రాష్ట్ర పన్నుల శాఖలో కలకలం

ABN , First Publish Date - 2022-05-23T06:09:43+05:30 IST

రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్‌లో కలకలం రేగింది.

రాష్ట్ర పన్నుల శాఖలో  కలకలం

వారం కిందట పది మంది జీఎస్టీవోలు సస్పెన్షన్‌

ఉద్యోగుల సంఘం చొరవతో పెండింగ్‌లో ఉత్తర్వులు 


విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్‌లో కలకలం రేగింది. ఏకంగా పదిమంది జీఎస్‌టీవోలను జాయింట్‌ కమిషనర్‌ నిక్కు శ్రీనివాసరావు సస్పెండ్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత బకాయి వసూళ్లలో నిర్లక్ష్యం వహించారన్న నెపంతో ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.  అయితే పన్నులశాఖ ఉద్యోగుల సంఽఘం వెంటనే జాయింట్‌ కమిషనర్‌తో భేటీ కావడంతో ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులను పెండింగ్‌లో పెట్టారు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల మేరకు...

 రాష్ట్ర పన్నుల శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న డివిజన్లలో విశాఖ ప్రథమస్థానంలో ఉంది. అయితే పన్ను వసూళ్లలో కొన్ని సర్కిళ్లు వెనుకబడి ఉండడంతో ఉన్నతాఽధికారుల నుంచి డివిజన్‌ అఽధికారులకు చీవాట్లు పడుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో పాత బకాయిలు వసూలు చేయకపోవడాన్ని కమిషనరేట్‌ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పలు షాపులు, దుకాణాలు, సంస్థల అసెస్‌మెంట్లను స్టాఫ్‌ బిజినెస్‌గా చూపించినట్టుగా గుర్తించారు. వ్యాపారాలు చేస్తున్న సంస్థలు/వ్యాపారుల నుంచి బకాయిలు వసూళ్లు చేయకుండా స్టాఫ్‌ బిజినెస్‌గా ఎలా పరిగణిస్తారని  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో విశాఖ డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ అప్రమత్తమై ఎక్కడెక్కడ స్టాఫ్‌ బిజినెస్‌ పేరిట బకాయిలు వసూలు చేయలేదో విచారణ చేపట్టి శ్రీనివాసరావు, జ్ఞానప్రసూనాంబ (డాబాగార్డెన్స్‌ సర్కిల్‌), ఎంవీ. కామేశ్వరరావు, ఫల్గుణరావు (గాజువాక), శ్వేత (కురుపాం మార్కెట్‌), కేవీ హరనాథ్‌ (ద్వారకానగర్‌)త ోపాటు ఇతర సర్కిళ్లకు చెందిన నలుగురు జీఎస్టీవోలను సస్పెండ్‌ చేశారు. దీంతో పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అప్రమత్తమై జాయింట్‌కమిషనర్‌ను కలిసి సస్పెన్షన్లను ఉపసంహరించాలని కోరారు. అయితే పాతబకాయిలు వసూలు చేయాలని, అంత వరకు పెండింగ్‌లో పెడతానని హామీ ఇచ్చారు.  దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  బకాయిల వసూళ్లకు సంబంధించి సర్కిళ్లకు నేతృత్వం వహించే అసిస్టెంట్‌ కమిషనర్‌, డివిజన్‌లో ఉన్నతాధికారులకు బాధ్యత ఉంటుందని... అటువంటిది కేవలం జీఎస్టీవోలను బాఽధ్యులుగా చేయడం ఎంతవరకు సబబని కొందరు ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. డివిజన్‌లో పాలనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నారు. 


పీటీడీకి రోజుకు రూ.3.29 లక్షలు ఆదా

ద్వారకాబస్‌స్టేషన్‌, మే 22: డీజిల్‌ రేటు తగ్గడంతో ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌కు రోజుకు రూ.3.29 లక్షలు ఆదా కానుంది. జిల్లాలో మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌సిటీ, సింహాచలం డిపోల పరిధిలో 800 బస్సులున్నాయి. ఇవి రోజుకు 2.35 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతూ సేవలందిస్తున్నాయి. ఇందుకు రోజుకు 47వేల లీటర్ల డీజిల్‌ అవసరం. లీటరు ధర రూ.106 లెక్కన రోజుకు రూ.49,82,000 ఖర్చయ్యేది. ధర రూ.99కు తగ్గడంతో రూ.46,53,000 ఖర్చవుతోంది. ఈ లెక్కన డీజిల్‌పై రోజుకు రూ.3.29 లక్షల ఆదా అయినట్టేనని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-23T06:09:43+05:30 IST