గొర్రెల పథకంలో డీడీలకు స్వస్తి

ABN , First Publish Date - 2022-08-08T05:01:05+05:30 IST

గొల్లకురుమలకు త్వరలోనే రెండో విడతలో రాయితీపై గొర్రెలను పంపిణీ చేయనున్నారు. దీని కోసం పశుసంవర్థక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చే

గొర్రెల పథకంలో డీడీలకు స్వస్తి

బ్ధిదారుల ఖాతా నుంచే ఫండ్‌ మేనేజ్‌మెంట్‌కు వాటాధనం బదిలీ

రెండో విడత యూనిట్ల పంపిణీకి ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో మరో 16,160 కుటుంబాలకు లబ్ధి

ఈ ఏడాది యూనిట్‌ విలువలో రూ.50వేల పెంపు

ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 7 : గొల్లకురుమలకు త్వరలోనే రెండో విడతలో రాయితీపై గొర్రెలను పంపిణీ చేయనున్నారు. దీని కోసం పశుసంవర్థక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో లబ్ధిదారులు డీడీలు తీసి పశుసంవర్థక అధికారులకు ఇవ్వగా, వారు నేరుగా గొర్రెలను పంపిణీ చేశారు. కానీ ఈ సారి ఆ డీడీల విధానానికి స్వస్తి పలికారు. లబ్ధిదారులు నేరుగా ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాంకు ఖాతాకు తమ ఖాతా నుంచి వాటాధనాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత పశుసంవర్థక శాఖ గొర్రెలను రాయితీపై అందించడంతోపాటు రవాణా, బీమా సౌకర్యాలను కల్పిస్తుంది. గడ్డి గింజలను కూడా 75శాతం రాయితీతో ఇస్తుంది. లబ్ధిదారులను అధికారులు ఇప్పటికే లాటరీ ద్వారా ఎంపిక చేయగా.. ఖమ్మం జిల్లాలో మొత్తం 32,513 మంది అర్హత సాధించారు. ఈ సారి తొలి విడతలో 15,710మందికి, రెండో విడతలో మరో 16,160 మందికి గొర్రెలు అందనున్నాయి. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక గొర్రె పోతు ఉంటాయి.

లబ్ధిదారుడు చెల్లించాల్సింది రూ. 43,750

ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన జీవాల ధరల దృష్ట్యా ప్రభుత్వం గొర్రెల యూనిట్‌ ధర విలువను పెంచింది. తొలి విడతలో ఒక్కో యూనిట్‌ విలువను రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో రూ.93.750ను సబ్సిడీగా అందించింది. రెండో విడతలో మరో రూ.50వేల రాయితీని పెంచి యూనిట్‌ విలువను రూ.1.75 లక్షలుగా ప్రకటించింది. ఇందులో లబ్ధిదారులు తమ వాటాధనం 25 శాతం కింద రూ.43,750ను కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉండే ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాతాకు జమ చేయాలి. అయితే 18 ఏళ్లు నిండిన యాదవ, కురుమలకు సొసైటీ సభ్యత్వం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో  సొసైటీల సంఖ్య 90 నుంచి 330కి పెరగ్గా.. వీటిలో పాత, కొత్త సభ్యులు కలిపి సుమారు 31,773 మంది ఉన్నారు.

మండలాల వారీగా యూనిట్లు

2017 జూనలో  గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. రెండో విడతలో 16,160 మందికి యూనిట్లు పంపిణీ చేయనున్నారు. రఘునాథపాలేనికి 512 యూనిట్లు, ముదిగొండకు 818, చింతకానికి 1,027, బోనకల్లుకు 905, మధిరకు 795, ఎర్రుపాలేనికి 579, తిరుమలాయపాలేనికి 914, ఖమ్మం రూరల్‌కు 1,111, కూసుమంచికి 1,275, నేలకొండపల్లికి 1,047, తల్లాడకు 392, కల్లూరుకు 676, సత్తుపల్లికి 468, వేంసూరుకు 794, పెనుబల్లికి 1,296, సింగరేణికి 675, కొణిజర్లకు 924, వైరాకు 727, ఏన్కూరుకు 366, కామేపల్లికి 558 చొప్పున యూనిట్లు కేటాయించారు. వీటితోపాటు తొలివిడతకు సంబంధించి ఇప్పటికే డీడీలు తీసిన మరో 450 మందికి కూడా యూనిట్లు పంపిణీ చేయనున్నారు.

పూర్తి స్థాయి పారదర్శకత కోసమే పథకంలో మార్పులు

డాక్టర్‌ వేణుమనోహర్‌, పశుసంవర్థకశాఖ జేడీ, ఖమ్మం 

గొర్రెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి డీడీల విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. లబ్ధిదారులు నేరుగా తమ బ్యాంకు ఖాతాల నుంచి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఖాతాకు తమ వాటాను ట్రాన్సఫర్‌ చేయాలి. ఈమేరకు గ్రామాల్లో గొల్లకురుమలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే సెప్టెంబరు నుంచి యూనిట్లు పంపిణీ చేస్తాం.

Updated Date - 2022-08-08T05:01:05+05:30 IST