Chennai: కలియుగ కర్ణుడు!

ABN , First Publish Date - 2021-10-23T13:45:33+05:30 IST

ఏ తల్లికి ఏం కష్టమొచ్చిందో? కన్న పేగే బరువైపోయింది... ఏ జంట తప్పుటడుగు వేసిందో? ఈ శిశువు అంతులేని భారమైపోయింది..! తల్లి పొత్తిళ్లలో సేదదీరాల్సిన పసిబిడ్డ సూట్‌కేస్‌లో ఊపిరాడని స్థితిలో నీటిపై తేలియాడింది..

Chennai: కలియుగ కర్ణుడు!

వేలూరు(Tamilnadu): ఏ తల్లికి ఏం కష్టమొచ్చిందో? కన్న పేగే బరువైపోయింది... ఏ జంట తప్పుటడుగు వేసిందో? ఈ శిశువు అంతులేని భారమైపోయింది..! తల్లి పొత్తిళ్లలో సేదదీరాల్సిన పసిబిడ్డ సూట్‌కేస్‌లో ఊపిరాడని స్థితిలో నీటిపై తేలియాడింది.. ఆఖరి క్షణంలో చుట్టుపక్కల వారికి చిక్కి కలియుగ కర్ణుడిని స్మరణకు తెచ్చింది.. ఇరుగుపొరుగు వారి జోక్యం, పోలీసుల విధి నిర్వహణతో శిశుసంక్షేమ కేంద్రానికి చేరింది. రాణీపేట జిల్లా అరక్కోణం సమీపంలో ఈ ఘటన జరిగింది.

 వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో తప్పూర్‌ గ్రామంలో ఓ నీటి కాలువపై సూట్‌కేస్‌ తేలియాడుతుండగా అందులో నుంచి ఏడుపు వినిపించింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు గ్రామ నిర్వహణాధికారి సుమన్‌ను పిలిచి దానిని తెరిచి చూశారు. అందులో రెండు రోజుల క్రితమే పుట్టిన మగబిడ్డ కొనవూపిరితో ఉంది. సూట్‌కేసులో ఓ నైటీ, టవల్‌ పెట్టి, వాటిపై బిడ్డను పడుకోబెట్టి వుంది. ఆ బిడ్డను బయటకు తీసిన గ్రామస్తులు హూటాహూటీన భానావరం ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి, పోలీసులకు అప్పగించారు. అనంతరం వారు శిశుసంక్షేమ కేంద్రానికి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ బిడ్డను వదిలేసిన వారి కోసం గాలిస్తున్నారు.



Updated Date - 2021-10-23T13:45:33+05:30 IST