స్వదేశీకి నూటొక్క దండాలు!

ABN , First Publish Date - 2020-08-13T07:26:27+05:30 IST

ప్రపంచంలో రెండో అతి పెద్ద సైన్యం కలిగిన దేశం భారత్‌! కానీ మనకు కావాల్సిన ఆయుధాలను సొంతంగా తయారుచేసుకోలేని దుస్థితి మనది!! దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల్లో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే...

స్వదేశీకి నూటొక్క దండాలు!

ప్రపంచంలో రెండో అతి పెద్ద సైన్యం కలిగిన దేశం భారత్‌! కానీ మనకు కావాల్సిన ఆయుధాలను సొంతంగా తయారుచేసుకోలేని దుస్థితి మనది!! దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల్లో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో సౌదీ అరేబియా తర్వాత రెండో స్థానం భారత్‌దే! 


  • ఆయుధాల తయారీలో ఆత్మ నిర్భర్
  • దిగుమతుల నిషేధంతో స్వదేశీకి ఊతం ప్రైవేటు సంస్థల్లో కోటి ఆశలు
  • సర్కారు ప్రోత్సహిస్తేనే స్వావలంబన
  • నిధుల కొరతే ప్రధాన సమస్య 


(రక్షణ ప్రత్యేక ప్రతినిధి, ఆంధ్రజ్యోతి)

ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో దాదాపు పది శాతం భారత్‌కే చేరుకుంటున్నాయి. ఇటీవల చైనా గాల్వన్‌లో దురాక్రమణకు పాల్పడినప్పుడు భారత్‌ అత్యవసరంగా రష్యన్‌ యుద్ధ విమానాల కోసం ఆర్డర్లు పెట్టాల్సి వచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హుటాహుటిన రష్యాకు వెళ్లి ఆయుధాల సరఫరాపై చర్చలు జరపాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తీసుకువచ్చి, దేశీయ ఆయుధ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పలు రకాల ఆయుధాల దిగుమతిపై నిషేధం విధించింది.


101 రకాల పరికరాలు, ఆయుధాల దిగుమతిని నిషేధిస్తూ గత ఆదివారం ఒక జాబితాను విడుదల చేసింది. అయితే ఈ నిషేధం వల్ల భారత్‌లో ఆయుధాల తయారీ ఊపందుకుంటుందా? నిషేధ జాబితాలోని ఆయుధాలను దేశీయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత ఆయుధ పరిశ్రమకు ఉందా? స్వదేశీ సంస్థలకు ప్రభుత్వం ఎంతవరకూ అండగా నిలబడుతుంది? ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిషేధానికి కట్టుబడి ఉంటుందా? లేదంటే అత్యవసర పరిస్థితి అంటూ మళ్లీ దిగుమతులకు లాకులెత్తేస్తుందా? అసలు రక్షణ శాఖ విడుదల చేసిన ఈ 101 పరికరాలు/ఆయుధాల జాబితాకు ఉన్న విలువ ఎంత? అనే ప్రశ్నలు రక్షణ వర్గాల్లోను, రాజకీయ వర్గాలోనూ వినిపిస్తున్నాయి.


భారత్‌లో దేశీయ ఆయుధ ఉత్పత్తి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కేంద్రీకృతమై ఉంది. రక్షణ ఉత్పత్తుల్లో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం అనేది ప్రారంభమైంది ఇటీవలి కాలంలోనే! ప్రభుత్వ రంగంలో ఆయుధాల అభివృద్ధి, తయారీకి చాలా ఎక్కువ సమయం పడుతోందని, వాటి నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదనే కారణాలతో త్రివిధ దళాలు ఆయుధాల దిగుమతికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. అయితే దిగుమతులపై మోజుతో స్వదేశీ ఆయుధాలను త్రివిధ దళాలు ఏదో వంకన తిరస్కరిస్తున్నాయని రక్షణ పరిశోధన సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 101 ఆయుధాల దిగుమతిపై నిషేధం ఈ దిశగా సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తోంది. అయితే ఈ జాబితాను పరిశీలిస్తే ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.


కేవలం భారత్‌లో మాత్రమే తయారయ్యే కొన్ని ఆయుధాలను ఈ ‘దిగుమతి’ నిషేధ జాబితాలో చేర్చారు. ఉదాహరణకు ఎల్‌సీఏ ఎంకే 1ఏ (తేజస్‌), అస్త్ర (విమాన విధ్వంసక) క్షిపణి, లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌ వంటివి!! భారత్‌ తప్ప ఇతర దేశాలేవీ వీటిని ఉత్పత్తే చేయనప్పుడు భారత్‌ వాటిని ఎలా దిగుమతి చేసుకోగలుగుతుంది? దిగుమతే సాధ్యం కాని ఆయుధాలను ‘దిగుమతి నిషేధ’ జాబితాలో ఎలా చేరుస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో వేరే పేర్లతో అలాంటి ఆయుధాలే అందుబాటులో ఉన్నాయని, సైన్యం వాటిని దిగుమతి చేసుకోకుండా అడ్డుకునేందుకే నిషేధ జాబితాలో ఆ పేర్లను చేర్చామని రక్షణ శాఖ చెబుతుండగా, ఇది కేవలం ప్రచార గిమ్మిక్కేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక జాబితాలోని ఆయుధాల్లో మరికొన్ని భారత్‌లో ఇప్పటికే ఉత్పత్తి అవుతున్నవే! మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు, 155 ఎంఎం గన్స్‌, 155 ఎంఎం హోవిట్జర్లు, కార్వెట్లు, మరికొన్ని ఇతర పరికరాలను భారత ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పటికే తయారుచేస్తున్నాయి. అందువల్ల దిగుమతి నిషేధ జాబితాలో వాటిని చేర్చడం అర్థరహితమని, దానివల్ల స్వదేశీ పరిశ్రమకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దిగుమతుల్ని నిషేధించడం వల్ల స్వదేశీ సంస్థలు బలపడతాయని, సైన్యం తమ ఆయుధాలనే కొంటుందనే హామీ ఆయా సంస్థలకు లభిస్తుందని సైనిక నిపుణులు చెబుతున్నారు.


‘‘దిగుమతి నిషేధ జాబితాను ప్రకటించడం వల్ల రెండు లాభాలున్నాయి. ఆయా ఆయుధాలను ఇప్పటికే తయారుచేస్తున్న సంస్థలకు వాటిని అమ్ముకోగలమనే భరోసా లభిస్తుంది. అలాగే దేశీయంగా ఆయుఽ ద ఉత్పత్తి కోసం విదేశీ కంపెనీలతో ఇప్పటి కే జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేసుకున్న, చేసుకోవాలనుకునే సంస్థలకు కూడా ఊరట కలుగుతుంది’’ అని భారత వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ (రిటైర్డ్‌) కృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో రూ.4 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను స్వదేశీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే ఇప్పటికే విదేశాలతో ఒప్పందాలు జరిగిన ఆయుధాలకు చెల్లింపులు చేసేందుకే ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితి ఉంది. ఫ్రాన్స్‌ నుంచి 126కు బదులుగా 36 రాఫెల్‌ విమానాలనే కొనడానికి నిధుల కొరత కూడా ఒక కారణమని భారత ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది. మరో 114 విదేశీ యుద్ధ విమానాలు, రష్యా నుంచి ఎస్‌400 క్షిపణి వ్యవస్థలు, అమెరికా నుంచి మరిన్ని పీ8ఐ విమానాలు.. ఇలాంటి పలు ఆయుధ కొనుగోళ్ల నిమిత్తం వచ్చే పదేళ్లలో భారత్‌ లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరపాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో స్వదేశీ సంస్థలకు ఆయుధ కొనుగోళ్లపై ప్రభుత్వం ఎంతవరకూ భరోసా ఇవ్వగలదనే సందేహాలను పరిశ్రమ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిసార్లు దేశీయంగా తయారుచేసే ఆయుధాల ధర తొలినాళ్లలో విదేశీ ఆయుధాల ధర కంటే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వం మనసు మార్చుకుని దిగుమతులకే మొగ్గు చూపుతుందేమోననే అనుమానాలు ప్రైవేటు సంస్థల్లో ఉన్నాయి. ‘‘నిషేధ జాబితాలో జనరల్‌గా కాకుండా కొన్ని ఆయుధాల స్పెసిఫికేషన్లను, కొన్ని గన్‌ల క్యాలిబర్లను మరీ నిర్దిష్టంగా పేర్కొన్నారు. అంటే దానికి ఓ అర మిల్లీమీటర్‌ అటో ఇటో ఉండే గన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నట్టే కదా!’’ అని రక్షణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. అందువల్ల ‘ఆత్మ నిర్భర్‌’ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామనే భరోసాను ప్రభుత్వం కల్పించాలని, ఆర్డర్లపై హామీ ఇవ్వాలని, అప్పుడే దేశీయ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.


దిగుమతుల్ని నిషేధించిన 101 ఆయుధాల జాబితాలో కొన్నింటి దిగుమతుల్ని ఈ ఏడాది డిసెంబరు నుంచే ఆపేస్తామని తెలపగా... మరికొన్ని 2021, 2022, 2023, 2024, 2025 డిసెంబరు నాటికి నిలిపివేస్తామని పేర్కొన్నారు. అంటే వచ్చే అయిదేళ్లలోగా అనేక ఆయుధాలను దేశీయంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధ్యమవ్వాలంటే రక్షణ రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నీ వచ్చే అయిదేళ్లూ చెమటోడ్చక తప్పదు. ఈ జాబితాను ప్రకటించడం ద్వారా... వచ్చే అయిదేళ్లలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల సంస్థలు వేటి తయారీపై దృష్టి పెట్టాలో ప్రభుత్వం స్పష్టంగా దిశా నిర్దేశం చేసినట్లయిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జాబితాలోని ఏవైనా ఆయుధాలను విదేశీ సంస్థలు భారత్‌కు విక్రయించాలనుకుంటే భారతీయ సంస్థలతో అవి జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేసుకుని దేశీయంగా వాటిని తయారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా దేశీయ రక్షణ పరిశ్రమకు లబ్ధి చేకూరుతుంది. మొత్తమ్మీద కేంద్రం ప్రకటించిన జాబితా భారత రక్షణ రంగాన్ని ఎంతోకొంత మలుపు తిప్పగలదనే ఆశాభావమే ఎక్కువగా ఉంది. మొదట్లో నిధుల కొరత సమస్య ఉన్నా స్వదేశీ ఆయుధాల వల్ల రానురాను కొనుగోళ్ల ఖర్చు తగ్గుతుంది. విదేశాలపై ఆధారపడాల్సిన అవసరమూ తగ్గుతుంది. లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అందుకే స్వదేశీకి నూటొక్క దండాలు!!





విదేశీ ఇంజిన్‌తో ‘స్వదేశీ’ ఎలా?

తేలిక రకం యుద్ధవిమానం (ఎల్‌సీఏ ఎంకే1ఏ)ను దిగుమతి నిషేధ జాబితాలో చేర్చారు. అయితే భారత్‌ సొంతంగా తయారుచేసుకున్న తేజస్‌ యుద్ధ విమానంలో ముఖ్య భాగాలైన ఇంజిన్‌, రాడార్‌ స్వదేశీవి కావు. ఇందులోని ఇంజిన్‌ జీఈ ఎఫ్‌404 అమెరికన్‌ది కాగా, ఎల్టా రాడార్‌ ఇజ్రాయెల్‌ది. ఇజ్రాయెల్‌ రాడార్‌ స్థానంలో స్వదేశీ ‘ఉత్తమ్‌’ రాడార్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ... స్వదేశీ ఇంజిన్‌ను తయారు చేసుకునే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. తేజస్‌ తదుపరి వెర్షన్లలో కూడా స్వదేశీ ఇంజిన్‌ను వాడే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవు. విమానంలో ప్రధాన భాగమైన ఇంజిన్‌ విదేశీది అయినప్పుడు విమానాన్ని నిషేధ జాబితాలో చేర్చి ప్రయోజనం ఏమిటనేది ప్రశ్న! ఒకవేళ స్వదేశీ ఇంజిన్‌ను త్వరలో అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విధించబోతోందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే 2020 డిసెంబరు నాటికే ఎల్‌సీఏ దిగుమతిని ఆపేస్తామని జాబితాలో తెలిపారు. ఆలోగా స్వదేశీ ఇంజిన్‌ అభివృద్ధి చేయడం అసాధ్యం!




రావత్‌ ప్రకటనకు భిన్నంగా...

భారత వాయుసేన కోసం 114 మధ్యశ్రేణి యుద్ధ విమానాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. అయితే విదేశీ విమానాలకు బదులుగా స్వదేశీ తేజస్‌ (తేలికపాటి) యుద్ధ విమానాలనే కొనుగోలు చేయబోతున్నట్లు మహాదళపతి బిపిన్‌ రావత్‌ ఇటీవల మీడియాకు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే దిగుమతి నిషేధ జాబితాలో మధ్యశ్రేణి యుద్ధ విమానం కూడా ఉండాలి. కానీ జాబితాలో అది లేదు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాల అభివృద్ధిలో (తేజస్‌ ఏంకే1ఏ, తేజస్‌ ఎంకే2, నావల్‌ తేజస్‌, ఏఎంసీఏ) తలమునకలై ఉండడం, వీటిలో మధ్యశ్రేణి యుద్ధ విమానమైన తేజస్‌ ఎంకే2 అభివృద్ధికి, ఉత్పత్తికి దీర్ఘకాలం పట్టే అవకాశం ఉండడంతో దిగుమతుల్ని ఇప్పటికిప్పుడు నిషేధించడం అసాధ్యమనేది సుస్పష్టం!! విదేశాల నుంచి 114 మధ్యశ్రేణి విమానాల్ని కొనుగోలు చేసే ప్రతిపాదన సజీవంగానే ఉందని వాయుసేన చీఫ్‌ బధౌరియా సైతం తేల్చిచెప్పారు. దీనినిబట్టి రావత్‌ ప్రకటన నిజం కాదని అర్థమవుతోంది.



ప్రైవేటుకు దన్ను 

దిగుమతుల నిషేధ జాబితాలోని కొన్ని ఆయుధాలను భారత్‌లోని ప్రైవేటు సంస్థలు ఇప్పటికే తయారుచేస్తున్నాయి. నిషేధం ద్వారా స్వదేశీ తయారీ ఆయుధాల కొనుగోలుకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లయింది. ఉదాహరణకు జాబితాలో 70వ స్థానంలో పేర్కొన్న వీల్డ్‌ ఆర్మర్డ్‌ ఫైటింగ్‌ వెహికిల్‌! టాటా సంస్థ డీఆర్‌డీవోతో కలిసి ‘వీల్డ్‌ ఆర్మర్డ్‌ ప్రొటెక్షన్‌ వెహికిల్‌’ పేరుతో ఇలాంటి వాహనాన్ని తయారు చేసింది. దీనిని లద్దాఖ్‌లో మోహరించాలని భారత ఆర్మీ భావిస్తోంది. అలాగే దక్షిణ కొరియాతో కలిసి ఎల్‌ అండ్‌ టీ తయారు చేస్తున్న 155 ఎంఎం హొవిట్జర్‌ (వజ్ర-టి), మహింద్రా సంస్థ తయారు చేస్తున్న 39 క్యాలిబర్‌ హొవిట్జర్‌ వంటి ఆయుధాలకూ ఈ జాబితాలో చోటు దక్కింది. వీటి దిగుమతుల్ని నిషేధించడం వల్ల ఆయా ప్రైవేటు సంస్థలకు ఊతం లభిస్తుంది.





ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే!

రోజూ బయటి నుంచి ఆహారం తెప్పించుకుంటే ఇంట్లోవాళ్లకు వంట ఎలా వస్తుంది? రక్షణ కొనుగోళ్ల విషయం కూడా అంతే! దిగుమతుల్ని నిషేధిస్తేనే ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని మనం సొంతంగా సాధించే అవకాశం ఉంటుంది. అందువల్ల 101 ఆయుధాల దిగుమతిని నిషేధించడం ప్రభుత్వం వైపు నుంచి ఓ గొప్ప ముందడుగే. అయితే ఆయుధాల్లో స్వావలంబన సాధించాలంటే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. హైదరాబాద్‌ ప్రజలకు మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆ సంస్థకు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది? ఎంత స్థలాన్ని కేటాయించింది? రక్షణ రంగంలోనూ ప్రభుత్వం నుంచి అలాంటి చేయూత ఉంటే స్వావలంబన సాధ్యపడుతుంది

- డాక్టర్‌ సుబ్బారావు పావులూరి, చైర్మన్‌, 

అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ 

(ప్రముఖ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ 

పరికరాల తయారీ సంస్థ)




ఏకే 203... అంతా ఓకే!

స్వదేశీ ఇన్సాస్‌ రైఫిళ్ల పనితీరు బాగుండకపోవడంతో రష్యాతో కలిసి ఏకే 203 రైఫిళ్లను ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా తయారు చేయాలని భారత్‌ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ సమీపంలోని ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి జరగాల్సి ఉంది. ధరపై రష్యాతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే దిగుమతి నిషేధ జాబితాలో 7.62 ఇంటూ 39 ఎంఎం అసాల్ట్‌ రైఫిళ్లను కూడా రక్షణ శాఖ చేర్చడం (ఏకే 203 రైఫిళ్ల క్యాలిబర్‌ ఇదే)తో ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురించాయి. తాజాగా మంగళవారం రక్షణ కొనుగోళ్ల మండలి ఏకే 203కి ఓకే చెప్పడంతో ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు కనిపిస్తోంది.

Updated Date - 2020-08-13T07:26:27+05:30 IST