స్వామినారాయణ్‌ ట్రస్ట్‌ వెట్టిచాకిరీ!

ABN , First Publish Date - 2021-05-14T07:59:45+05:30 IST

‘‘పొద్దున్నే 6.30కు పనికెక్కుతాం.. రాత్రి 7.30 దాకా పనిచేస్తూనే ఉంటాం. అందుకు ఇచ్చే కూలీ చాలా తక్కువ. అది కూడా చేతికి కొంతే ఇస్తారు. భారత్‌లోని మా బ్యాంకు....

స్వామినారాయణ్‌ ట్రస్ట్‌ వెట్టిచాకిరీ!

న్యూజెర్సీలో భారతీయ కూలీల వ్యాజ్యం


న్యూజెర్సీ, మే 13: ‘‘పొద్దున్నే 6.30కు పనికెక్కుతాం.. రాత్రి 7.30 దాకా పనిచేస్తూనే ఉంటాం. అందుకు ఇచ్చే కూలీ చాలా తక్కువ. అది కూడా చేతికి కొంతే ఇస్తారు. భారత్‌లోని మా బ్యాంకు ఖాతాల్లో మిగతాది జమచేస్తారు’’ అంటూ.. బొచసన్వాసీ శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎ్‌స)పై భారతీయ కూలీలు న్యూజెర్సీ కోర్టులో కేసు వేశారు. 2018లో న్యూజెర్సీలో 162 ఎకరాల్లో భారీ స్వామినారాయణ్‌ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. వందల మంది కూలీలను భారత్‌ నుంచి ‘ఆర్‌-1’ వీసాపై తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక, తమ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, నిర్బంధంగా పనిచేయిస్తున్నారంటూ 200 మంది కూలీలు జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు.


ఆలయ ప్రాంగణం చుట్టూ భారీ కాంపౌండ్‌ వాల్‌, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుందని వారు కోర్టుకు వివరించారు. బయటకు వెళ్లాలంటే.. ట్రస్టు తరఫు వారు వెంట ఉంటేనే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నెలకు రూ. 33 వేల(450 డాలర్లు) జీతం ఇస్తున్నారని, రోజుకు 13 గంటలు పనిచేయాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. అంటే.. గంటకు రూ. 88 చొప్పున కూలీ దక్కుతోందని తెలిపారు. నెలకు 50 డాలర్లు మాత్రమే చేతికి ఇస్తారని, మిగతా 400 డాలర్లు భారత్‌లోని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని పేర్కొన్నారు. నిజానికి న్యూజెర్సీ కార్మిక చట్టాల ప్రకారం వారానికి 40 గంటలు మాత్రమే పనిచేయించాలి. కానీ, స్వామినారయణ్‌ ఆలయ నిర్మాణంలో కూలీలతో 87 గంటలు పనిచేయిస్తున్నారు. అలాంటప్పుడు కూలీలకు అదనంగా చెల్లించాలని నిబంధనలు, చట్టాలు చెబుతున్నాయి. న్యూజెర్సీ కార్మిక చట్టాల ప్రకారం.. గంటకు 12 డాలర్ల కూలీ ఇవ్వాలి. కానీ, స్వామినారాయణ్‌ ఆలయ నిర్మాణంలో అందులో పదోవంతు.. అంటే 1.2 డాలర్లు మాత్రమే ఇస్తున్నారు.


ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. దర్యాప్తునకు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎ్‌ఫబీఐ)ని ఆదేశించింది. తాము ఒప్పందంలో భాగంగానే కూలీలు ఇస్తున్నామని బీఏపీఎస్‌ చెబుతున్నా.. ఇక్కడ పనిచేస్తున్న కూలీలంతా ఆంగ్లంలో పరిజ్ఞానం లేనివారని ఒప్పందంలోని అంశాలు వారికి తెలియవని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ దళిత హక్కుల కమిషన్‌ పేర్కొంది. భారతీయ కూలీల్లో ఎక్కువ మంది దళితులు ఉన్నారని ఆ కమిషన్‌ అధ్యక్షుడు డీబీ సాగర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-14T07:59:45+05:30 IST