మమత బెనర్జీ బెంగాల్ బిడ్డ కాదు, చొరబాటుదారుల అత్త : సువేందు అధికారి

ABN , First Publish Date - 2021-03-07T20:54:48+05:30 IST

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ ప్రచారం వాడివేడిగా

మమత బెనర్జీ బెంగాల్ బిడ్డ కాదు, చొరబాటుదారుల అత్త : సువేందు అధికారి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. 


కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటానికి ముందు బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ, మమత బెనర్జీ బెంగాల్‌కు చెందిన బిడ్డ కాదన్నారు. ఆమె చొరబాటుదారులు, రొహింగ్యాల అత్త అని దుయ్యబట్టారు. టీఎంసీ మళ్ళీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్ మరో కశ్మీరు అవుతుందన్నారు. కశ్మీరులో పండిట్లకు ఏం జరిగిందో, బెంగాలీలకు కూడా అదే జరుగుతుందన్నారు. టీఎంసీ, వామపక్షాలు-కాంగ్రెస్ కూటమి బుజ్జగింపు రాజకీయాలతో పశ్చిమ బెంగాల్‌ను విభజించాలనుకుంటున్నాయని మండిపడ్డారు. 


‘బెంగాల్ తన సొంత బిడ్డను కోరుకుంటోంది’ అనే టీఎంసీ నినాదాన్ని ప్రస్తావిస్తూ, మమత బెనర్జీని ఎవరూ తమ సొంత బిడ్డగా అంగీకరించరని చెప్పారు. ఆమె చొరబాటుదారులు, రొహింగ్యాల అత్త అని వ్యాఖ్యానించారు. టీఎంసీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. టీఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ మమత బెనర్జీ అని, అవినీతిపరుడైన మేనల్లుడు టీఎంసీకి మేనేజింగ్ డైరెక్టర్ అని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చెల్లించి ఓ వ్యూహకర్తను తీసుకొచ్చారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజన పథకాల నిధులను దారి మళ్ళించి, బొగ్గు, ఇసుక, ఆవుల దొంగ రవాణా ద్వారా ఈ సొమ్మును సంపాదించారన్నారు. 


నందిగ్రామ్‌ బరిలో సువేందు, మమత 

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ, సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2021-03-07T20:54:48+05:30 IST