు చేపడతాం. ఆలయంలో పనిచేసే కార్మికులు రోజువారీ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా ఇవ్వడానికి వీలులేదు. ఆలయ కమిటీ, భక్తులు, గ్రామస్థుల సమక్షంలో  సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకుంటాం.

నాగేంద్రప్రసాద్‌ రావు, ఈఓ



Updated Date - 2022-05-23T06:50:24+05:30 IST