సస్పెన్షనా.. బదిలీనా?

ABN , First Publish Date - 2021-02-26T06:49:02+05:30 IST

దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్‌బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

సస్పెన్షనా.. బదిలీనా?

దుర్గగుడి ఈవోపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై చర్చ 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్‌బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటే అది బదిలీ రూపంలో ఉంటుందా? లేక సస్పెన్షన్‌ వేటు పడుతుందా? అనేది చర్చనీయాంశంగా ఉంది. దుర్గగుడిలో అడుగడుగునా చోటు చేసుకున్న అవినీతిని వెలికితీసిన ఏసీబీ నివేదికల ఆధారంగా ఇప్పటికే 15 మందిపై వేటు వేసిన దేవదాయశాఖ కమిషనర్‌.. దుర్గగుడి ఈవోపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో ఈవోపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.


దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్‌బాబుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేవస్థానంలో ఏసీబీ బృందాలు నాలుగు రోజులపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించి, పెద్దఎత్తున అవినీతి అక్రమాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవదాయశాఖ కమిషనర్‌ దుర్గగుడిలో ఆయా విభాగాలను పర్యవేక్షిస్తున్న ఏడుగురు సూపరిండెండెంట్లు, మరో ఎనిమిది మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆలయంలో రూ. వెయ్యి రూపాయల విలువైన పని జరగాలన్నా నిబంధనల ప్రకారం కింది నుంచి పై దాకా పక్కాగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారి అయిన ఈవోకు తెలియకుండా గుడిలో ఇంత పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరగడానికి ఆస్కారం లేదని, దేవస్థానంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ గుర్తించిన అవకతవకలన్నింటికీ ఈవో బాధ్యత ఉంటుందని ఏసీబీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దేవదాయశాఖ కమిషనర్‌ కూడా దుర్గగుడి ఈవోపై వచ్చిన అభియోగాలన్నింటినీ నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.


ఈ నేపథ్యంలో ఈవోపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సిద్ధం చేస్తోందంటూ గురువారం ఉదయం నుంచే సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తాయి. కానీ రాత్రి వరకు ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయలేదు. ఏసీబీ గుర్తించిన అవినీతి, అక్రమాలకు బాధ్యులుగా గుర్తించిన సూపరింటెండెంట్లు, కిందిస్థాయి ఉద్యోగులు కలిపి మొత్తం 15 మందిని ఇప్పటికే సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ఈవోపై కూడా సస్పెన్షన్‌ వేటు వేస్తారా? బదిలీతో సరిపెడతారా? అనే చర్చ సాగుతోంది. 


మంత్రి సంగతి ఏంటి?  : కేశినేని

దుర్గగుడిలో వెలుగుచూసిన అవినీతి, అక్రమాల్లో ఈవో పాత్రధారి అయితే.. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూత్రధారి అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు దోషి మంత్రి వెలంపల్లిని, పాత్రధారి ఈవోను వదిలేసి.. కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేయడం సరికాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెలంపల్లిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


మంత్రికి బినామీ ఈవో : పోతిన మహేశ్‌

మరోవైపు జనసేన నాయకుడు పోతిన మహేశ్‌ కూడా స్పందిస్తూ.. మంత్రి వెలంపల్లికి దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు బినామీ అంటూ ఆరోపించారు. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఈవోను బదిలీతో సరిపెట్టకుండా సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ప్రభుత్వానికి తలనొప్పి!

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. రానురాను మంత్రి వెలంపల్లిపై అవినీతి ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనకు చెక్‌ పెట్టేందుకే దుర్గగుడిలో ఏసీబీ దాడులు జరిగాయని, ఈ దాడుల వెనుక ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వైసీపీ పెద్దల ప్రమేయం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వెలంపల్లి మంత్రి పదవిని చేపట్టిన వెంటనే తన సామాజికవర్గానికే చెందిన, తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సురేశ్‌బాబును దుర్గగుడి ఈవోగా తెచ్చుకున్నారు. ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే దుర్గగుడిలో పాలన పూర్తిగా గాడి తప్పింది. ఇంద్రకీలాద్రిపై మంత్రి వెలంపల్లి అనుచరుల పెత్తనం పెరిగిపోయింది. పవిత్రమైన అమ్మవారి ఆలయం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మారింది. అదే క్రమంలో అవినీతి, అక్రమాలూ పెరిగిపోయాయి. దుర్గగుడిలో పెరిగిపోయిన రాజకీయ జోక్యం, నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అవినీతి, అవకతవకలపై దాదాపు ప్రతిరోజూ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వ పెద్దలు దుర్గగుడిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 


ఈ క్రమంలోనే ఏసీబీ సోదాలు జరిగాయని చెబుతున్నారు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసిన ప్రభుత్వం.. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు, మంత్రి వెలంపల్లిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-02-26T06:49:02+05:30 IST