పుష్కరాల నిర్వహణపై..సస్పెన్స్‌

ABN , First Publish Date - 2020-10-29T06:26:17+05:30 IST

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడటం లేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా

పుష్కరాల నిర్వహణపై..సస్పెన్స్‌

నవంబరు 22 నుంచి తుంగభద్ర పుష్కరాలు

నేటికీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు

పరిశీలనకు నోచుకోని దేవాదాయ శాఖ ప్రతిపాదనలు


గద్వాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడటం లేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికితోడు రాష్ట్ర దేవాదాయ శాఖ యంత్రాంగం పంపించిన ప్రతిపాదనలను సైతం నేటి వరకు పరిశీలించ లేదు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జరిగిన ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వస్తున్నారని అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ, మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి చెందడంతో, ఆయన పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అయితే, త్వరలో ఆయన తుంగభద్ర పుష్కరాలపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


తుంగభద్ర నది తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లో ప్రవహిస్తుండగా, తెలంగాణలో మాత్రం జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 70 కిలోమీటర్ల మేర మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. నవంబరు 22వ తేదీ నుంచి ఈ నదికి పుష్కరాలు ప్రారంభమై, డిసెంబరు ఒకటిన ముగియనున్నాయి. అయితే, పుష్కరాలకు ఆరు నెలల ముందు నుంచి పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు సౌకర్యాల కల్పన, దేవాలయాల ముస్తాబు, రవాణా, వసతి, రోడ్లు, పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉన్నది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల నిర్వహణకు రూ.711 కోట్లను విడుదల చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఉలుకూ, పలుకు లేకుండా వ్యవహిస్తోంది. దేవాదాయ శాఖ పంపించిన రూ.2 కోట్ల ప్రతిపాదనలపై కూడా స్పందించడం లేదు. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా వచ్చిన గోదావరి, కృష్ణా, భీమా పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం, తుంగభద్ర పుష్కరాలపై శ్రద్ధ చూపకపోవడంపై అందరిలో నిరాశ నెలకొన్నది.

Updated Date - 2020-10-29T06:26:17+05:30 IST