స్వామిస్తుతి–పరనింద

ABN , First Publish Date - 2021-10-20T08:08:49+05:30 IST

తెలంగాణ ఏర్పాటుకు ముందు అనుకున్న ముచ్చట్లు, పెట్టుకున్న ఆశలు, అమరవీరుల ఆశయాలు, ఉద్యమంలో ఎన్నో ప్రయాసలు పడ్డవాళ్ళు మన కండ్ల ముందు అరిగోసలు పడుతున్నారు...

స్వామిస్తుతి–పరనింద

తెలంగాణ ఏర్పాటుకు ముందు అనుకున్న ముచ్చట్లు, పెట్టుకున్న ఆశలు, అమరవీరుల ఆశయాలు, ఉద్యమంలో ఎన్నో ప్రయాసలు పడ్డవాళ్ళు మన కండ్ల ముందు అరిగోసలు పడుతున్నారు. ఇవేవీ మన జర్నలిస్టు మిత్రులు, ఆందోలు శాసన సభ్యులు క్రాంతి కిరణ్ గారికి యాదికి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారనే స్పృహ కూడా లేకుండా, కేవలం ఆందోల్ నుంచి కేసీఆర్ నామినేట్ చేసిండేమో అనుకుని ‘ఆంధ్రజ్యోతి’కి వ్యాసాన్ని (అక్టోబరు 5న) రాసినట్టుగా ఉంది. అంతులేని ఆత్మవంచన చేసుకుని, స్వామిస్తుతికీ పరనిందకు తన రాతలను పరిమితం చేసినట్టుగా ఉంది. 


నేటి వాస్తవాలన్నీ కండ్లముందే ఉన్నయి. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, ఏడాదికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని ఇదే టీఆర్‌ఎస్ బాజాప్త ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. గతంలో చేసినట్టు ఏవో పట్టా కాగితాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వబోమని, దున్నుకోవడానికి పనికొచ్చే భూమిని, పెట్టుబడిని ఇస్తామని చెప్పారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అదే దళిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూములను ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది, ఇంకా గుంజుకుంటున్నది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తికావస్తున్నా ఆ సంగతే యాది లేనట్టు ఉంటే, దీని గురించి అడగాల్సిన ఇలాంటి తిమిర(క్రా)కాంతులు ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తుంటే ఏమనాలి? 


ఇండ్ల స్థలాలకోసం ఒక్కొక్క జర్నలిస్టు పన్నెండేళ్ళ క్రితం రెండు లక్షల రూపాయలను అప్పుసప్పు చేసి, ఇంటి ఆడోళ్ల పుస్తెలమ్మి సొసైటీలో జమ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని కేసీఅర్, కేటీఆర్ చెప్పింది మన కండ్ల ముందున్న వాస్తవం కాదా? ఈ ఉగాదికి జర్నలిస్టుల ఇండ్లకు ముగ్గువోస్తం, దసరాకు ఇండ్లళ్లకు వోతం అని ఐదేండ్ల కింద చెప్పిన కేసీఆర్ ఇంకా చెయ్యలేదు అనేది మన జర్నలిస్టుల కండ్ల ముందున్న వాస్తవం. మనతో కలిసి పని చేసిన జర్నలిస్టు సోదరులు పన్నెండేండ్ల క్రితం రెండు లక్షలు అప్పుసప్పు ఇచ్చిన వారు, ఇతర సొసైటీలలో ఉన్నోళ్లు, ఆ తర్వాత చేరిన వాళ్ళు, జిల్లాల్లో ఉన్నోళ్లు మన కండ్ల ముందే పిట్టల్లా రాలిపోయారు. వాళ్ళ కుటుంబాలకు గూడు దిక్కులేక అల్లాడిపోతున్నారనేది వాస్తవం కాదా? హైదరాబాద్, వరంగల్ ప్రెస్ క్లబ్, ఇతర జిల్లాలకు కేసిఆర్ ఇచ్చిన హామీలకు చెందిన వీడియో క్లిప్పింగులు మన కండ్ల ముందు ఉన్నయి. ఇలాంటి వాస్తవాలు మన జర్నలిస్టు మిత్రునికి ఒక పదవి వచ్చినంక కనిపించకపోతే ఆశ్చర్యం ఏముంది? 


అటుకులు బుక్కీ, అవి కూడా లేని రోజు నీళ్లు తాగి తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు ఇయ్యాల ఎక్కడున్నరు? తెలంగాణ ప్రజలు అరిగోస పడుతుంటే పరాయి పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నోళ్లే, మన స్వరాష్ట్రంలో ఇప్పుడు కూడా ఉద్యమకారుల మీద పెత్తనం చేస్తున్నరు. ఉద్యమకారుల మీదకు కట్టెలతో దాడికి దిగిన వాళ్లే ఇయ్యాల పాలకులు. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం తండ్లాడినోళ్ళు ఇప్పుడు ద్రోహులు అయిండ్రు. 


ఆఖరికి ఒక్క ముచ్చట. పదవి మీద ఆశతోనే అబద్ధాలు ప్రచారం అని రాసిన వ్యాసకర్తకు ఒక చిన్న సంగతి యాదికి తెద్దాం. ఆయన టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రాదేశిక సభ్యులుగా (జడ్పీటీసీ) ఉన్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్ రాకపోతే టీఆర్‌ఎస్ లో చేరారు. 2009లో టికెట్ రాకుంటే ఇదే టీఆర్‌ఎస్ కార్యాలయం మీద రాళ్లు విసిరిన, అద్దాలను బద్దలు చేసిన చేతులతోనే, ఎమ్మెల్యే అయినందుకు ఇప్పుడు ఈ వ్యాసం రాసినరేమో. అయినా ఇదేమీ పదవీ వ్యామోహం అని నేను అంటలేను, కాకపోవచ్చు కూడా.

బోరెడ్డి అయోధ్య రెడ్డి

అధికార ప్రతినిధి (మీడియా – అధికార ప్రతినిధుల సమన్వయకర్త)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

Updated Date - 2021-10-20T08:08:49+05:30 IST