మన భాగ్యనగరంలో వివేకానందుడి పాదముద్రలు

ABN , First Publish Date - 2022-02-11T22:39:17+05:30 IST

భారతదేశాన్ని జాగృతం చేసే మహోన్నత లక్ష్యంలో భాగంగా నరేంద్రుడు 1893, ఫిబ్రవరి10న హైదరాబాద్‌ వచ్చారు.

మన భాగ్యనగరంలో వివేకానందుడి పాదముద్రలు

‘భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత మానవతామూర్తి స్వామి వివేకానంద. ఆయన తొలి ఆంగ్ల ఉపన్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. చికాగోలోని సర్వమత సమ్మేళనం వేదికపై తన ప్రసంగానికి 1893, ఫిబ్రవరి13న  ‘మహబూబ్‌ కాలేజీ’ లో జరిగిన సభ ఒక రిహార్సల్‌ అంటూ స్వామీజీనే ప్రకటించారు. అలా ఆ తాత్వికుడి పాదముద్రలు ఈ నేల మీద కొలువుదీరాయి. కనుక ఆ రోజును ‘వివేకానంద డే’గా ప్రకటించాలని రామకృష్ణ మఠం వలంటీర్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందుకు సంతకాల సేకరణతో పాటు ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌నూ నిర్వహిస్తున్నారు.’’


హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి11 (ఆంధ్ర జ్యోతి): ‘బలమే జీవనం..బలహీనతే మరణం’ అంటూ యువ భారతాన్ని మేల్కొలిపిన గొప్ప తాత్వికుడు స్వామి వివేకానంద. ఆయన పేరు స్మరించుకుంటేనే ఆత్మస్థైర్యం ఆవహిస్తుంది. స్వామీజీ బోధనలు యువత భవితకు సోపానాలు. భారతదేశాన్ని జాగృతం చేసే మహోన్నత లక్ష్యంలో భాగంగా నరేంద్రుడు 1893, ఫిబ్రవరి10న హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడే వారం పాటు బస చేశారు. గుర్రపు బగ్గీలో ప్రయాణిస్తూ, గోల్కొండ, చార్మినార్‌, మక్కామసీదు, బాబా షరఫుద్దీన్‌ దర్గా తదితర చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలనూ సందర్శించారు. కుర్షిద్‌ జా దేవిడీ, బషీర్‌బాగ్‌ ప్యాలెస్‌ తదితర రాజభవనాల్లో ఆతిథ్యం స్వీకరించారు. నిజాం మింట్‌ (నాణేల తయారీ) లో పనిచేసే బెంగాల్‌కి చెందిన బాబు మధుసూదన్‌ ఛటర్జీతో స్వామి వివేకానందకు పరిచయం. ఆయన ఆహ్వానం మేరకు మద్రాసు నుంచి కమండలం చేతపట్టిన కాషాంబరధారి నగరానికి వచ్చారు. నిజాం కుటుంబ సభ్యులు, ప్రభుత్వాధికారులతో పాటు సుమారు 500మంది సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆ మహనీయుడికి ఘన స్వాగతం పలికారు. తర్వాత రోజు సికింద్రాబాద్‌కి చెందిన విద్యావేత్తలు, వ్యాపారస్తులు కొందరు స్వామీజీని కలిసి, తాము తలపెట్టిన బహిరంగ సభకు రావాలని కోరారు.


తొలి ఉపన్యాసం...


అలా 1893, ఫిబ్రవరి 13న ప్యాట్నీలోని మహబూబ్‌ కళాశాల మైదానంలో స్వామి వివేకానంద ‘మై మిషన్‌ టు ది వెస్ట్‌’ (పాశ్చాత్య ప్రయాణం వెనుక ముఖ్య ఉద్దేశం) అంశంపై ఆంగ్లంలో రెండు గంటలపాటు ఉపన్యసించారు. వివేకానంద ఆంగ్లంలో ఉపన్యసించిన తొలి బహిరంగ ఉపన్యాసం ఇదే కావడం విశేషం. అందుకు నగరం వేదిక కావడం గొప్ప చారిత్రక సందర్భం.! హిందు, ముస్లిం, క్రిష్టియన్లతో పాటు కుల,మత, ప్రాంతాలకు అతీతంగా సుమారు రెండు వేలమంది స్వామీజీ సభకు హాజరయ్యారు. నరేంద్రుడి వాగ్ధాటికి, ఆయన మాటల్లోని మానవీయ స్పర్శకు సభికులంతా తాదాత్మ్యం చెందారు. తాత్వికుడి లక్ష్యాన్ని అక్కడి వారంతా గుండెలకు హత్తుకున్నారు. కరతాళ ధ్వనులతో తమ మద్దతును ప్రకటించారు. చికాగోలోని సర్వమత సమ్మేళనంలో సాగే తన ఉపన్యాసానికి నగరంలోని సభ ఒక రిహార్సల్‌ అని స్వామి వివేకానంద ఆ సమావేశంలో ప్రస్తావించారు. ఆ సభతో నగర యవనికపై మహత్తరమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ మహోన్నత సందర్భాన్ని భావితరాలు స్మరించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఫిబ్రవరి13ను ‘వివేకానంద డే’ గా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రామకృష్ణ మఠం వలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేదికగా సంతకాల సేకరణతో పాటు క్యాంపెయిన్‌నూ చేపట్టారు. 


స్వామీజీ ఉపన్యాస నైపుణ్య పరీక్షకు నగరం వేదిక...

 

స్వామి వివేకానంద భాగ్యనగర సందర్శన ఈ నేల చరిత్ర పుటలో అత్యంత ప్రత్యేకమైంది. స్వామీజీని దర్శించిన భాగ్యనగర వాసులు ఎంతటి భాగ్యవంతులో.! మహబూబ్‌ కళాశాల మైదానంలోని సభలో హైందవ ధర్మ ప్రాశస్త్యం, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలోని నైతిక ఆదర్శాలు తదితర అంశాలను స్వామీజీ వివరించారు. ఆయన తొలి ఆంగ్ల ఉపన్యాసం విన్నవారంతా మంత్రముగ్ధులయ్యారు. చికాగోలోని విశ్వమత ప్రతినిధుల సభకి వెళ్లేముందు హైదరాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడటం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద వ్యక్తంచేశారు. వివేకానందుడిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన చారిత్రక స్ఫూర్తికి చిహ్నంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి13ను వివేకానంద డేగా నిర్వహించాలి. తద్వారా స్వామీజీ సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడుతుంది.



  -సముద్రాలమధుసూదనాచార్యులు, వలంటీర్‌, రామకృష్ణ మఠం(9290449389)

Updated Date - 2022-02-11T22:39:17+05:30 IST