స్వామీ.. ఇదేమీ!

ABN , First Publish Date - 2021-12-15T05:51:46+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రసాదాల తయారీపై అధికారుల పర్య వేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. అనంతరం ఎంతో పవిత్రంగా భావించి ప్రసాదాలను క్యూలైన్లలో గంట ల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తుంటారు.

స్వామీ.. ఇదేమీ!
చేతుల్లోనే లడ్డూలను తీసుకెళ్తున్న భక్తులు

ప్రసాదాలపై కొరవడిన పర్యవేక్షణ

యాదాద్రీశుడి వడ ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ 

ఇటీవల కవర్లు లేకుండానే భక్తులకు ప్రసాదాల అందజేత



(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రసాదాల తయారీపై అధికారుల పర్య వేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. అనంతరం ఎంతో పవిత్రంగా భావించి ప్రసాదాలను క్యూలైన్లలో గంట ల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ప్రసాదాల తయారీలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో అనుకోని ఘటనలు భక్తులను నివ్వెర పరుస్తున్నాయి. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందు తున్న ఆలయానికి రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలుండగా, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుండడం విస్మయానికి గురి చేస్తున్నాయి. 


యాదాద్రి లక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో ప్రసాదాల తయారీలో సిబ్బం ది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వడ ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ ఉండటంపై హైదరాబాద్‌కు చెందిన భక్తుడు జగిని సందీప్‌ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో మంగళవారం విషయం వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు జగిని సందీప్‌ ఈ నెల 12వ తేదీన యాదాద్రి లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకుని బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నందుకు దేవస్థాన అధికారులు రెండు అభిషేకం లడ్డూలు, ఐదు పులిహోర, ఐదు వడ ప్రసాదాలను అందజేశారు. సందీప్‌ ప్రసాదాలను తమ కుటుంబ సభ్యులకు పంపిణీ చేసేందుకు వడ ప్రసాదాలను ముక్కలు చేయగా అందులో ప్లాస్టిక్‌ కవర్‌ ఉండటాన్ని గమనించారు. వడ ప్రసాదంలో ప్లాస్టిక్‌ కవర్‌ను వీడియో తీసి మీడియా ప్రతినిధులు, దేవస్థాన అధికారులకు, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన స్వామివారి ప్రసాదాలను కవర్లులేకుండానే భక్తులకు విక్రయించారు. గత్యంతరం లేక భక్తులు చేతుల్లోనే ప్రసాదాలను తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. 


వివాదాస్పదమవుతున్న ప్రజాప్రతినిధుల తీరు

ఇటీవల నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు టీఆర్‌ఎ్‌సకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నా రు. ప్రజాప్రతినిధులంతా ఒకేసారి బాలాలయంలోకి రావడంతో భక్తు లు అసౌకర్యానికి గురయ్యారు. వారందరి దర్శనాలు అయ్యేవరకూ భక్తు లు నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు 100 మందికి పైగా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు వచ్చి నేరుగా కొండపైన నిర్మాణంలో ఉన్న ప్రధానాలయంలోకి వెళ్లడం వివాస్పదమైంది. ప్రధానాలయంలోకి వైటీడీఏ, వీవీఐపీలకు తప్ప మరెవ్వరికీ అనుమతిలేదు. ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రధానాలయంలోకి వెళ్లడంపై భక్తులనుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.  


చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

వీవీఐపీలు, వీఐపీల విషయంలో ఇలాంటి నిబంధనల విషయంలో ఆలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డి మూడున్నర కిలోలకు సంబంధించిన నగదుతోపాటు చెక్కులను ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ సంప్రదాయాలను పాటించలేదు. మంత్రి మల్లారెడ్డి దాదాపు 100కు పైగా వాహనాల్లో కొండపైకి చేరుకున్నారు. దీంతో మంత్రి పర్యటన సందర్భంగా కొండపైకి భక్తుల వాహనాలను అధికారులు అనుమతించలేదు. సుమారు గంటకు పైగా మంత్రి పర్యటన సమయంలో సామాన్య భక్తులకు బాలాలయ కవచమూర్తుల దర్శనాలను నిలిపివేశారు. బాలాలయంలో కవచమూర్తులను మంత్రితోపాటు ఇతరులు దర్శించుకున్న ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  కాగా మంత్రి పర్యటన సందర్భంగా కార్యకర్తలు, బంధుమిత్రులు బాలాలయంలో నిబంధనలకు విరుద్దంగా ఫొటోలు, సెల్ఫీలతో హడావుడి చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే మంత్రితోపాటు వచ్చిన కొంతమంది ఫొటోలు తీయడం, బాలాలయంలో డ్రోన్‌ కెమెరాను తిప్పడం అత్యంత వివాదాస్పదంగా మారింది.  

Updated Date - 2021-12-15T05:51:46+05:30 IST