స్వదేశీ బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2020-10-01T08:54:31+05:30 IST

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది...

స్వదేశీ బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

బాలాసోర్‌, సెప్టెంబరు 30: బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ ప్రయోగ పరీక్ష జరిగింది. ధ్వని కంటే 2.8 రెట్ల వేగంతో ప్రయాణించి, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బూస్టర్‌, ఎయిర్‌ ఫ్రేమ్‌ విభాగంతో పాటు పలు ఇతర స్వదేశీ పరికరాలను ఉపయోగించి ఈ క్షిపణిని రూపొందించారు. లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారులు తెలిపారు. భూమి, సముద్రం, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధనౌకల నుంచి కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం విజయవంతమైనందుకు డీఆర్‌డీవో సిబ్బంది, బ్రహ్మోస్‌ బృందం, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను ప్రధాని నరేంద్ర మోదీ,రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌ రెడ్డి అభినందించారు. ఈ క్షిపణి మరో మైలురాయిని సాధించిందని, నిర్వహణా సామర్థ్యాన్ని చాటిచెప్పిందని ప్రధాని ట్వీట్‌ చేశారు. డీఆర్‌డీవో, రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ ఎన్‌పీవోఎం కలిసి ఈ క్షిపణిని తయారు చేశాయి. కాగా బ్రహ్మోస్‌ శ్రేణికి చెందిన క్షిపణిని కొద్ది రోజుల క్రితం లద్దాఖ్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇవి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతాయి. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్‌ 2 హైపర్‌ సోనిక్‌ క్షిపణులతో పాటు 600 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల తయారీకి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

Updated Date - 2020-10-01T08:54:31+05:30 IST