Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 24 Jan 2022 01:45:47 IST

సందేశం కోసం సాహసం

twitter-iconwatsapp-iconfb-icon
సందేశం కోసం సాహసం

ప్రకృతిపై ప్రేమతో పెను సాహసమే చేసింది ఓ కేరళ అమ్మాయి. అలలపై తేలుతూ... వేగంతో పోటీపడుతూ... కయాకింగ్‌ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశం ఇచ్చింది. వయసు చిన్నదే... కానీ ఎందరిలోనో సామాజిక చైతన్యం రగిలిస్తున్న స్వలిహా రఫిక్‌ కథ ఇది..


తోటి విద్యార్థులు... స్నేహితులు పాఠాలు అర్థం చేసుకోవడానికి అవస్థలు పడుతుంటే... తనే ఒక పాఠ్యాంశమైంది స్వలిహా రఫీక్‌. నాలుగేళ్ల కిందటి ముచ్చట ఇది. 2017 జూన్‌లో పది కిలోమీటర్ల సుల్తాన్‌ కెనాల్‌లో కయాకింగ్‌ చేసి చరిత్ర సృష్టించింది స్వలిహా. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. రెండేళ్ల తరువాత సీబీఎస్‌ఈ ఐదో తరగతి ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌లో ఆమె కథ ఒక పాఠమైంది. 


పర్యావరణ ప్రేమికురాలిగా... 

పుదియంగడి... కేరళ రాష్ట్రం, కన్నూర్‌ జిల్లాలోని మారుమూల గ్రామం. పచ్చందాలు పరుచుకున్న ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన స్వలిహాకు చిన్నప్పటి నుంచి పర్యావరణం అంటే ఎంతో మక్కువ. అందుకు కారణం వాళ్ల నాన్న రఫీక్‌. ‘‘నా చిన్నప్పుడు మా నాన్న షార్జాలో పని చేసేవారు. ఒక రోజు ఫోన్‌ చేసి... భారత్‌కు తిరిగి వచ్చేస్తున్నానని, ఇకపై మాతోనే కలిసి ఉంటానని చెప్పారు. అప్పుడు నేను ‘ఎందుకు వస్తున్నావ్‌’ అని అడిగాను. అందుకు ఆయన... ‘నదులు, చెట్లు లేకపోవడం వల్ల ఇక్కడ వాతావరణం బాగా వేడిగా ఉంది. అందుకే’ అన్నారు. మరుసటి రోజే ఇంటి చుట్టూ మొక్కలు నాటడం మొదలుపెట్టాను’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకుంది స్వలిహా. తిరిగొచ్చిన తండ్రి తన కూతురు నాటిన మొక్కలు చూసి మురిసిపోయారు. పర్యావరణహితం వైపు ఆమెను ప్రోత్సహించారు. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ కార్యక్రమం జరిగినా స్వలిహా ఉండాల్సిందే. పర్యావరణ కార్యకర్తగా నిత్యం ఎంతోమందికి అవగాహన కల్పిస్తోంది. 


దాతృత్వం... 

ప్రస్తుతం ‘వాడి హుడ హెచ్‌ఎస్‌ఎస్‌’ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది స్వలిహా. ఒక పక్క చదువుకొంటూనే తనకు నచ్చిన కయాకింగ్‌ను కొనసాగిస్తోంది. ఆమె చేస్తున్న పర్యావరణహిత కార్యక్రమాలకు మెచ్చి 2020లో కేరళ ప్రభుత్వం ‘ఉజ్వల బాల్యం’ అవార్డునిచ్చింది. దాని కింద వచ్చిన రూ.25 వేల నగదు బహుమతిని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించి, తన దాతృత్వాన్ని చాటుకుంది ఆమె. అలాగే 2017లో పది కిలోమీటర్ల కయాకింగ్‌ను పూర్తిచేసినందుకు గాను మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న స్వలిహా ఐదేళ్లప్పుడే ఈత నేర్చుకోవడం మొదలుపెట్టింది. 


ఎంతో కఠినం... 

‘‘నిజంగా ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. నేను ఎంతటి సాహసం తలపెట్టానో దిగితే కానీ తెలియలేదు. దీనికి అనుమతి కోసం అధికారులను కలిసినప్పుడు... వారు భయపడ్డారు. ‘చిన్న పిల్లవి. అదీ ఒంటరిగా... అంత రిస్క్‌ అవసరమా’ అన్నారు. నేను వినలేదు. నా పట్టుదల, ధైర్యం చూసి వాళ్లు అనుమతులిచ్చారు. పర్యావరణ హితం కోసం ఎవరికి వారు తమకు తోచింది చేయండి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం... భూమిలో కలిసిపోయే ఉత్పత్తులనే ఉపయోగించడం... ఇలా ఏదోఒకలా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపు ఇచ్చేందుకే ఈ సాహసం చేశాను’’ అంటున్న స్వలిహా కయాకింగ్‌, స్విమ్మింగ్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సందేశం కోసం సాహసం

సంచలనం కోసం కాదు... 

స్వలిహా ఏది తలపెట్టినా అందులో సామాజిక కోణం ఉంటుంది. ‘‘తిరిగే నేల... పీల్చే గాలి... తాగే నీరు... నేడు ఎక్కడ చూసినా కాలుష్యమే. ఈ తరుణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. లేదంటే భవిష్యత్తు ఉండదు’’ అంటుంది ఆమె. ఈ సందేశాన్ని బలంగా వినిపించడం కోసమే తను పెను సాహసానికి పూనుకుంది. అదే 35 కిలోమీటర్ల కయాకింగ్‌. సముద్రం, నది కలిసే అతి క్లిష్టమైన సుల్తాన్‌ కెనాల్‌లో సాగే ప్రయాణం ఇది. వద్దు వద్దని చెప్పినా ఆమె వినలేదు. ప్రాణాలకే ముప్పని హెచ్చరించినా పట్టించుకోలేదు. గమ్యం చేరాలంటే... ముందుగా భీకరమైన సముద్రపు అలలకు ఎదురెళ్లాలి. వాటిని దాటి... ఆపై పయనం సాగించాలి. అంతటి ప్రవాహాన్ని తట్టుకొంటూ... సముద్రపు గాలిని చీల్చుకొంటూ... చివరకు పళ్యాంగడి నదిని చేరి... ఒంటరిగా లక్ష్యాన్ని అధిగమించింది స్వలిహా. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.