29 ఏళ్లుగా ‘అకారుణ్య’ కొలువు! తప్పుడు అఫిడవిట్‌తో 1993లో విద్యాశాఖలో చేరిక

ABN , First Publish Date - 2022-08-09T20:08:24+05:30 IST

తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి, కారుణ్య కోటాలో సర్కారు కొలువు పొందారామె! ఈ విషయం ఎప్పుడు బయటపడిందంటే.. ఆమె పదోన్నతులమీద పదోన్నతులు పొందుతూ ఏకంగా 29 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగిన తర్వాత! విద్యాశాఖలో వెలుగుచూసిందీ ఘటన

29 ఏళ్లుగా ‘అకారుణ్య’ కొలువు! తప్పుడు అఫిడవిట్‌తో 1993లో విద్యాశాఖలో చేరిక

జూ.అసిస్టెంట్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయికి

ఇంటర్‌ విద్యాశాఖలో మహిళా ఉద్యోగి సస్పెన్షన్‌ 


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి, కారుణ్య కోటాలో సర్కారు కొలువు పొందారామె! ఈ విషయం ఎప్పుడు బయటపడిందంటే.. ఆమె పదోన్నతులమీద పదోన్నతులు పొందుతూ ఏకంగా 29 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగిన తర్వాత! విద్యాశాఖలో వెలుగుచూసిందీ ఘటన. ఆ ఉద్యోగిని పేరు కె.ఎం. ప్రసన్నలత. 1993లో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కారుణ్య కోటాలో నియమితులయ్యారు. ఆమె తండ్రి ఎస్‌.పీటర్‌ సర్వీసులో ఉండగా 1992లో మృతి చెందారు. కారుణ్య నియామకం పొందాలంటే ఉద్యోగి మృతిచెందేనాటికి కుటుంబానికి సంపాదనాపరంగా ఎలాంటి ఆధారం ఉండకూడదని, ముఖ్యంగా ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండకూడదని నిబంధనలున్నాయి. అయితే తండ్రి పీటర్‌ మృతిచెందినప్పటికే ప్రసన్నలత తల్లి సౌభాగ్యమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్‌ మోడ్రన్‌ ప్రైమరీ స్కూల్‌ (ఎడెడ్‌)లో ఎస్జీటీగా సౌభాగ్యమ్మ పనిచేసేవారు.


2010లో ఆమె ఉద్యోగ విరమణ చేశారు. అయితే తన తల్లి ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని చెప్పకుండా, కుటుంబంలో ఎవరూ సంపాదనపరులు లేరంటూ అధికారులకు ప్రసన్నలత అఫిడవిట్‌ ఇచ్చారు. సౌభగ్యమ్మ.. తనకు కారుణ్య నియామకం వద్దంటూ నిరభ్యంతర పత్రం సమర్పించారు. తొలుత జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాతో కొలువు చేరిన ప్రసన్నలత.. తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ పొంది, ప్రస్తుతం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్నారు. ఆమె నియామకంపై అధికారులకు కొన్ని ఫిర్యాదులందాయి. అధికారులు విచారణను చేపట్టగా తప్పుడు అఫిడవిట్‌ సమర్పించి, నియామకం పొందినట్లు తేలింది. ఇక కారుణ్య నియామకం కోసం ప్రసన్నలత ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రానికి బదులుగా సంబంధం లేని షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పత్రాన్ని సమర్పించినట్లు విచారణలో గుర్తించారు. ప్రసన్నలత తల్లి సౌభాగ్యమ్మ ఇప్పటికీ పింఛను తీసుకుంటున్నట్టు విచారణలో స్పష్టమైంది. విచారణ నివేదిక మేరకు సోమవారం  ప్రసన్నలతను సస్పెండ్‌ చేస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యల్ని తీసుకోనున్నట్టు వెల్లడించారు. కాగా సౌభాగ్యమ్మ విచారణకు హాజరు కాలేదని, తన తల్లి చనిపోయిందని విచారణ సందర్భంగా ప్రసన్నలత చెప్పారని ఉత్తర్వుల్లో కమిషనర్‌ పేర్కొనడం గమనార్హం.  

Updated Date - 2022-08-09T20:08:24+05:30 IST