భారత సమాజం పరివర్తన దిశగా సాగుతోంది : స్వామి బోధమయానంద

ABN , First Publish Date - 2020-10-28T23:41:06+05:30 IST

భారత సమాజం అపూర్వమైన పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్, రామకృష్ణమఠం హైదరాబాద్

భారత సమాజం పరివర్తన దిశగా సాగుతోంది : స్వామి బోధమయానంద

హైదరాబాద్: భారత సమాజం అపూర్వమైన పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్, రామకృష్ణమఠం హైదరాబాద్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. కోవిడ్ 19 ప్రతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, పని సంస్కృతిని కూడా పూర్తిగా మార్చేసిందని అభిప్రాయపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే అవగాహన వారోత్సవాల్లో భాగంగా ‘జాగృత భారతం - సంపన్న భారతం’ పేరుతో ఓ వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మాట్లాడుతూ... మంచి విషయాలను మాత్రమే వినాలని, వాటి గురించే మాట్లాడుతూ... వాటిని ఆచరిస్తూ జీవితాలను అర్థవంతంగా మార్చుకోవాలని సూచించారు. యువతను, ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి సమాజానికి దీపస్తంభాల వంటి వ్యక్తులు అవసరమని పేర్కొన్నారు. మానవ విశిష్టతను చాటే సమయం ఆసన్నమైందని, మంచి పరివర్తకులుగా మారాల్సిన సమయం కూడా వచ్చిందని స్వామి బోధమయానంద తెలిపారు. 


లోక్‌సత్తా అధినేత డా. జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... సమాజంలో అవినీతి నిర్మూలన జరగాలంటే సంస్థాగత వ్యవస్థ అవసరమని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవను అందించే దిశగా, సంస్కరణలను అమలు చేశారని, దక్షిణ మధ్య రైల్వేలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా పెరిగిందని ప్రశంసించారు. అవినీతి పెరిగిపోతోందన్న భావన సమాజంలో ఉందని, వాస్తవానికి అవినీతి తగ్గుముఖం పడుతోందని జయ ప్రకాశ్ నారాయణ తెలిపారు. న్యాయ కోవిదులు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. భారతీయులు తమ జీవితంలో ఆరు వేదాలతో ఎంతో ప్రభావితులయ్యారని, ప్రాచీన నాలుగు వేదాలే కాకుండా, మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతూ.. రాజ్యాంగం ఆరో వేదంగా పరిగణింపబడుతోందని శ్రీధర్ అన్నారు. 

Updated Date - 2020-10-28T23:41:06+05:30 IST