బ్రహ్మంగారి మఠాధిపతి మరణంపై అనుమానాలు

ABN , First Publish Date - 2021-06-14T09:28:32+05:30 IST

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, శ్రీశైవక్షేత్రం

బ్రహ్మంగారి మఠాధిపతి మరణంపై అనుమానాలు

మఠాధిపతి నియామకానికి వీలునామాలు చెల్లవు

మఠంలో జరిగే అవినీతిపై విచారణ చేపట్టాలి

వెంకటాద్రిస్వామిని పీఠాధిపతిగా ప్రజలు కోరుతున్నారు

విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామి 


బ్రహ్మంగారిమఠం(కడప), జూన్‌ 13: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మఠంలో జరిగే అవినీతి అక్రమాలపై పోలీసు విచారణ చేపట్టాలన్నారు. బ్రహ్మంగారి మఠం వ్యవహారాలపై పీఠాధిపతుల బృందం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ధర్మశాస్త్రం ప్రకారం మఠాధిపతి ఎంపిక విషయంలో తొలి భార్య సంతానానికి వారసత్వం వర్తిస్తుందని, తొలిభార్యకు సంతానం లేని పక్షంలో రెండవ భార్య సంతానానికి  అవకాశం ఉంటుందని శివస్వామి తెలిపారు. మఠాధిపతి నిర్ణయానికి వీలునామాలు చెల్లవని ధర్మశాస్త్రం ప్రకారం మఠాధిపత్యం వంశపారంపర్యంగా వస్తుందని ఆయన తెలిపారు. ఇటీవల అన్ని సంఘాల కుల పెద్దలతో, సంఘం నేతలతో, గ్రామ ప్రజలతో సమావేశమై.. వారి అభిప్రాయాలను సేకరించామని, పలు కులసంఘాల పెద్దలు తొలి భార్య కుమారులు అయిన వెంకటాద్రిస్వామినే పీఠాధిపతిని చేయాలని రాతపూర్వకంగా అందజేశారని ఆయన తెలిపారు.


దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లె శ్రీనివాస్‌ అనుమతితో మఠానికి వచ్చామని, మఠాధిపతుల బృందంపైనే రెండో భార్య అయిన మారుతీ మహాలక్షుమమ్మ డీజీపీకి లేఖ రాయడం బాధాకరమన్నారు. త్వరలోనే వంద మంది పీఠాధిపతులతో బ్రహ్మంగారిమఠంలో పీఠాధిపతి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల మనోభావాలను సేకరించి తమ నివేదికను దేవాదాయ శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. 


నిబంధనల ప్రకారమే నియామకం: వెలంపల్లి


అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘‘కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తాం. ఈ వ్యవహారంపై ఒక కమిటీని నియమించి వివాదాన్ని పరిష్కరిస్తాం. వివాదం నేపథ్యంలో మఠం నిర్వహణ బాధ్యతలను కడప జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు అప్పగించాం’’ అని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి తెలిపారు. మఠాధిపతి నియామకంపై ఆదివారం అధికారులతో సమీక్షించిన ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. వీరబ్రహ్మంగారు జీవసమాధి అయినప్పటినుంచీ వారి వంశం నుంచే మఠాధిపతులుగా చేస్తూ వచ్చారన్నారు. ఇప్పటివరకూ 11 మంది చేశారని, ప్రస్తుత మఠాధిపతి మరణించినందున తదుపరి మఠాధిపతిపై వివాదం నెలకొందన్నారు. మరణించిన మఠాధిపతి వీలునామా రాసినట్లుగా చెబుతున్నారన్నారు. నిబంధనల ప్రకారం వీలునామా రాసిన 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు దాన్ని పంపాలన్నారు. కానీ ఇంతవరకూ వీలునామా అందలేదన్నారు. వివాదం పరిష్కారం కోసం ఆర్‌జేసీ స్థాయి అధికారిని నియమించామని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-06-14T09:28:32+05:30 IST