భోపాల్: ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆ మహిళ రెండ్రోజుల క్రితమే అత్తారింటికి వచ్చింది. ఆ తర్వాత రోజు తెల్లారేసరికి శవంగా కనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..
షియోపూర్ జిల్లా సహస్రాం ప్రాంతానికి చెందిన నందకిషోర్‌కు రాధిక అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే రాధిక ప్రస్తుతం ఆరునెలల గర్భవతి. గర్భం దాల్చిన కొద్ది రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. కాగా రెండు రోజుల క్రితమే తిరిగి అత్తారింటికి వచ్చింది. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
ఇవి కూడా చదవండి
మృతురాలి సోదరుడు అజయ్ షక్య తెలిపిన వివరాల ప్రకారం.. నందకిషోర్ తన బావమరిది అజయ్‌కి ఫోన్ చేసి రాధిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పాడు. దీంతో కంగారుపడ్డ అజయ్.. ఆమెను ఆసుపత్రికి తీసుకురావాలని తన బావ నందకిషోర్కి సూచించాడు. వెంటనే అజయ్ కూడా ఆసుపత్రికి బయల్దేరి వెళ్లాడు. అదే సమయంలో తన భార్య రాధికను తీసుకుని అతడు ఆసుపత్రికి వచ్చాడు. కానీ అప్పటికే రాధిక చనిపోయిందని అజయ్ తెలిపాడు. తన అక్క ఎలా చనిపోయిందని అజయ్.. నందకిషోర్‌ని నిలదీయగా ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ విషయం తనకు ఫోన్ చేసినపుడే ఎందుకు చెప్పలేదని.. అసలు ఆమెకు తాడు కట్టడమే రాదని.. అలాంటిది ఆత్మహత్య ఎలా చేసుకుంటుందని బావని ప్రశ్నించాడు. దీనిపై అతడు సరిగ్గా స్పందించలేదు. రాధిక పుట్టింటి వారు ఆమెది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శివ్‌పురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.