Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 14 Jan 2022 03:09:09 IST

హెచ్‌ఆర్‌ఏపై సస్పెన్స్‌

twitter-iconwatsapp-iconfb-icon
హెచ్‌ఆర్‌ఏపై సస్పెన్స్‌

  • పీటముడి విప్పని ప్రభుత్వం
  • ఉద్యోగుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ 
  • సర్దుకోవాలని సీఎంవో కార్యదర్శి సలహా? 
  • ఒక్క శాతం కూడా తగ్గే ప్రసక్తే లేదు 
  • ఇప్పటికే ఉద్యోగులు తన్నేట్టున్నారు 
  • పరిస్థితి మా చెయ్యి దాటిపోయింది 
  • సీఎస్‌ కమిటీ నివేదిక ప్రకారం 
  • జీవోలు ఇస్తే ఉద్యమం
  • సంక్రాంతి పండుగ తర్వాత కార్యాచరణ 
  • ఉద్యోగ జేఏసీ నేతలు బండి, బొప్పరాజు 


అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో రివర్స్‌ పీఆర్సీ ప్రకటించి చేతులు దులుపుకొన్న జగన్‌ ప్రభుత్వం... ఇతర అంశాలపై పీటముడిని విప్పడంలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు అమలవుతున్న హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌(ఏక్యూపీ)ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎంవో అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టడం మినహా ప్రభుత్వం నుంచి వీటిపై గురువారం కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో సీఎస్‌ కమిటీ సూచించిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులతోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగితే తమ వేతనాల్లో భారీగా కోతపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పీఆర్సీకి సంబంధించి మిగిలిన అంశాలపై సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డితో ఉద్యోగ నేతలు గురువారం సమావేశమై దాదాపు రెండు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ కమిటీ సూచించిన హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదన పు క్వాంటమ్‌ పెన్షన్‌ అంశాలపై సర్దుకుపోవాలంటూ ధనుంజయరెడ్డి ఇచ్చిన ఉచిత సలహాను ఉద్యోగ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్దుకుపోవడం కుదరదని, ప్రస్తుతం ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ కంటే ఒక్క శాతం కూడా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తక్కువగా ఇవ్వడంతో ఉద్యోగులు ఇప్పటికే తమపైనా, ప్రభుత్వంపైనా మండిపడుతున్నారని ఉద్యోగ నేతలు చెప్పినట్లు సమాచారం. హెచ్‌ఆర్‌ఏపై కూడా కొర్రీలు వేస్తే మీరే ఇబ్బందిపడతారని, ఉద్యోగులు ఒప్పుకునే పరిస్థితిలో లేరని, మీరే అడ్జెస్ట్‌ చేసుకోవాలని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఉద్యమంలోకి వెళ్లారని, ఇక తాము ఉద్యోగులను ఆపలేమని తేల్చిచెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయిందని, ఉద్యోగులు తమను తన్నేట్టున్నారని, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, ఏక్యూపీ ప్రస్తుతం ఉన్న ప్రకారమే కొనసాగించాలని నేతలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. సీఎస్‌ కమిటీ నివేదిక అమలు చేస్తే ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం.


ఒకదశలో అసలు ఉద్యోగులకు అన్ని విధాలుగా నష్టం కలిగించే ఈ పీఆర్సీనే వద్దని, 27శాతం ఐఆర్‌తో డీఏలు మొత్తం కలిపి అమలు చేయాలని నేతలు కోరినట్లు తెలిసింది. ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులు ఇప్పటికే నష్టపోయారని, ప్రస్తుతం ఉన్న శ్లాబులనే కొనసాగించాలని నేతలు కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో... సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి, ఇతర ప్రముఖులతో సీఎం బిజీగా ఉన్నారని, హెచ్‌ఆర్‌ఏ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ధనుంజయరెడ్డి వారిని బుజ్జగించినట్లు తెలిసింది. అప్పటివరకు హెచ్‌ఆర్‌ఏకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడకుండా నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని చూస్తే రాజీపడే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ఆమోదించకపోతే పండుగ తర్వాత  ఉద్యమబాట పడతామని నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చర్చల అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. 


సీఎంతో మాట్లాడిన తర్వాతే జీవోలు: బండి 

చిరంజీవితో చర్చల్లో సీఎం జగన్‌ బిజీగా ఉన్నారని అధికారులు చెప్పారని, సంక్రాంతి తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, ఏక్యూపీ అంశాలపై సీఎం జగన్‌తో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చిన తర్వాతే జీవోలు ఇస్తామని హామీ ఇచ్చారని వివరించారు. అప్పటి వరకు హెచ్‌ఆర్‌ఏ జీవోను అబయెన్స్‌లో పెడతామని చెప్పారన్నారు. పీఆర్సీపై సీఎం ప్రకటన చేసిన రోజు నుంచి సీఎస్‌ కమిటీ సిఫారసుల ఆధారంగానే అన్ని జీవోలు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. హెచ్‌ఆర్‌ఏ తదితర అంశాలను సీఎం, సీఎస్‌ దగ్గర తేల్చుకోవాలని సూచించారని, ఈ అంశాలపై తమతో ఎవరూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఇప్పుడున్న పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని, పాత పీఆర్సీ అయినా ఇవ్వాలని కోరామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారని అధికారులకు తెలిపామన్నారు. గత ప్రభుత్వాల్లో సాధించుకున్న ప్రయోజనాలు తీసివేయడం సరికాదని చెప్పామన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి కార్యాచరణ ఉంటుందని, డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు.


సీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే ఉద్యమం: బొప్పరాజు 

హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, ఏక్యూపీపై రాజీపడే ప్రసక్తే లేదని అధికారులకు స్పష్టం చేశామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రస్తుతం ఉన్న శ్లాబులనే కొనసాగించాలని, సీఎస్‌ కమిటీ సిఫారసులను అమలు చేయొద్దని కోరామన్నారు. నాలుగు అంశాలు పీఆర్సీ కమిషన్‌, అధికారుల కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పామని, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా జీవోలు ఇవ్వొద్దని కోరామన్నారు. రెండు రోజులు ఓపిక పట్టాలని సీఎంవో అధికారులు చెప్పారన్నారు. వీలైనంత వరకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. అప్పటి వరకు మూడు అంశాలు హోల్డ్‌లో ఉంచుతామని హామీ ఇచ్చారన్నారు.


సీఎం జగన్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. తమతో చర్చించకుండా అధికారులు తుది నిర్ణయం తీసుకోరని భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతపడుతుందన్నారు. ఉద్యోగులు 40శాతం హెచ్‌ఆర్‌ఏ కోల్పోయే పరిస్థితి వస్తుందని లెక్కలతో సహా చెప్పామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు ఆమోదించకపోతే తక్షణమే సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమబాట పడతామన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.