స్వచ్ఛమైన సిటీ..

ABN , First Publish Date - 2022-10-02T06:06:19+05:30 IST

స్వచ్ఛమైన సిటీ..

స్వచ్ఛమైన సిటీ..

స్వచ్ఛ పురస్కారాల్లో నగరానికి ఐదో ర్యాంకు

క్లీన్‌ స్టేట్‌ కేపిటల్‌ కేటగిరీలో ఒకటో ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతంలో కంటే వెనుకబాటు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో విజయవాడ నగరానికి రెండు పురస్కారాలు లభించాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని తల్కటోర స్టేడియంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫలితాలు, సఫాయి మిత్ర, సురక్ష చాలెంజ్‌, స్టార్‌ రేటింగ్‌, చెత్తరహిత నగరాలు, ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. జాతీయ స్థాయిలో క్లీన్‌ స్టేట్‌ కేపిటల్‌ కేటగిరీలో మొదటి స్థానంలో విజయవాడ నగరం నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 కింద ‘పరిశుభ్రత నగరాల’ కేటగిరీలో దేశంలోని అన్ని నగరాల్లో విజయవాడ నగరం ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చేతులమీదుగా ఈ పురస్కారాలను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కేవీ సత్యవతి, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.రత్నావళి అందుకున్నారు. 

స్వచ్ఛ ర్యాంకులో తగ్గిన స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను ఆయా నగరాల్లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, రోడ్ల పరిశుభ్రత, పబ్లిక్‌ టాయిలెట్స్‌, మార్కెట్‌ ఏరియాస్‌, రెసిడెన్షియల్‌ ఏరియాస్‌, డ్రైన్ల నిర్వహణ, చెత్త రహిత నగరంగా ఉంచటం, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ అండ్‌ రీడ్రెస్సల్‌ (ఫిర్యాదుల సత్వర పరిష్కారం), సిటీ బ్యూటిఫికేషన్‌ (నగర సుందరీకరణ), నగరాల పారిశుధ్య స్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నగరాల పనితీరు ఆధారంగా మొత్తం 7,500 వరకు మార్కులు వేస్తారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన ఇండోర్‌ 7,500 మార్కులకు 7,146, విజయవాడకు 6,699 మార్కులు లభించాయి. విశాఖపట్నానికి 6,701 మార్కులు రావడంతో నాల్గో స్థానం దక్కింది. అయితే, గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఐదో స్థానానికి పరిమితమైంది. 


Updated Date - 2022-10-02T06:06:19+05:30 IST