పల్లె ఇంట.. వీడని ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-01-10T05:12:17+05:30 IST

పల్లె ఇంట.. వీడని ఉత్కంఠ

పల్లె ఇంట.. వీడని ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో తెగని సందిగ్ధం

ఎన్నికల నిర్వహణపై చర్చోపచర్చలు

ప్రభుత్వంపై వ్యతిరేకతే ఎన్నికల అడ్డగింపునకు కారణమా?

సమయం సరిపోదంటున్న ఉద్యోగ సంఘాలు

జిల్లాలో 958 పంచాయతీలు, 9,652 వార్డుల్లో ఎన్నికలు

ఓటర్ల జాబితా సవరణతో పెరగనున్న ఓటర్లు, మారనున్న రిజర్వేషన్లు


మచిలీపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కమిషనర్‌ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించారు. నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్‌, వ్యాక్సినేషన్‌ పరిస్థితులను సాకుగా చూపి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటోంది. మరోవైపు రాష్ట్ర, జిల్లా, డివిజన్‌స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెబుతున్నారు. 2019, జనవరిలో తయారుచేసిన ఓటర్ల జాబితా ఆధారంగా 2020లో పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాలను, రిజర్వేషన్లను ప్రకటించారు. ప్రస్తుతం 2021కి సంబంధించి ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఈ ఓటర్ల జాబితా తయారైతే ఓటర్లు పెరగడంతో పాటు కొన్ని పంచాయతీల్లో రిజర్వేషన్లు మార్చాల్సి ఉందని అధికారులు అంటున్నారు.  ఏ సంవత్సరంలో తయారైన ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీ ఎన్నికలకు వెళ్తారనేది తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 


రాజకీయ అనిశ్చితి

వైసీపీ అధికారం చేపట్టి 20 నెలలైంది.  కొద్ది నెలల వ్యవధిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు చాపకింద నీరులా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.  క్షేత్రస్థాయిలో  వైసీపీ  నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాలను ప్రజలు కనిపెడుతూనే ఉన్నారు. సమయం వచ్చినపుడు వాత పెడదామనే ఆలోచనలో ఉన్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి తగు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందనేది ఓ వాదన.  ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు మరో 25 నుంచి 30 రంగాలకు పనులు, వ్యాపారాలు లేకుండా చేశారు. గతుకులమయంగా మారిన రోడ్లు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. కరోనా కాలంలో పనులు లేక అల్లాడుతున్న సామాన్య ప్రజలపై నిత్యావసరాల ధరల పెంపుతో మోయలేని భారం వేశారు. ధాన్యం కొనుగోళ్లలో వైఖరి రైతులను కష్టాలపాలు చేసింది. ఇవేకాక ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ, మెరక పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన అవినీతి దందా, ఆలయాలపై దాడులు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఈ సమస్యలు ప్రభుత్వ రాజకీయ పెద్దల్లో ఎన్నికల నిర్వహణపై ఆందోళనను పెంచుతున్నాయి.


అసలు లెక్క

జిల్లా పంచాయతీ అధికారులు 2020, నవంబరు 17వ తేదీన పంచాయతీల ఓటర్ల లెక్కలు ప్రకటించారు. జిల్లాలో 981 పంచాయతీలు, 9,956 వార్డులు ఉన్నాయి. వాటిలో 958 పంచాయతీలు, 9,652 వార్డుల్లో  ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని పంచాయతీల్లో  మొత్తం ఓటర్లు 22,67,640 ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీరిలో ఎస్టీ పురుషులు 35,342 మంది, మహిళలు 37,018 మంది. ఎస్సీ పురుషులు 2,75,167 మంది, మహిళలు 2,84,866 మంది. బీసీ పురుషులు 4,67,956 మంది, మహిళలు 4,77,981 మంది. ఓసీలో 3,41,971 మంది పురుషులు, 3,47,217 మంది మహిళలు ఉన్నట్టుగా లెక్క చూపారు. గతంలోనే మచిలీపట్నం డివిజన్‌లోని 225, విజయవాడ డివిజన్‌లోని 234 పంచాయతీల్లో మొదటి విడతలో, గుడివాడ డివిజన్‌లోని 211 పంచాయతీల్లో, నూజివీడు డివిజన్‌లోని 288 పంచాయతీల్లో రెండో విడతలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. సర్పంచ్‌లను ఎన్నుకునేందుకు పింక్‌ రంగు బ్యాలెట్‌ పేపర్లు, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్లు 29,27,000 సిద్ధంగా ఉంచారు. నోటాతో కలిపి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నుంచి 21మంది అభ్యర్థులకు ఓటు వేసేలా బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేశారు. 


ఎన్నికలు నిలిచిన పంచాయతీలు ఇవే..

వివిధ కారణాలతో విజయవాడ రూరల్‌లోని జక్కంపూడి, గొల్లపూడి, రామరాజ్యనగర్‌, పెనుమలూరు మండలంలోని  కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహ్మద్‌పేట, చిల్లకల్లు, తిరుమలగిరి పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు. మచిలీపట్నం మండలంలోని అరిసేపల్లి, పోతేపల్లి, మేకావానిపాలెం, కరగ్రహారం, చినకరగ్రహారం, గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్‌ఎన్‌ గొల్లపాలెం,  సుల్తానగరం,  గుడ్లవల్లేరు మండలంలోని గుడ్లవల్లేరు,  కూరాడ, కౌతవరం పంచాయతీ ఎన్నికలు నిలిపివేశారు. ఈ పంచాయతీల పరిధిలోని 304 వార్డుల్లో కూడా ఎన్నికలు నిలిపోయాయి. 

Updated Date - 2021-01-10T05:12:17+05:30 IST