కొవిడ్‌ ట్రయాజ్‌ సెంటర్‌గా ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-08-03T10:34:46+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని ట్రయాజ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నారు. కరోనా తీవ్రతను బట్టి బాధితులకు ఎక్కడ వైద్యసేవలు ..

కొవిడ్‌ ట్రయాజ్‌ సెంటర్‌గా  ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి

 ఇక కరోనా బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందనుంది

నేడు లాంఛనంగా ప్రారంభించే అవకాశం


తిరుపతి (వైద్యం), ఆగస్టు 2: తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని ట్రయాజ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నారు. కరోనా తీవ్రతను బట్టి బాధితులకు ఎక్కడ వైద్యసేవలు అందించాలనేది ఇక్కడ నిర్ణయించనున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన కేసులు (బాధితులు) ముందుగా ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ స్విమ్స్‌ ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందం బాధితులను పరీక్షించి.. ఫిల్టర్‌ చేయనుంది. ఎలాంటి లక్షణాలు లేకుండా, పాజిటివ్‌గా ఉన్న బాధితులను శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసం, పద్మావతి కొవిడ్‌ సెంటర్లకు రెఫర్‌ చేస్తారు. పాజిటివ్‌ ఉండి.. మైల్డ్‌గా, కాస్త లక్షణాలున్న వారిని రుయా కొవిడ్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేయనున్నారు. ఒకవేళ పాజిటివ్‌తో తీవ్రమైన లక్షణాలు ఉంటూ, అత్యవసర చికిత్స అవసరమని గుర్తిస్తే వారిని మాత్రమే స్విమ్స్‌లోని పద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రికి తరలిస్తారు.


దీనికోసం ఆయుర్వేద ఆస్పత్రిలో ఓ డాక్టర్‌, ఇద్దరు పీజీ డాక్టర్లు, ఇద్దరు నర్సులు, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ వర్కర్‌తో కూడిన 8 బృందం రోజుకు మూడు షిప్టుల పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ట్రయాజ్‌ కొవిడ్‌ ఆస్పత్రికి సంబంధించి కలెక్టర్‌ ఆదేశాలతో ఆయుర్వేద, స్విమ్స్‌ వైద్యాధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం లాంఛనంగా వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు వైద్యాధికారుల సమాచారం. ఈ సెంటర్‌ ప్రారంభమైతే బాధితులకు సమయం వృథా కాకుండా సకాలంలో వైద్యసేవలు అందనున్నట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-08-03T10:34:46+05:30 IST